Rahul Dravid: ఆసియా కప్, ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌లో టీమిండియా పేలవ ప్రదర్శన భారత అభిమానులకు కలవరపరుస్తోంది. ముఖ్యంగా టీమ్ పేలవమైన బౌలింగ్ ప్రదర్శనతో క్రికెట్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురవుతున్నారు. దీంతో రాబోయే టీ20 ప్రపంచ కప్‌ను దృష్టిలో ఉంచుకొని టీమ్‌కు మరిన్ని ప్రాక్టీస్ మ్యాచ్‌లు, వార్మప్ మ్యాచ్‌లు నిర్వహించడం మేలని కోచ్ రాహుల్ ద్రవిడ్ భావిస్తున్నాడు. ఈ మేరకు ఆస్ట్రేలియాలో ఎక్కువ వార్మప్ మ్యాచ్‌లను నిర్వహించాలని బీసీసీఐని కోరాడు. ద్రవిడ్ విజ్ఞప్తితో పాటు అభిమానుల నుంచి వస్తోన్న విమర్శల నేపథ్యంలో ద్రవిడ్ ప్రతిపాదనకు బీసీసీఐ అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతానికైతే ప్రపంచ కప్ ముందు టీమిండియాకు రెండు వార్మప్ మ్యాచ్‌లు షెడ్యూల్ అయ్యాయి. అయితే వీటి సంఖ్య 4కి పెరిగే అవకాశం కనిపిస్తోంది. అయితే కీలక టోర్నీకి ముందు వార్మప్ మ్యాచ్‌లు పెరిగితే టీమిండియా ప్రదర్శన మెరుగుపడుతుందా అన్నదే కీలక ప్రశ్నగా మారింది.
Read Also:Azharuddin Press Meet Live: మ్యాచ్ టిక్కెట్లపై అజారుద్దీన్ కీలక ప్రెస్ మీట్
మరోవైపు బుమ్రా జట్టులోకి వస్తేనే టీమిండియా బౌలింగ్ బలం పెరుగుతుందని మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ అన్నాడు. బుమ్రా అయితే యార్కర్లు సంధించడంలో దిట్ట అని.. తొలి టీ20లో యార్కర్లు వేసేందుకు భువనేశ్వర్, హర్షల్ పటేల్ ప్రయత్నించినా సఫలం కాలేకపోయారని బంగర్ తెలిపాడు. మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయగల సత్తా బుమ్రా సొంతమన్నాడు. అలాగే డెత్ ఓవర్లలో యార్కర్లు వేయడం ద్వారా బ్యాటర్లను అడ్డుకోగలడని సంజయ్ బంగర్ అభిప్రాయపడ్డాడు. అటు చివరి ఓవర్లు వేసేటప్పుడు బౌలింగ్‌లో పేస్ ఉండాలని.. భువనేశ్వర్‌లో ఇదే మిస్ అవుతుందని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సల్మాన్ భట్ అన్నాడు. చివరి ఓవర్లలో స్లో డెలివరీలు వేయడం వల్ల ఒరిగేదేమీ ఉండదన్నాడు.