NTV Telugu Site icon

Vikatakavi Review: ‘వికటకవి’ రివ్యూ!

Vikatakavi Review

Vikatakavi Review

ఈ మధ్యకాలంలో తెలుగులో చాలా తక్కువ వెబ్ సిరీస్ లను ప్రేక్షకులు ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అందుకు కారణాలు ఏవైనా సరే ఇప్పుడు తాజాగా ఒక వెబ్ సిరీస్ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. గతంలో సర్వం శక్తిమయం అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన డైరెక్టర్ ప్రదీప్ మద్దాలి ఈసారి వికటకవి అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నరేష్ అగస్త్య హీరోగా మేఘ ఆకాష్ హీరోయిన్గా ఈ వెబ్ సిరీస్ ని పీరియాడిక్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ జానర్లో తెరకెక్కించారు. కల్కి సినిమాకి కథ అందించిన సాయి తేజ్ ఈ వెబ్ సిరీస్ కి కూడా కథ అందించడం గమనార్హం. తాజాగా ఈ వెబ్ సిరీస్ జి ఫైవ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్ ఎలా ఉంది ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది అనేది ఇప్పుడు మనం రివ్యూ లో చూద్దాం.

కథ:
ఇది ఇప్పటి కథ కాదు ముందుగా చెప్పుకున్నట్టుగానే పీరియాడిక్ కథగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. స్వాతంత్రం వచ్చిన కొత్తలో నల్లమల అడవుల నేపధ్యంలో ఈ కథ జరుగుతూ ఉంటుంది. నల్లమల అడవుల్లో ఉన్న అమరగిరి సంస్థానంలో ఉన్న దేవతల గుట్ట దగ్గరికి ఎవరైనా రాత్రి పూట వెళ్తే వాళ్ళు గతం మర్చిపోతారు. అలా జరగడానికి కారణం అమ్మోరు శాపం అని అమరగిరి ప్రజలు భావిస్తారు. అది నిజమా? కాదా? అని తెలుసుకోవడానికి ఓ రోజు కొండ మీదకు వెళతాడు రామకృష్ణ(నరేష్ అగస్త్య). హైదరాబాద్ లో ఉంటాడు. కొన్ని కేసులు పరిష్కరించడానికి, కేసుల్లో చిక్కుముడులు విప్పడానికి పోలీసులు సైతం అతని సహాయం తీసుకుంటారు అంటే అతని తెలివితేటలు ఏ పాటివో మీరు అర్థం చేసుకోవచ్చు. రామకృష్ణ తెలివితేటలు చూసి తమ ఊరిలో సమాధానం లభించని ప్రశ్నలకు, సమస్యలకు పరిష్కారం వెతికే సత్తా అతనికి ఉందని ఓ ప్రొఫెసర్ భావించి అతన్ని సంప్రదిస్తాడు. డబ్బు కోసం ఆ ఊరు వెళ్లడానికి రామకృష్ణ సిద్ధమవుతాడు. ఈ క్రమంలో దేవతల గుట్ట రహస్యాన్ని రామకృష్ణ చేదించాడ? అసలు అలా జరగడానికి కారణం ఏమిటి? అమరగిరి సంస్థాన రాజు రాజా నరసింహా (షిజు అబ్దుల్ రషీద్) మనవరాలు లక్ష్మి (మేఘా ఆకాష్) దేవతల గుట్ట మీదకు ఎందుకు వెళ్ళింది? లక్ష్మి తండ్రి, ఎమ్మెల్యే రఘుపతి (రఘు కుంచె), వీరన్న (అమిత్ తివారి)లకు ఈ కథలో పాత్ర ఏమిటి? రాజా నరసింహ కొడుకు మహాదేవ్ (తారక్ పొన్నప్ప), కోడలు గౌరీ (రమ్య దుర్గా కృష్ణన్) వల్ల అమరగిరికి నిజంగానే శాపం తగిలిందా? లాంటి విషయాలు తెలియాలంటే వెబ్ సిరీస్ మొత్తం చూడాల్సిందే.

