PCB Demands Rejected By BCCI Ahead of IND vs PAK Match: భారత్-పాకిస్థాన్ క్రికెట్ సంబంధాలపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) పెట్టిన అన్ని డిమాండ్లను బీసీసీఐ తిరస్కరించినట్లు సమాచారం. టీ20 ప్రపంచకప్ 2026 నేపథ్యంలో భారత్‌తో మ్యాచ్ ఆడాలంటే.. పీసీబీ పలు షరతులు పెట్టిన విషయం తెలిసిందే. ఆ షరతులపై బీసీసీఐ తన స్పష్టమైన వైఖరిని తెలిపింది. పాకిస్థాన్ డిమాండ్లకు అస్సలు ఒప్పుకునేది లేదని బీసీసీఐ ఐసీసీకి తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది.
తాజా సమాచారం ప్రకారం.. పాకిస్థాన్‌తో ఎలాంటి ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడే ఆలోచనలో భారత్ లేదని బీసీసీఐ తేల్చి చెప్పింది. గత కొన్ని సంవత్సరాలుగా రాజకీయ, భద్రతా పరిస్థితుల కారణంగా రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక క్రికెట్ నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఈ విషయంలో ఎలాంటి మార్పు లేదని భారత బోర్డు స్పష్టం చేసింది. అదేవిధంగా ఆసియా కప్ లేదా వరల్డ్‌కప్ మ్యాచ్‌ల కోసం భారత్ పాకిస్థాన్‌కు వెళ్లబోదని కూడా స్పష్టంగా తెలిపింది. భవిష్యత్తులో జరిగే ఏ అంతర్జాతీయ టోర్నమెంట్ అయినా.. భారత్ పాల్గొంటే, అది న్యూట్రల్ వేదికలోనే జరుగుతుందని బోర్డు వర్గాలు పేర్కొంటున్నాయి.
మరో కీలక అంశంగా బంగ్లాదేశ్‌తో ద్వైపాక్షిక సిరీస్‌ల విషయమూ చర్చకు వచ్చింది. తాజా పరిణామాల నేపథ్యంలో బంగ్లాదేశ్‌తో కూడా ప్రస్తుతం ఎలాంటి ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడే ప్రణాళిక లేదని సమాచారం. ఈ నిర్ణయం కూడా క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌లలో హ్యాండ్‌షేక్ అంశంపై మాత్రం ఇంకా చర్చలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఆట ముగిసిన తర్వాత లేదా మ్యాచ్ ముందు ఆటగాళ్ల మధ్య హ్యాండ్‌షేక్ ప్రోటోకాల్‌పై స్పష్టత రావాల్సి ఉంది. ఈ అంశంపై తుది నిర్ణయం ఇంకా వెలువడలేదని సమాచారం.
Also Read: Nandan Yadav: ఎంఎస్ ధోనీలా సిక్సులు కొట్టాలి.. ఇదే మేం నేర్చుకున్న గుణపాఠం: నేపాల్ క్రికెటర్
భారత్‌తో మ్యాచ్ ఆడాలంటే ఐసీసీకి పీసీబీ మూడు డిమాండ్స్ పెట్టింది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగాలి, మ్యాచ్ ముందు అండ్ తర్వాత ప్లేయర్స్ హ్యాండ్‌షేక్ ఇచ్చుకోవాలి, ఎక్కువ వాటా శాతం అంటూ డిమాండ్స్ చేసింది. పీసీబీ పెట్టిన డిమాండ్లకు బీసీసీఐ ‘నో’ చెప్పినట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయాలు భారత్–పాకిస్థాన్ క్రికెట్ సంబంధాల్లో మరో కీలక మలుపుగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భారత్ తన భద్రత, విధానాల విషయంలో ఎలాంటి రాజీకి సిద్ధంగా లేదని ఈ పరిణామాలు మరోసారి స్పష్టం చేస్తున్నాయి.
