‘వానర’ అంటూ తెలుగు ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఒక సినిమా, సెన్సార్ అడ్డంకుల కారణంగా ‘వనవీర’గా మారి ప్రేక్షకుల ముందుకొచ్చింది. అవినాష్ తిరువీధుల దర్శకత్వంలో, ఆయనే హీరోగా నటిస్తూ ఈ సినిమాని స్వయంగా తన స్నేహితులతో నిర్మింపజేయడం గమనార్హం. ఈ సినిమాకి చాలామంది హీరోలు సపోర్ట్ చేస్తూ రావడంతో ప్రమోషన్స్ మీద ప్రేక్షకులలో ఆసక్తి ఏర్పడింది. దానికి తోడు కోతుల AI వీడియోలతో ఎన్నో వీడియోలు రిలీజ్ చేయడంతో “ఏంటి ఈ సినిమా? ఎలా ఉండబోతోంది?” అని అందరూ ఆసక్తికరంగా ఎదురుచూశారు. నూతన సంవత్సర సందర్భంగా జనవరి 1వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.
వనవీర కథ:
రఘు (అవినాష్ తిరువీధుల) ఐఐటీలో చదువుకుని, ఊరిలోనే అల్లరి చిల్లరగా తిరుగుతూ ఉంటాడు. తన తండ్రి శివాజీ రాజాతో కలిసి అక్కడే నివాసం ఉంటుంటాడు. అయితే ఒకరోజు అదే ఊరిలో ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్న దేవా (నందు) అనుచరులు, రఘు ప్రాణంగా చూసుకునే అతని బండిని తీసుకుని వెళతారు. తన బండి కనిపించకపోవడంతో అనునిత్యం దేవా ఇంటి చుట్టూనే తిరుగుతూ ఉంటాడు రఘు. ఈ క్రమంలోనే ఒకరోజు దేవా సోదరుడు గురు మీద ఎటాక్ చేయడంతో, అతనిని దేవా పోలీసులతో కొట్టిస్తాడు. అయితే ఎలక్షన్స్ ఉండటంతో అతనిని వదిలేయమని పైనుంచి ఒత్తిడి రావడంతో, దేవా స్వయంగా వచ్చి పోలీస్ స్టేషన్ నుంచి విడిపిస్తాడు. ఈ క్రమంలోనే దేవాకి ఊహించని షాక్ ఇస్తాడు రఘు. ఆ షాక్ ఏంటి? దేవాకి, రఘుకి ఉన్న సంబంధం ఏంటి? అసలు వనవీరకు ఈ సినిమా కథకు ఉన్న సంబంధం ఏమిటి? టైటిల్ జస్టిఫికేషన్ ఏంటి? అనేది తెలియాలంటే సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
విశ్లేషణ:
ఈ మధ్యకాలంలో టాలీవుడ్ అనే కాదు, దాదాపుగా అన్ని సినిమాలలో ఏదో ఒక అంశాన్ని పురాణాలతో లింక్ పెడుతూ ప్రేక్షకులను అలరించాలనుకుంటున్న దర్శక నిర్మాతలు ఎక్కువయ్యారు. దాదాపుగా ఇది కూడా అలాంటి కోవలోనే రాసుకున్న ఓ కథ. ‘వానర’ అనే టైటిల్ పెట్టి, ముందు నుంచి కోతులతో AI వీడియోలు చేస్తూ రావడంతో ఈ సినిమా మొత్తం ఆ కోతులకు సంబంధించిన అంశం ఏదైనా ఉంటుందేమో అని అందరూ అనుకున్నారు. కానీ, సినిమాలో సన్నివేశాలను రామాయణంలోని కిష్కిందకాండతో లింక్ పెడుతూ దర్శకుడు రాసుకున్నాడు.
సినిమా ప్రారంభంలోనే హీరో క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేసుకున్న దర్శకుడు, ఆ తర్వాత వరుస సీన్లు ఆకట్టుకునేలా రాసుకున్నాడు. అయితే హీరో, దర్శకుడు ఒకరే కావడం సినిమాకి కాస్త ఇబ్బందికర అంశం. హీరోగా అవినాష్ ఓకే కానీ, అతను అతనిలా కాకుండా కొంతమంది హీరోలను ఇమిటేట్ చేస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. ఫస్టాఫ్ పూర్తయిన తర్వాత ఒక ట్విస్ట్‌తో ఇంటర్వెల్ ఇచ్చి, సెకండాఫ్ మొదలైన తర్వాత ఊహించని విధంగా సినిమా ఎన్నో టర్న్స్ తీసుకుంటుంది. ముఖ్యంగా ఎవరు ఊహించని కొన్ని సంఘటనలు ఆసక్తికరంగా అనిపిస్తాయి. సెకండాఫ్ ప్రీ-క్లైమాక్స్‌లో వచ్చే ఒక నటుడి ఎంట్రీ మాత్రం ఆకట్టుకుంటుంది. తర్వాత రొటీన్ స్టోరీ అనే ఫీలింగ్ కలిగినా సరే, స్టోరీని రామాయణంలోని ఒక ఎపిసోడ్‌తో లింక్ చేసుకుంటూ, మధ్య మధ్యలో కోతులను AIలో సృష్టిస్తూ కిష్కిందకాండ ఎపిసోడ్‌ని రీ-క్రియేట్ చేసిన విధానం ఆకట్టుకునేలా ఉంది.
నటీనటుల పనితీరు:
అవినాష్ తిరువీధుల రఘు అనే పాత్రలో కరెక్ట్ గా సెట్ అయ్యాడు, కానీ యాక్టింగ్ విషయంలోనే ఇంకా కేర్ తీసుకుని ఉంటే బాగుండేది. డైలాగ్ డెలివరీ సహా యాక్షన్ ఎపిసోడ్స్‌లో ఆకట్టుకున్నాడు. సిమ్రాన్ చౌదరి పాత్ర పరిమితమైనా, కనిపించినంత సేపు ఆమె ఆకట్టుకుంది. ఇక శివాజీ రాజా, ఆమని తమ పాత్రలకు న్యాయం చేశారు. ఒకేరోజు హీరోగా, విలన్‌గా రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నందు, ఈ సినిమాలో విలన్ పాత్రలో తనదైన సెటిల్డ్ పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నాడు.
సాంకేతిక విభాగం: సాంకేతిక టీమ్ విషయానికి వస్తే బ్యాగ్రౌండ్ స్కోర్ బావుంది, విజువల్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. AI వాడకం ఎక్కువ అయినట్లు అనిపిస్తుంది కానీ, AI క్వాలిటీ బావుంది. పాటలు అంత క్యాచీగా లేవు, ఆ విషయంలో కేర్ తీసుకుని ఉంటే బాగుండేది. ఇదే సినిమా ఒక నోటెడ్ హీరోకి పడి ఉంటే రిజల్ట్ వేరేలా ఉండి ఉండవచ్చు.
ఫైనల్లీ: ఈ వనవీర.. రొటీన్ బట్ హానెస్ట్ అటెంప్ట్!