ఇటీవలి కాలంలో టీమిండియా పేసర్ ‘అర్ష్‌దీప్ సింగ్’ పేరు బాగా వినిపిస్తోంది. టీ20, వన్డేలలో నిలకడగా రాణించడమే అందుకు కారణం. ముఖ్యంగా పొట్టి ఫార్మాట్లో అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. అంతేకాదు ఐసీసీ టోర్నీలలో కూడా రాణిస్తున్నాడు. టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్లో అర్ష్‌దీప్ అద్భుత స్పెల్ వేశాడు. తన 4 ఓవర్ల కోటాలో 20 రన్స్ మాత్రమే ఇచ్చి రెండు కీలక వికెట్స్ పడగొట్టాడు. పొట్టి ఫార్మాట్లో 100 వికెట్ల మైలురాయిని అందుకున్న తొలి భారత బౌలర్ అతడే కావడం విశేషం. ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో కూడా రాణిస్తున్నాడు.
అర్ష్‌దీప్ సింగ్ రాంచి వన్డేలో 64 రన్స్ ఇచ్చి రెండు వికెట్స్ పడగొట్టాడు. రాయ్‌పుర్ వన్డేలో 54 పరుగులు ఇచ్చి రెండు వికెట్స్ తీశాడు. రాయ్‌పుర్‌లో ఆరంభ ఐదు ఓవర్లలో 20 రన్స్ కూడా ఇవ్వలేదు. తరువాతి ఓవర్లలో పరుగులు ఇచ్చుకున్నాడు. ఈ గణాంకాలు గొప్పగా అనిపించకపోవచ్చు కానీ.. దక్షిణాఫ్రికా స్కోరు 332, 362 చూస్తే మాత్రం బాగా బౌలింగ్ వేశాడు అని అనాల్సిందే. రెండు మ్యాచ్‌లలో అర్ష్‌దీప్ ఛేదనలో బౌలింగ్ చేశాడు. భారీగా మంచు కురుస్తున్నా.. ఏ దశలోనూ బ్యాటర్లకు తనపై ఆధిపత్యాన్ని ప్రదర్శించే అవకాశమివ్వలేదు. సహకారం లేని పిచ్‌పై టాప్ బ్యాటర్లను భారీగా రన్స్ చేయకుండా ఆపాడు.
జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్‌ల గైర్హాజరీలో అర్ష్‌దీప్ సింగ్ బాధ్యతాయుతంగా బౌలింగ్ చేశాడు. జట్టులో మరొకరు అతడికి సహకరించే ఉంటే.. భారత్ ఇప్పటికే సిరీస్‌ను సొంతం చేసుకుని ఉండేది. హర్షిత్ రాణా, ప్రసిద్ద్ కృష్ణలు ఓవర్‌కు పదికి పైగా పరుగులు ఇచ్చారు. రెండు వన్డేలలో అర్ష్‌దీప్ షార్ట్ పిచ్ బంతులతో పరుగులను కట్టడి చేశాడు. ఇటీవలి 10 మ్యాచ్‌ల్లో 16 వికెట్లు పడగొట్టగా, ఎకానమీ 5 మాత్రమే. అర్ష్‌దీప్ గణాంకాలు మెరుగ్గానే ఉన్నా.. వన్డేల్లో అతడికి తగినన్ని అవకాశాలు రాలేదు. 2022లో వన్డే అరంగేంట్ర చేసినా ఇప్పటివరకు 13 మ్యాచ్‌లే ఆడాడు. వన్డే ప్రపంచకప్ 2027 సమీపిస్తున్న నేపథ్యంలో అర్ష్‌దీప్‌కు మరిన్ని అవకాశాలు ఇస్తే.. బుమ్రా, సిరాజ్‌లకు బ్యాకప్‌గా ఉంటాడు.