IPL Auction 2023: ఐపీఎల్ మినీ వేలం ముగిసింది. ఐపీఎల్ 2023 టైటిల్ లక్ష్యంగా అన్ని జట్లు వేలంలో ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. అయితే మినీ వేలం ముగిసిన తర్వాత ఎప్పటి లాగానే చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ పటిష్టంగా కనిపిస్తున్నాయి. మినీ వేలంలో ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ ఏకంగా రూ.16.25 కోట్లు ఖర్చు చేసింది. వేలంలో ఓ ఆటగాడి కోసం చెన్నై ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేయడం ఇదే తొలిసారి. 4డీ ప్లేయర్ బెన్ స్టోక్స్‌తో జట్టు బలాన్ని అమాంతం పెంచుకుంది. కెప్టెన్సీ ఆప్షన్ కోసమే చెన్నై యాజమాన్యం స్టోక్స్‌ను తీసుకున్నట్లు అర్థమవుతోంది.
Read Also: Veera Simha Reddy: మా బావ మనోభావాలు దెబ్బ తిన్నాయే.. చితక్కొట్టేసిన బాలయ్య
రూ.20.45 కోట్ల పర్స్ మనీతో ఐపీఎల్ 2023 మినీ వేలంలో పాల్గొన్న చెన్నై జట్లు ఒక్క స్టోక్స్ కోసమే రూ.16.25 కోట్లు ఖర్చు చేసింది. ధోనీ, స్టోక్స్ గతంలో రైజింగ్ పుణే తరఫున ఆడారు. చెన్నై బెస్ట్ ఆల్‌రౌండర్ డ్వాన్ బ్రావో రిటైర్మెంట్ ప్రకటించడంతో అతడి స్థానాన్ని స్టోక్స్‌తో భర్తీ చేసింది. మరోవైపు రహానెతో పాటు తెలుగు తేజం షేక్ రషీద్, నిషాంత్ సింధు, అజయ్ మండల్, భగత్ వర్మలను తీసుకుని 25 మంది సభ్యులతో జట్టును పూర్తి చేసింది. డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, రాయుడు, ధోనీ, జడేజా, స్టోక్స్, మొయిన్ అలీ, శివం దూబె, శాంట్నర్, దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే లాంటి ఆటగాళ్లతో చెన్నై దుర్భేద్యంగా మారింది. అటు ముంబై కూడా రోహిత్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, టిమ్ డేవిడ్, బ్రెవిస్, స్టబ్స్, తిలక్ వర్మ, కామరూన్ గ్రీన్ వంటి ఆటగాళ్లతో బ్యాటింగ్‌లో బలంగా కనిపిస్తోంది. బౌలింగ్‌లో బుమ్రా, ఆర్చర్, జై రిచర్డ్ సన్‌లతో పాటు పీయూష్ చావ్లా ఉండటంతో ముంబై జట్టు పటిష్టంగా కనిపిస్తోంది.