విక్కీ కౌశల్ హీరోగా రష్మిక మందన హీరోయిన్గా చావా అనే సినిమా తెరకెక్కింది. పుష్ప 2 సినిమాతో పాటు రిలీజ్ కావలసిన ఈ సినిమాని కొన్ని కారణాలతో వాయిదా వేశారు. చత్రపతి శివాజీ కుమారుడు చత్రపతి శంభాజీ జీవిత కథను ఆధారంగా చేసుకుని తెరకెక్కించిన ఈ చిత్రం ఫిబ్రవరి 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సాధారణంగా మహారాష్ట్ర వాసులు అందరికీ చత్రపతి శివాజీ దైవ సమానుడు. ఆయన కుమారుడు కథతో సినిమా రావడంతో వారందరి ఆసక్తి సినిమా మీద ఉంది. అలాగే తెలుగు ప్రేక్షకులలో కొందరు టీజర్, ట్రైలర్ కట్స్ నచ్చడంతో సినిమా ఎలా ఉండబోతుందా అని ఆసక్తికరంగా ఎదురు చూశారు. ఇలా అంచనాల మధ్య ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సినిమా ఎలా ఉంది? ప్రేక్షకుల అంచనాలను సినిమా అందుకుందా? లేదా? అనేది ఇప్పుడు రివ్యూ లో చూద్దాం పదండి .
చావా కథ:
ఇది నిజంగా జరిగిన కథ. చరిత్ర పుటల్లో నుంచి కొన్ని పుస్తకాల ఆధారంగా చేసుకుని ఈ సినిమాను రూపొందించారు. చత్రపతి శివాజీ మరణం తర్వాత మొఘలులు కాస్త ఊపిరి పీల్చుకుంటారు. ఇక తమ రాజ్య స్థాపనకు అడ్డే లేదు హిందుస్థాన్ మొత్తాన్ని వశం చేసుకోవాలని బయలుదేరితే వారికి చత్రపతి శంభాజీ (విక్కీ కౌశల్ ) అడుగడుగునా అడ్డుపడుతూ ఉంటాడు. తన భార్య యేసు భాయి(రష్మిక) కలిసి ఒకపక్క తమ రాజ్యాన్ని సంరక్షిస్తూనే మరొకపక్క స్వరాజ్య స్థాపన కోసం తాను చేయాల్సినవన్ని చేస్తూ ఉంటాడు శంభాజీ. అయితే మొఘలులకు శంభాజీ అడ్డగా ఉన్నాడని భావించి అతన్ని అడ్డు తొలగించే ప్రయత్నం చేస్తారు. అయితే ఎదురుగా వచ్చేవారిని ఎన్ని లక్షలమందినైనా ఎదుర్కోగల సత్తా ఉన్న శంభాజీ వెన్నుపోటు గ్రహించలేకపోయాడు. శంభాజీని వెన్నుపోటు పొడిచింది ఎవరు? చివరికి శంభాజీని మొఘలులు అంతమొందించగలిగారా? మొఘలుల చేత చిక్కిన తరువాత శంభాజీ పడిన ఇబ్బందులు ఏమిటి? లాంటి విషయాలు తెలుసుకోవాలంటే సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
విశ్లేషణ
ఇది కొత్తగా పుట్టించిన కథ కాదు. కొన్ని వందల సంవత్సరాలుగా చరిత్ర పుస్తకాలలో ఉన్న విషయాన్ని ఒక సినిమాగా తీసుకురావాలని అనుకోవడమే పెద్ద సాహసం. ఎందుకంటే ఎన్నో పదుల సంవత్సరాల విషయాన్ని క్లుప్తంగా రెండున్నర గంటల నిడివి ఉన్న సినిమాలో చూపించాలి అనుకోవడమే ఎవరూ చేయని ఒక సాహసం. అలాంటి సాహసానికి పూనుకున్న ఈ సినిమా టీం అందులో పూర్తి స్థాయిలో సక్సెస్ అయింది ముఖ్యంగా ఛత్రపతి శివాజీ అభిమానులు, ఆయనను ఆరాధించేవారు సినిమాని చూసి కళ్ళు చమరుస్తూ కొన్నిచోట్ల గర్వపడుతూ సినిమా మొత్తాన్ని ఆస్వాదిస్తారు.. నిజానికి సినిమాని ఒక యాక్షన్ డ్రామా గానే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఫిక్స్ అయినట్లున్నారు. అందుకే సినిమా దాదాపుగా