Asian Games 2026 Cricket Schedule: ప్రతిష్టాత్మక ఆసియా గేమ్స్ 2026 క్రికెట్ షెడ్యూల్ అధికారికంగా విడుదలైంది. జపాన్‌లోని ఐచి-నగోయా నగరాల్లో సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జరగనున్న ఈ టోర్నీలో క్రికెట్ నాలుగోసారి చోటు దక్కించుకుంది. పురుషుల క్రికెట్ టోర్నీ సెప్టెంబర్ 24 నుంచి ప్రారంభం కానుండగా.. మహిళల టోర్నీ సెప్టెంబర్ 17 నుంచి ఆరంభం కానుంది. అన్ని మ్యాచ్‌లు టీ20 ఫార్మాట్‌లో జరగనున్నాయి. అంతేకాకుండా ఈ మ్యాచ్‌లకు పూర్తి అంతర్జాతీయ హోదా కూడా ఉండనుంది.
2023లో చైనాలోని హాంగ్జౌలో జరిగిన ఆసియా క్రీడల్లో భారత్ పురుషుల, మహిళల జట్లు స్వర్ణ పతకాలు సాధించాయి. దీంతో ఈసారి డిఫెండింగ్ ఛాంపియన్లుగా బరిలోకి దిగుతున్నాయి. టైటిల్‌ను నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో ఇరు జట్లు సన్నద్ధమవుతున్నాయి. పురుషుల విభాగంలో భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక జట్లు టాప్ సీడెడ్ టీమ్‌లుగా నేరుగా క్వార్టర్‌ఫైనల్స్‌కు అర్హత సాధించాయి. ఇక గ్రూప్-ఏలో ఆఫ్ఘానిస్థాన్, జపాన్, నేపాల్.. గ్రూప్-బీలో హాంకాంగ్, మలేషియా, ఒమన్ జట్లు మిగిలిన నాలుగు క్వార్టర్‌ఫైనల్ బెర్త్‌ల కోసం పోటీ పడనున్నాయి. ప్రతి గ్రూప్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచే జట్లు క్వార్టర్‌ఫైనల్స్‌కు చేరుకుంటాయి.
క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు మాత్రం ఒక్కటే అవకాశం ఉంది. ఈ రెండు జట్లు నేరుగా క్వార్టర్‌ఫైనల్స్‌లోకి ప్రవేశించడంతో.. లీగ్ దశలో తలపడే అవకాశం లేదు. ఇరు జట్లు గెలుస్తూ ముందుకు వస్తే మాత్రమే సెమీఫైనల్ లేదా ఫైనల్‌లో భారత్-పాకిస్థాన్ పోరు జరిగే అవకాశముంది. మహిళల విభాగంలో భారత జట్టు క్వార్టర్‌ఫైనల్‌లో జపాన్‌తో తలపడనుంది. ఆ మ్యాచ్‌లో విజయం సాధిస్తే సెమీఫైనల్‌లో బంగ్లాదేశ్ లేదా చైనా జట్లలో ఒకదానితో పోటీ పడుతుంది. మరోవైపు శ్రీలంక-మలేషియా, పాకిస్థాన్-థాయ్‌లాండ్ మధ్య క్వార్టర్‌ఫైనల్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఆ మ్యాచ్‌ల విజేతలు రెండో సెమీఫైనల్‌లో తలపడతారు.
ఈ టోర్నీలో మహిళల జట్టుకు హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్‌గా కొనసాగుతుండగా, స్మృతి మంధాన వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనుంది. పురుషుల జట్టుకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా. తిలక్ వర్మ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యారు. ఇటీవల జింబాబ్వేపై మెరుపు ప్రదర్శనతో ప్రపంచ రికార్డులు సృష్టించిన 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కూడా భారత 15 మంది సభ్యుల జట్టులో చోటు దక్కించుకోవడం విశేషం. ఆసియా క్రీడల వేదికగా మరోసారి స్వర్ణ పతకాన్ని అందుకోవాలనే లక్ష్యంతో టీమిండియా బరిలోకి దిగనుంది.

