Bangladesh Won Against Netherlands In T20 World Cup: టీ20 వరల్డ్‌కప్ – సూపర్ 12లో భాగంగా సోమవారం నెదర్లాండ్స్, బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో.. బంగ్లాదేశ్ 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. బంగ్లా జట్టు కుదిర్చిన 145 పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు నెదర్లాండ్ చివరివరకూ పోరాడింది కానీ, చేధించలేకపోయింది. కాలిన్ అక్కర్‌మన్ (62) మినహాయించి.. టాపార్డర్ సహా మిగతా బ్యాటర్లందరూ చేతులు ఎత్తేశారు. చివర్లో పాల్ వాన్ కూడా తన జట్టుని గెలిపించుకోవడం కోసం సాయశక్తులా ప్రయత్నించాడు కానీ, అప్పటికే పరిస్థితులు చెయ్యి దాటిపోవడంతో ఏం చేయలేకపోయాడు. ఫలితంగా.. బంగ్లాదేశ్ విజయాన్ని కైవసం చేసుకోగలిగింది.
తొలుత టాస్ గెలిచిన నెదర్లాండ్స్ జట్టు ఫీల్డింగ్ ఎంపిక చేసుకుంది. దీంతో రంగంలోకి దిగిన బంగ్లాదేశ్ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. మొదట్లో ఓపెనర్లు నజ్ముల్(25), సౌమ్య సర్కార్(14) శుభారంభాన్నే అందించారు. ఆ తర్వాత నెదర్లాండ్ బౌలర్స్ ధాటికి వరుసగా వికెట్లు కోల్పోయింది. ఆఫిఫ్ హుసేన్(38), ముసద్దక్ హుసేన్(20 నాటౌట్) కొంచెం దూకుడుగా రాణించడంతో.. బంగ్లా జట్టు 144 పరుగులు చేయగలిగింది. ఇక 145 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్‌కి మొదట్లోనే గట్టి షాక్ తగిలింది. సున్నా పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. అనంతరం ఒకరి తర్వాత మరొకరు పెవిలియన్ దాటి పట్టారు.
కాలిన్ అక్కర్‌మన్ (62) ఒక్కడే జట్టుని లాక్కొచ్చాడు. తన జట్టుని గెలిపించుకోవడం కోసం తీవ్రంగా శ్రమించాడు. ఆచితూచి ఆడుతూ.. వీలు దొరికినప్పుడల్లా భారీ షాట్లు బాదుతూ వచ్చాడు. మధ్యలో స్కాట్(16), చివర్లో పాల్ వాన్(24) చేయూతనందించినా.. ఫలితం లేకుండా పోయింది. కేవలం 9 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. బంగ్లాదేశ్ బౌలర్లలో తస్కిన్ అహ్మద్ 4 వికెట్లతో చెలరేగాడు.