(జూన్ 30తో ‘బాటసారి’కి 60 ఏళ్ళు)
బహుముఖ ప్రజ్ఞాశాలి భానుమతి, ఆమె భర్త దర్శకనిర్మాత పి.రామకృష్ణ నెలకొల్పిన ‘భరణీ’ సంస్థతో నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావుకు విడదీయరాని బంధం ఉంది. అందరూ ‘దేవదాసు’తో ఏయన్నార్ తొలిసారి భగ్నప్రేమికునిగా నటించారు అని అంటూ ఉంటారు. కానీ, భరణీవారి ‘లైలా-మజ్ను’లోనే అక్కినేని తొలిసారి విఫల ప్రేమికునిగా కనిపించారు. “రత్నమాల, లైలా-మజ్ను, ప్రేమ, చక్రపాణి, విప్రనారాయణ, బాటసారి, గృహలక్ష్మి” వంటి భరణీ సంస్థ నిర్మించిన చిత్రాలలో ఏయన్నార్ నటించారు. ఈ సినిమాలన్నీ అక్కినేనికి నటునిగా మంచి పేరే సంపాదించి పెట్టాయి. వీటిలో శరత్ చంద్ర ఛటర్జీ రాసిన ‘బడా దీదీ’ బెంగాలీ నవల ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘బాటసారి’. తాను నటించిన చిత్రాలలో తన మనసును బాగా హత్తుకున్న చిత్రం ‘బాటసారి’ అని అక్కినేని అనేక సార్లు చెప్పారు. 1961 జూన్ 30న విడుదలైన ‘బాటసారి’ చిత్రం తమిళంలో ‘కానల్ నీర్’ పేరుతో రూపొందింది. ‘గృహలక్ష్మి’ మినహాయిస్తే ఏయన్నార్ తో భరణీ సంస్థ నిర్మించిన చిత్రాలన్నీ తమిళంలోనూ ఏకకాలంలో నిర్మితమయ్యాయి. రెండు భాషల్లోనూ ఏయన్నార్, భానుమతి నాయకానాయికలుగా నటించేవారు. అదే తీరున ‘బాటసారి’ కూడా తమిళ జనం ముందు నిలచింది.
అమలిన ప్రేమకు నిదర్శనంగా ‘బాటసారి’ కథ సాగుతుంది. జమీందార్ కొడుకైన సురేంద్రనాథ్ కు బాగా చదువుకోవాలని ఉంటుంది. అయితే అతని ఆరోగ్యం దృష్ట్యా మంచి మనసు గల సవతి తల్లి, ఎక్కడికీ పంపించ డానికి ఇష్టపడదు. కానీ, సురేంద్ర ఇంట్లోంచి వెళ్ళిపోయి, మదరాసు చేరతాడు. అక్కడ ఓ ధనవంతుడు తన పాపకు ట్యూషన్ చెప్పమని ఆశ్రయమిస్తాడు. బాలవితంతువు అయిన అతని పెద్దకూతురు మాధవి, తన చెల్లెలికి చదువు చెబుతున్న సురేంద్రకు కావలసినవన్నీ సమకూర్చి పెడుతుంది. కానీ, వారిద్దరూ ఏ రోజునా పెద్దగా మాట్లాడుకొని ఉండరు. కానీ, సురేంద్ర అంటే మాధవికి, ఆమె అంటే అతనికీ ఓ ప్రత్యేక అభిమానం నెలకొంటుంది. వారిద్దరి మధ్య ఏదో ఉందన్న పుకారు లేస్తుంది. అదే సమయంలో పాపకు సరిగా పాఠాలు చెప్పడం లేదని సురేంద్రను, మాధవి చీవాట్లు పెడుతుంది. సురేంద్ర అక్కడ నుండి పోయి, ఓ ప్రమాదానికి గురవుతాడు. ఆయన తండ్రి, ఆసుపత్రిలో చేర్పిస్తాడు. శాంతి అనే అమ్మాయిని ఇచ్చి పెళ్ళి జరిపిస్తారు. సురేంద్ర జమీన్ ను చూసుకొనే బాధ్యత తీసుకుంటాడు. అక్కడ మాధవి తన తమ్మునికి పెళ్ళి చేసి, ఇంటి బాధ్యతను అతని భార్యకు అప్పగించి, తన అత్తింటికి వెళ్తుంది. అక్కడ పన్ను కట్టలేదన్న నెపంతో ఆమె ఇంటిని సురేంద్ర ఎస్టేట్ మేనేజర్ జప్తు చేయించాలని చూస్తాడు. ఆ విషయం జమీందార్ తోనే మాట్లాడాలని వస్తుంది. ఆమెను సురేంద్రతో కలవనివ్వకుండా చేస్తాడు మేనేజర్. అసలు విషయం తెలుసుకున్న సురేంద్ర, మాధవి ఇంటి పత్రాలు ఇవ్వడానికి గుర్రం మీద వెళ్తాడు. కిందపడిపోతాడు. మాధవి అతణ్ణి చేరుకుంటుంది. సురేంద్ర, మాధవి ప్రేమను కోరుకుంటూ ఆమె ఒడిలోనే కన్నుమూయడంతో కథ ముగుస్తుంది.
సురేంద్రగా ఏయన్నార్, మాధవిగా భానుమతి, శాంతిగా షావుకారు జానకి, మేనేజర్ గా ముదిగొండ లింగమూర్తి నటించారు. ఇతర పాత్రల్లో రమణమూర్తి, వంగర, బి.ఆర్.పంతులు, దేవిక, సూర్యకాంతం, ఎల్.విజయలక్ష్మి, లక్ష్మీరాజ్యం నటించారు. ఈ చిత్రానికి సముద్రాల వేంకటరాఘవాచార్య మాటలు, పాటలు పలికించగా, మాస్టర్ వేణు సంగీతం సమకూర్చారు. ఇందులోని “ఓ బాటసారీ… నను మరువకోయి…”, “కనులకు దోచి చేతికందని ఎండమావులుంటయ్..”, “లోకమెరుగని బాలా…” అన్న పాటలు ఆకట్టుకున్నాయి. ఈ చిత్రం ఓ మంచి సినిమాగా మిగిలింది. ఏయన్నార్ తన నటజీవితంలో మరపురాని చిత్రంగా ‘బాటసారి’ని చెప్పుకున్నారు. అయితే ఆశించిన స్థాయిలో జనాన్ని ఆకట్టుకోలేక పోయింది ‘బాటసారి’.