యాక్షన్స్ సన్నివేశాలతోనే నింపేశారు. ముఖ్యంగా శంభాజీ ఫైట్ సీక్వెన్స్ లు అన్నీ అదిరిపోయాయి విక్కీ కౌశల్ ఫైట్స్ చేస్తున్న సమయంలో వస్తున్న బ్యాగ్రౌండ్ స్కోర్ అయితే అల్టిమేట్ గా డిజైన్ చేసుకున్నారు మొత్తం మీద చత్రపతి శివాజీ, శంభాజీ అభిమానులందరూ మీసం మేలేసేలా ఈ సినిమాని తీసుకురావడంలో దర్శకుడు అలాగే సినిమా టీం సక్సెస్ అయింది. ఒక జరిగిన కథను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలి అని అనుకోవడమే సాహసం అనుకుంటే దాన్ని ఏమాత్రం వివాదాల పాలవకుండా చాలా జాగ్రత్తగా ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేసినట్లుగా అనిపించింది. ఆ విషయంలో దర్శకుడిని అభినందించాల్సిందే. సాధారణంగా ఒకరిని పొగడాలంటే మరొకరిని తిట్టాలి అనే సమాజంలో ఉన్నాము. అలాంటిది అలా ఏమీ లేకుండానే చత్రపతి శంభాజీని రియల్ హీరోగా ప్రేక్షకుల ముందు ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం జరిగింది. అయితే చరిత్రలో ఉన్నది ఉన్నట్టుగా కాకుండా కొంత సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నారు. అయితేనేమి ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ ఇవ్వడంలో సినిమా టీం సక్సెస్ అయింది.
నటీనటుల విషయానికి వస్తే శంభాజీ మహారాజ్ పాత్రలో విక్కీ కౌశల్ జీవించాడు. ఆ పాత్రలో విక్కీ తప్ప ఇంకెవరు కనిపించరేమో అనేలా రెచ్చిపోయి నటించాడు. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాలలో అయితే నటన కోసం ఇంత ప్రాణం పెట్టాడా అనిపించేలా నటించాడు. ఇక ఆయన భార్యగా నటించిన రష్మిక చాలా మంచి పాత్రలో కనిపించింది. మహారాణిగా మహారాజు అడుగుజాడల్లో నడుస్తూ ఆయన లేని సమయంలో తన పరివారంతో పాటు రాజ్యం మొత్తానికి ఒక ఎమోషనల్ సపోర్ట్ ఇచ్చే పాత్రలో ఆమె మెరిసింది. ఇక వీరు కాకుండా మనకు తెలిసిన చాలామంది నటీనటులు సినిమాలో కనిపించారు. తెలియని వారు కూడా ఉన్నారు. వారంతా తమ తమ పాత్రలకు పూర్తిస్థాయిలో న్యాయం చేశారు. టెక్నికల్ టీం విషయానికి వస్తే ముందుగా సినిమాటోగ్రాఫర్ కష్టం ప్రతి ఫ్రేమ్లో కనిపించింది. ముఖ్యంగా యుద్ధ సన్నివేశాలతో పాటు అందమైన లొకేషన్స్ ప్రేక్షకుల కళ్ళ ముందుకు తీసుకురావడంలో ఆయన వందకు వందశాతం మార్కులు వేయించుకుంటాడు. ఇక సాంగ్స్ ఎలా ఉన్నా సరే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం ఒక రేంజ్ లో వర్కౌట్ అయింది. దాదాపుగా ఫైట్ సీక్వెన్స్ అన్నింటిలో గూజ్ బాంప్స్ వచ్చేలా ప్లాన్ చేసుకున్నారు. ఇక అప్పటి పరిస్థితులను ప్రతిబింబించేలా సిద్ధం చేసుకున్న కాస్ట్యూమ్స్ తో పాటు సెట్స్ కూడా ఆకట్టుకుంటాయి. సినిమాని చాలా రిచ్ గా తీసుకురావడంలో నిర్మాత దినేష్ విజన్ “విజన్” కనపడింది.
ఫైనల్లీ చావా… గూజ్ బంప్స్ గ్యారెంటీ ఫిలిం