Moen Ali: ఇటీవల భారత్-ఇంగ్లండ్ మహిళా క్రికెట్ జట్ల మధ్య జరిగిన వన్డే మ్యాచ్ వివాదాస్పదంగా మారింది. మూడో వన్డేలో దీప్తి శర్మ ఇంగ్లండ్ బ్యాటర్ చార్లీ డీన్‌ను నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో మన్కడింగ్ అవుట్ చేయడంతో టీమిండియాకు క్రీడా స్ఫూర్తి లేదంటూ ఇంగ్లండ్ మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు. తాజాగా ఈ విషయంపై ఇంగ్లండ్ మెన్స్ క్రికెట్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ మాట్లాడాడు. మన్కడింగ్ అవుట్‌ను పూర్తిగా క్రికెట్ చట్టాల నుంచి తీసేసి చట్ట విరుద్ధమని ప్రకటించాలని డిమాండ్ చేశాడు. నాన్ స్ట్రైకర్ బ్యాటర్లు క్రీజు ముందుగానే వీడకుండా ఇతర మార్గాలను ఐసీసీ సిఫార్సు చేయాలన్నాడు. తానైతే ఈ తరహాలో రనౌట్ చేయనని మొయిన్ అలీ అన్నాడు. చిన్నతనంలో గార్డెన్‌లో క్రికెట్ ఆడిన సమయంలో కూడా తాను ఇలా అవుట్ చేయలేదని వివరించాడు.
Read Also:IND Vs SA: పోటాపోటీగా కోహ్లీ, రోహిత్ భారీ కటౌట్‌లు.. ఫోటోలు వైరల్
అయితే మన్కడింగ్ అవుట్ చట్టవిరుద్ధమేమీ కాదని మొయిలీ అలీ అన్నాడు. అయితే ఎవరూ దీనిని రెగ్యులర్ అవుట్‌గా పరిగణించరు అని.. ఇతర అన్ని వికెట్లు బ్యాటర్ ఇన్వాల్వ్‌మెంట్‌తో జరుగుతాయని.. కనీసం రనౌట్ అయినా ఇరు బ్యాటర్ల ప్రమేయంతోనే జరుగుతుందని తెలిపాడు. కానీ నాన్ స్ట్రైకర్ క్రీజు దాటితే బౌలర్ అవుట్ చేయడం ఎందుకో బాగోలేదని మొయిన్ అలీ అభిప్రాయపడ్డాడు. ఇతర ఆటగాళ్లపై పీకల వరకు కోపం ఉంటే తప్ప తాను మన్కడింగ్ అవుట్ చేయనని పేర్కొన్నాడు. క్రికెట్‌లో అన్నిసార్లు బౌలర్లు బంతి రిలీజ్ చేసే విషయాన్ని నాన్ స్ట్రైకింగ్‌లో ఉన్న సమయంలో కనిపెట్టలేమని.. కానీ నాన్ స్ట్రైకర్ క్రీజులోనే ఉండటం కూడా ముఖ్యమన్నాడు. కాగా ఇటీవల భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను మన అమ్మాయిలు 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే.