Arshdeep Singh jokes on Jasprit Bumrah bowling: సోషల్ మీడియాలో చురుకుగా ఉండే టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ ఇప్పుడు భారత జట్టుకు దూరమైన విషయం తెలిసిందే. మ్యాచ్‌కు ముందు, మ్యాచ్ అనంతరం సహచరులతో యూజీ చేసే అల్లరిని మనం మిస్ అయ్యాము. అయితే ఆ లోటును పూడ్చడానికి పేస్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ వచ్చాడు. ఇటీవలి రోజుల్లో చహల్ మాదిరే అర్ష్‌దీప్ కూడా సహచరులతో కలిసి సరదాగా రీల్స్ చేస్తున్నాడు. విశాఖలో దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డే మ్యాచ్ అనంతరం స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీతో చేసిన రీల్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇక కటక్ వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్ అనంతరం స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాతో సరదాగా చేసిన రీల్ ఇప్పుడు అభిమానులను ఆకట్టుకుంటోంది.
జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో మరింత కసరత్తు చేయాలని, మరిన్ని వికెట్లు తీశాకే తనతో రీల్ చేస్తానని అర్ష్‌దీప్ సింగ్ అన్నాడు. ‘బుమ్రా బాయ్ బౌలింగ్‌లో మరింత కసరత్తు చేయాలి. అతడు మరికొన్ని వికెట్లు తీసుకోవాలి. అప్పుడే ఇన్‌స్టాగ్రామ్‌లో జెస్సీ బాయ్‌తో రీల్ చేస్తా. బుమ్రాతో నాకు మంచి అనుబంధం ఉంది. మేము ఇద్దరం పంజాబీలమే. బుమ్రా జట్టులో సీనియర్ అయినప్పటికీ.. యువ క్రికెటర్లతో సరదాగా ఉంటాడు. ఎవరితోనూ ఎప్పుడూ కఠినంగా ఉండడు. అందరితో మర్యాదగా మాట్లాడతాడు. ప్లేయర్స్ అందరూ జెస్సీ బాయ్‌ని ఇష్టపడుతారు. బౌలింగ్‌లో ఏ డౌట్ ఉన్నా అడిగితే వెంటనే స్పందిస్తాడు. అతడితో కలిసి బౌలింగ్ చేయడంను ఆస్వాదిస్తా’ అని అర్ష్‌దీప్ చెప్పాడు.
జస్ప్రీత్ బుమ్రా మూడు ఫార్మాట్‌లలో టాప్ పేసర్‌గా ఉన్నాడు. అర్ష్‌దీప్ సింగ్ టీ20 స్పెషలిస్ట్ బౌలర్‌గా పేరుగాంచాడు. ఇప్పుడిప్పుడే వన్డేలలో రాణిస్తున్నాడు. టీ20ల్లో వంద వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా అర్ష్‌దీప్ నిలిచిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు 69 మ్యాచ్‌ల్లో 107 వికెట్లు పడగొట్టాడు. కటక్ టీ20 మ్యాచ్‌లో బుమ్రా కూడా టీ20ల్లో 100 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. 81వ టీ20 మ్యాచ్‌లో 100 వికెట్స్ పడగొట్టాడు. ఈ జాబితాలో హార్దిక్ పాండ్యా 99, యుజ్వేంద్ర చహల్ 96, భువనేశ్వర్ కుమార్ 90 టాప్ 5లో ఉన్నారు. ఆ మధ్య భువనేశ్వర్, చహల్ 100 వికెట్ల మైలురాయి వైపు దూసుకురాగా.. ఫామ్ కోల్పోవడంతో భారత జట్టులో చోటు కోల్పోయారు.