విశ్లేషణ:
థ్రిల్లర్ వెబ్ సిరీస్ లకు కావలసిన ప్రథమ లక్షణం చివరి వరకు విలన్ ఎవరో తెలియకుండా సస్పెన్స్ మెయింటైన్ చేయడం. అదేవిధంగా ఇద్దరు ముగ్గురు వ్యక్తుల మీద అనుమానం కలిగించేలా సీన్లు రాసుకొని చివరి వరకు ప్రేక్షకుల బుర్రకు ప్రశ్నలు సంధిస్తూనే ఉంటారు. కానీ ఈ వెబ్ సిరీస్ మాత్రం అందుకు భిన్నం. అసలు కారణం ఎవరో ముందే తెలిసి పోయిన చివరి వరకు అతని ఎందుకు అలా చేస్తున్నాడు అనే విషయాన్ని ఎంగేజింగ్ గా చెప్పడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ఒకపక్క సస్పెన్స్ మరొక పక్క డ్రామా తో పాటు ఇంకో పక్క గతాన్ని కూడా బ్యాలెన్స్ చేస్తూ రాసుకున్న స్క్రిప్ట్ ప్రేక్షకులను ఆసక్తి రేకెత్తించేలా ఉంది. రియలిజంకు జానపదాన్ని లింక్ చేస్తూ రాసుకున్న విధానం కొత్తగా అనిపిస్తుంది. ఊహించని విధంగా రాసుకున్న కొన్ని ట్విస్టులు ప్రేక్షకులను భలే అబ్బుర పరుస్తాయి. సాధారణంగా కొన్ని సీన్లు చూసినప్పుడు నమ్మడం కష్టమే కానీ ఇక్కడ రాసుకున్న విధానం ప్రేక్షకులను రియాలిటీ కి దగ్గరగా ఉంచడంలో సక్సెస్ అయింది. అయితే ప్రారంభంలో ఎంతో ఇంట్రెస్టింగ్ గా అనిపించిన ఎలిమెంట్స్ కొన్ని తర్వాత పలుచబడిన ఫీలింగ్ కలుగుతుంది. అలాగే కొంచెం సేపు సిరీస్ చూసిన తర్వాత ఎందుకో నెమ్మదిగా నేరేట్ చేస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. అలాగే లవ్ స్టోరీ కూడా ఎందుకో కరెక్ట్ గా సెట్ అయిన ఫీలింగ్ కలగదు. అయితే కథ విషయంలో డైరెక్టర్ డీటెయిల్స్ మాత్రం చాలా ఫ్రేమ్స్ లో కనిపిస్తుంది. స్క్రిప్ట్ లెవెల్ లో డైరెక్టర్ చేసిన హోంవర్క్ కారణంగా సిరీస్ మొత్తం ప్రేక్షకులను ఎంగేజ్ చేసేలా ఉంటుంది. అంతేగాక నటీనటుల నుంచి మంచి అవుట్ ఫుట్ రాబట్టడంలో కూడా డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. రచయిత తనదైన శైలిలో రాసిన కథను అంతే ఆసక్తికరంగా తెరమీదకు తీసుకురావడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. కథ రాసుకున్న విషయంలో సాయి తేజ తీసుకున్న కేర్ డీటెయిల్స్ కూడా చాలా చోట్ల సినీ ప్రేమికులను అలరిస్తుంది.

నటీనటుల విషయానికి వస్తే:
రామకృష్ణ అనే లీడ్ రోల్ లో నరేష్ అగస్త్య ఒదిగిపోయాడు. చాలా సెటిల్డ్ పర్ఫామెన్స్ తో నరేష్ అగస్త్య నటన విషయంలో ఆకట్టుకున్నాడు. మేఘ ఆకాష్ కి కూడా చాలా కాలం తర్వాత మంచి పాత్ర పడింది. ఇక మిగతా పాత్రలలో నటించిన రఘు కుంచే, శిజు, తారక్ పొన్నప్ప వంటి వాళ్లు కూడా తమ పాత్రల పరిధి మేరకు ఆసక్తికరంగా ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేశారు. ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే ఇప్పటికే మంచి సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న అజయ్ అరసాడ ఈ సిరీస్ కి తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో మరింత ప్రాణం పోసినట్లు అయింది. దర్శకుడి విజన్ కు అజయ్ అరసాడ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కరెక్ట్ గా సింక్ కావడంతో ఒక రియలిస్టిక్ థ్రిల్లర్ చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. ఇక సినిమాటోగ్రాఫర్ షోయబ్ సిద్ధికి తన కెమెరాతో అద్భుతమైన విజువల్స్ అందించాడు. సిరీస్లో ప్రధానమైన అసెట్స్ లో ఒకటిగా ఈ కెమెరా వర్క్ నిలుస్తుంది. ప్రొడక్షన్ డిజైన్ విషయంలో కూడా చాలా కేర్ తీసుకున్నారు. అప్పటి విలేజ్ సెటప్స్ ని సెట్అప్ చేయడమే కాకుండా డ్రెస్సింగ్ విధానాన్ని కూడా సిద్ధం చేసిన తీరు ఆకట్టుకుంది. ఆ విషయంలో కిరణ్ మామిడి తోపాటు గాయత్రీ దేవిని అభినందించాల్సిందే.

ఫైనల్లీ:
వికటకవి తెలుగులో ఓ మంచి గ్రిప్పింగ్ థ్రిల్లర్.. కాస్త స్లో నేరేషన్ కి సిద్ధమైతే.