NTV Telugu Site icon

Waltair Veerayya Movie Review: వాల్తేరు వీరయ్య

Chiranjeevi

Chiranjeevi

Waltair Veerayya Movie:  మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచీ తన ప్రతి చిత్రంలో ఇతర హీరోలతో కలసి నటిస్తూ సాగుతున్నారు. ‘ఖైదీ నంబర్ 150’లో తనయుడు రామ్ చరణ్ తో కాసేపు స్క్రీన్ పంచుకున్న చిరంజీవి, ఆ తరువాత అమితాబ్ బచ్చన్, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి వంటివారితో జోడీ కట్టి ‘సైరా…నరసింహారెడ్డి’లో అలరించారు. మొన్న ‘ఆచార్య’లో తనయుడు రామ్ చరణ్ తోనూ, తరువాత ‘గాడ్ ఫాదర్’లో సల్మాన్ ఖాన్ తోనూ సాగారు. ఇప్పుడు ‘వాల్తేరు వీరయ్య’లో రవితేజతో కలసి నటించారు. రీఎంట్రీ తర్వాత సంక్రాంతి బరిలోనే ‘ఖైదీ నంబర్ 150’గా అలరించిన చిరంజీవి ఈ సారి పొంగల్ హంగామాలో ‘వాల్తేరు వీరయ్య’గా రావడంతో అభిమానుల్లో అంచనాలు అధికమయ్యాయి.

‘వాల్తేరు వీరయ్య’ కథ విషయానికి వస్తే… జాలారి పేటలో ఉండే వాల్తేరు వీరయ్య మాటంటే అక్కడి వారికి వేదవాక్కు. కానీ, అతనికే తెలియకుండా కొందరు సముద్రపు ఒడ్డున డ్రగ్స్ సరఫరా చేస్తూంటారు. ఈ విషయం తెలుసుకున్న ఏసీపీ విక్రమ్ సాగర్ జాలరి పేటకు వెళ్ళి డ్రగ్స్ దందా చేసేవారిని అరెస్ట్ చేస్తాడు. అడ్డు వచ్చిన వీరయ్యనూ పట్టుకుపోతాడు విక్రమ్. నిజానికి వీరయ్య, విక్రమ్ ఇద్దరూ ఒకే తండ్రి బిడ్డలు, తల్లులు వేరు. ఒకరికొరంటే అభిమానం ఉన్నా, తమ పరిస్థితుల కారణంగా దానిని బహిర్గతం చేయరు. ఈ డ్రగ్స్ దందాకు సాలమోన్ సీజర్ ముఖ్య సూత్రధారి. వీరయ్య కటకటాల వెనుక ఉన్న సమయంలో విక్రమ్ దుండగుల చేతుల్లో మరణిస్తాడు. తమ్ముడు చనిపోవడానికి అసలు కారకుడైన ప్రకాశ్ రాజ్ మలేసియా ఉన్నాడని తెలుసుకొని వీరయ్య అక్కడకు వెళ్తాడు. ఆ తరువాత ఏం జరిగింది అన్నదే కథ.

ప్రథమార్ధం చిరంజీవి ఎంటర్ టైన్ మెంట్ తో భళా అనిపించింది. ఆ తరువాత బ్రదర్ సెంటిమెంట్ తో ఆకట్టుకున్నారు. రవితేజ పాత్ర నిడివి తక్కువే అయినా తన ఎపిసోడ్ మొత్తం ఆసక్తికరంగా ఉంది. ఇక శ్రుతి హాసన్ సీబీఐ ఆఫీసర్ గా వైవిధ్యం చూపించే ప్రయత్నం చేశారు. మిగిలిన తారాగణమంతా తమ పాత్రలకు తగ్గట్టుగానే సాగారు. చిరంజీవి సినిమా అంటే దేవిశ్రీ ప్రసాద్ ప్రత్యేక శ్రద్ధ వహించి ట్యూన్స్ కంపోజ్ చేస్తారనే ప్రచారం ఉంది. అందుకు తగ్గట్టుగానే దేవిశ్రీ ఇందులోనూ బాణీలు కట్టారు. “బాస్ పార్టీ…” , “పూనకాలు లోడింగ్…” పాటలు నిజంగానే కిర్రెక్కించాయి. “నువ్వే శ్రీదేవైతే…నేనే చిరంజీవంటా…”, “నీకేమో అందమెక్కువ…” పాటలు కూడా ఆకట్టుకుంటాయి. ఆర్ట్ డైరెక్టర్ ఏ.యస్. ప్రకాశ్ రూపొందించిన సెట్స్ కనువిందు చేశాయి. దర్శకుడు కె.రవీంద్ర (బాబీ) కథలో పాత సినిమా పోకడలు కొన్ని కనిపిస్తాయి. సన్నివేశాల చిత్రీకరణలో బాబీ పట్టు చూపించారనే చెప్పాలి. నిర్మాతలు నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ కథకు తగ్గ రీతిలో ఖర్చు చేశారు.

ప్లస్ పాయింట్స్:
– చిరంజీవి పంచిన వినోదం
– రవితేజ పాత్ర
– ఆకట్టుకొనే పాటలు
– మేకింగ్ వేల్యూస్

మైనస్ పాయింట్స్:
– కథలో కొత్తదనం లేకపోవడం
– కొన్ని సీన్స్ సాగదీసినట్టు ఉండడం

రేటింగ్: 2.75/5

ట్యాగ్ లైన్: ‘లోడింగ్’ వీరయ్య!