మహిళల ప్రపంచకప్‌లో టీమిండియా అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. శనివారం నాడు తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై భారత మహిళలు ఓటమి పాలయ్యారు. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో గెలుపొంది సెమీస్ బెర్త్ ఖాయం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 277 పరుగులు చేసింది. మిథాలీరాజ్ (68), యస్తికా భాటియా (59), హర్మన్ ప్రీత్‌కౌర్ (57 నాటౌట్), పూజా వస్త్రాకర్ (34) రాణించారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఆసీస్ 49.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 280 పరుగులు చేసింది విజయం సాధించింది. చివరి 12 బంతుల్లో ఆసీస్ విజయానికి 11 పరుగులు అవసరం కాగా 49వ ఓవర్ వేసిన మేఘన సింగ్ కేవలం మూడు పరుగులు మాత్రమే ఇచ్చి ఓ వికెట్ తీసింది. చివరి ఓవర్‌లో ఆసీస్ విజయానికి 8 పరుగులు అవసరం కాగా జూలన్ గోస్వామి బౌలింగ్ చేసింది. ఫస్ట్ బాల్‌కే ఆమె బౌండరీ ఇవ్వడంతో భారత్ ఆశలు సన్నగిల్లాయి. మరో రెండు బంతుల్లోనే 2, 4 పరుగులు ఇవ్వడంతో ఆస్ట్రేలియా విజయం ముగిసింది. ఈ ఓటమితో టీమిండియా సెమీస్ ఆశలు దాదాపుగా గల్లంతయ్యాయి.
ఒకవేళ సెమీస్‌కు వెళ్లాలంటే తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో భారత్ తప్పకుండా గెలవాల్సి ఉంటుంది. మంగళవారం బంగ్లాదేశ్, ఆదివారం సౌతాఫ్రికాతో విజయం సాధించాలి. అంతేకాదు న్యూజిలాండ్ తన తదుపరి మ్యాచ్‌లో ఓడిపోవాలి. ఇలా జరిగితేనే మనం సెమీస్‌కు వెళ్తాం. ప్రస్తుతం పాయింట్స్ టేబుల్‌లో భారత్ 5 మ్యాచ్‌లలో 2 గెలిచి 4 పాయింట్లతో చివరి స్థానంలో ఉంది. 5 విజయాలతో ఆసీస్ సెమీస్‌కు వెళ్లింది.