గతేడాది భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగిన ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో ఐదో మ్యాచ్‌ని రద్దు చేసిన విషయం తెలిసిందే. టీమిండియా శిబిరంలో కొందరికి కరోనా సోకిందన్న కారణంతో.. ఆ మ్యాచ్‌ని రద్దు చేసి, ఈ ఏడాదికి వాయిదా వేశారు. ఇప్పుడు ఆ మ్యాచ్‌ని రీషెడ్యూల్ చేశారు. జులై 1 – 5 మధ్య ఆ చివరి టెస్ట్‌ను నిర్వహించనున్నారు. ఇందుకు భారత జట్టుని బీసీసీఐ రీసెంట్‌గా ప్రకటించింది. ఇందులో సీనియర్ ఆటగాళ్లైన అజింక్యా రహానె, ఇషాంత్ శర్మలకు చోటు దక్కలేదు. వారి స్థానంలో యువ క్రికెటర్లైన కేఎస్ భారత్, ప్రసిద్ధ్ కృష్ణలను సెలెక్టర్లు ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలోనే.. ఆ ఇద్దరు సీనియర్లను తొలగించి మంచి పని చేశారంటూ ఆస్ట్రేలియన్ మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ స్పందించాడు.
‘‘అజింక్యా రహానె, ఇషాంత్ శర్మలను సెలెక్టర్లు జట్టు నుంచి తొలగించడం నిజంగా గొప్ప విషయమని నేను భావిస్తున్నా. ఎందుకంటే, ఆ ఇద్దరికి వయసు ఎక్కువవ్వడం వల్ల సామర్థ్యం మేరకు రాణించలేకపోతున్నారు. మీరు (సెలెక్టర్లు) ఇలాగే ముందుకు సాగండి. యువ ఆటగాళ్ళకు అవకాశాలిచ్చి, వారిని రొటేట్ చేయాలి. ఇలా చేయడం వల్ల, అనుభజ్ఞులతో కలిసి ఆడే అవకాశాన్ని యువ ఆటగాళ్లు పొందుతారు. విరాట్ కోహ్లీతో కలిసి శ్రేయస్ అయ్యర్ మరికొన్నాళ్లు ఆడబోతున్నాడు. సుధీర్ఘకాలం ఫామ్‌లో ఉండటానికి, కోహ్లీ నుంచి అతడు మరెన్నో మెలకువలను నేర్చుకుంటాడు. బౌలింగ్‌లో బుమ్రా, షమీలకు తోడుగా ప్రసిద్ధ్ కృష్ణ వస్తున్నాడు. ఆటగాళ్లను రొటేట్ చేయడమన్నది మంచి విధానం’ అని బ్రాడ్ హాగ్ చెప్పుకొచ్చాడు. కాగా.. ఈ సిరీస్ విషయానికొస్తే, భారత్ 2-1 ఆధిక్యంలో ఉంది.