తమిళ యంగ్ హీరో విష్ణు విశాల్ సినిమా అంటే తెలుగులో సదరు చిత్రానికి ప్రెజెంటర్ గా మాస్ మహరాజా రవితేజ పేరు జోడీ అయి ఉంటుంది. అదే తీరున విష్ణు విశాల్ నిర్మించి, నటించిన తాజా చిత్రం ‘మట్టి కుస్తీ’కి కూడా రవితేజ సమర్పకునిగా వ్యవహరించారు. ఈ చిత్రం శుక్రవారం జనం ముందు నిలిచింది.
‘మట్టి కుస్తీ’ కథ ఏమిటంటే.. మళయాళ సీమలో ఉన్న తెలుగు కుటుంబంలో పుట్టిన కీర్తికి జాతీయ స్థాయిలో రెజ్లర్ గా రాణించాలన్నది అభిలాష. ఆమెకు పెళ్ళి సంబంధాలు వస్తూ ఉంటాయి. కానీ, ఆమె నిర్మొహమాటానికి, కుస్తీ పడుతుందని తెలిసి వచ్చినవారు మెచ్చరు. దాంతో తండ్రికి హార్ట్ ఎటాక్ వస్తుంది. ఇక వీరా ఆంధ్ర ప్రాంతానికి చెందినవాడు. ఎనిమిదో తరగతి చదువుకున్న వీరాకు తనకంటే తక్కువ చదివిన అమ్మాయి, అందునా పొడవైన జడ ఉన్న పిల్లని పెళ్ళాడాలని కోరిక. ఇతగాడికి కూడా ఏ అమ్మాయి నచ్చదు. వీరా మేనమామకు కీర్తి బాబాయ్ ఫ్రెండ్. మాటల్లో వీరాకు తన అన్న కూతురుతో సంబంధం కలుపుతాడు. అలా ఆంధ్రా అబ్బాయికి, మళయాళ అమ్మాయికి పెళ్ళవుతుంది. భార్య తనకంటే తక్కువ చదివిందని, పొడవైన జడ ఉందని మురిసిపోతుంటాడు వీరా. నిజానికి ఆమె బీఎస్సీ చదివి ఉంటుంది. రెజ్లర్ కావడంతో బాబ్డ్ హెయిర్ తో ఉంటుంది. వీరా వాళ్ళ ఊరిలో ఓ ధనవంతుడు ఫ్యాక్టరీ పెట్టి ఉంటాడు. ఆ కర్మాగారం నుండి వెలువడే వ్యర్థాలతో ప్రజలకు అనారోగ్యం కలుగుతూ ఉంటుంది. దీనిపై కోర్టుకు వెళతారు. వీరా వాళ్ళే గెలుస్తారు. దాంతో వీరా భార్య కీర్తికి వార్నింగ్ ఇస్తారు ఆ ఫ్యాక్టరీ యజమాని, అతని గూండాలు.
అమ్మవారి దేవాలయం దగ్గర వీరాను ఎటాక్ చేస్తారు. తన భర్తపై చేయి చేసుకున్నవారిని ఇట్టే మట్టికరిపిస్తుంది కీర్తి. అది చూసి, ఫ్యాక్టరీ యజమాని కంగు తింటాడు. వీరా తేరుకోలేడు. అందరికీ వీరా భార్య కీర్తి అంటే గౌరవం పెరుగుతుంది. ఆ పై అన్ని విషయాల్లోనూ ఆమెకు ప్రాధాన్యమిస్తూ ఉంటారు. ఇది వీరాకు మింగలేని, కక్కలేని పరిస్థితి తెస్తుంది. ఓ కేసుమీద జైలుకు వెళ్ళిన వీరా మేనమామ వచ్చాక, అసలు విషయం తెలుస్తుంది. అతను ఆడదంటే కాలికింది చెప్పులా ఉండాలని అంటాడు. మాటా, మాటా పెరుగుతుంది. అతను స్త్రీలను కించపరచడం తట్టుకోలేక కీర్తి అతనిపై చేయి చేసుకుంటుంది. తత్ఫలితంగా వీరా, కీర్తి విడిపోతారు. కూతురు కాపురం చక్కదిద్దాలని తండ్రి ప్రయత్నిస్తాడు. కానీ, వీరా మేనమామ తగ్గడు. దాంతో కూతురును కుస్తీ పోటీల్లో పాల్గొనమని తండ్రి స్వయంగా ప్రోత్సహిస్తాడు. ఊళ్ళో అందరి ముందు తలెత్తుకోలేక పోతున్న వీరా, చివరకు భార్యతోనే కుస్తీకి సై అంటాడు. అడ్డదారుల్లో మహిళల కుస్తీలోనే తాను తన భార్యతో పోటీ చేసేలా చేసుకుంటాడు. 15 రోజులు కఠోర శిక్షణ తీసుకుంటాడు. చివరకు పోటీ రోజు వస్తుంది వీరా, కీర్తితో తలపడతాడు. ఆ పోటీలో ఆమె కళ్ళు తిరిగి పడుతుంది. ఆ తరువాత ఏమైంది? వీరా, కీర్తిని గెలిచాడా? అన్న అంశాలతో కథ సాగుతుంది.
ఈ తరహా భార్యాభర్తల మధ్య గొడవలు, వారి మధ్య ఇతరుల జోక్యం, చివరకు ఎలా ఒకటయ్యారు అన్న కథలతో పలు చిత్రాలు గతంలో అలరించాయి. ఈ సమయంలో విష్ణు విశాల్ ఈ కథకు ఓకే చెప్పడం, ఆయన భార్య పాత్రలో ఐశ్వర్య లక్ష్మి నటించడం ఈ చిత్రానికి వన్నె తెచ్చాయి. ఇతర పాత్రధారులు సైతం తమ పరిధి మేరకు నటించారు. నవ్వుల బాగానే పూయించినా, కథ, కథనం పాతగానే సాగాయి. ఇంటర్వెల్ ఎపిసోడ్ ఆకట్టుకుంటుంది. తొలి భాగంలో ఎంటర్ టైన్ మెంట్ బాగానే పండింది. అయితే ఇటీవల కాలంలో వచ్చే డబ్బింగ్ సినిమాలు కూడా స్ర్టెయిట్ సినిమాల్లాగా ఉండి ఆకట్టుకుంటుంటే ఈ సినిమా మాత్రం ఫక్తు డబ్బింగ్ సినిమా అనేలా మాటలు, సన్నివేశాలు సాగటం గమనార్హం. ఓవర్ ఆల్ గా చూస్తే సినిమాలో ఆడవారు మగవారికి ఏ విషయంలోనూ తీసిపోరు అనే మెసేజ్ అయితే ఉంది కానీ దానిని దర్శకుడు చెల్లా అయ్యావు సమర్ధవంతంగా తెరకెక్కించటంలో మాత్రం విఫలం అయ్యాడు. పాటలు అంతగా ఆకట్టుకునేలా లేవు. అయితే ఫ్యామిలీ ఆడియన్స్ ఓ సారి సినిమా చూడవచ్చు.
ప్లస్ పాయింట్స్:
విష్ణు విశాల్, ఐశ్వర్యలక్ష్మి జోడీ
ప్రొడక్షన్ వాల్యూస్
మైనస్ పాయింట్స్:
కథలో కొత్తదనం లేకపోవడం
పేలవమైన సన్నివేశాలు
అంతగా ఆకట్టుకోని సాంకేతిక అంశాలు
రేటింగ్: 2.75/5
ట్యాగ్: మజా మస్త్