Uruku Patela Movie Review: హుషారు అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన తేజస్ కంచర్ల ఆ తర్వాత పాయల్ రాజ్ పుత్ తో ఆర్డీఎక్స్ లవ్ అనే సినిమా కూడా చేశాడు. ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న ఆయన ఉరుకు పటేలా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. టైటిల్ తోనే ప్రేక్షకులలో ఆసక్తి రేకెత్తించిన ఈ సినిమాని ముందు నుంచి ఒక కామెడీ థ్రిల్లర్ అంటూ ప్రమోట్ చేస్తూ వచ్చారు మేకర్స్. వినాయక చవితి సందర్భంగా ఈ సినిమాని సెప్టెంబర్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు మేకర్స్. వివేక్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ సినిమాని తేజస్ కంచర్ల తండ్రి స్వయంగా నిర్మించారు. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? ప్రేక్షకులను ఎంగేజ్ చేసిందా లేదా అనేది ఇప్పుడు మనం రివ్యూలో చూద్దాం
ఉరుకు పటేలా కథ:
తెలంగాణ ప్రాంతంలోని ఒక పల్లెటూరిలో నివసించే పటేలా(తేజస్ కంచర్ల) చిన్నప్పటి నుంచి చేసుకుంటే బాగా చదువుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అనే లక్ష్యంతో ఉంటాడు. అయితే చదువుకున్న అమ్మాయిలు ఎవరూ అతన్ని చేసుకోవడానికి ఇష్టపడరు. ఇలాంటి సమయంలో అతనికి అక్షర(ఖుష్బూ చౌదరి) అనే డాక్టర్ పరిచయం అవుతుంది. మొదటి చూపులోనే ప్రేమ కలగడంతో ఆమెను ఎలాగైనా ఆమెను ప్రేమలో పడేసి పెళ్లి చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అందుకు పటేలా తండ్రి, ఆ ఊరి సర్పంచ్(గోపరాజు రమణ) కూడా సాయం చేస్తాడు. అయితే అక్షర పటేలను ప్రేమించిన నేపథ్యంలో వారి పెళ్లికి కూడా ఇరు కుటుంబాల వారు ఒప్పుకుంటారు. అలా ఒప్పుకున్న తర్వాత ఒకరోజు అక్షర పుట్టినరోజు వేడుకల కోసం పట్నానికి వెళ్తాడు పటేల. అక్కడికి వెళ్లిన పటేలకు ఒక షాకింగ్ విషయం తెలుస్తుంది. అలా తెలిసిన విషయం ఏమిటి? డాక్టర్ చదువుకున్న అక్షర చదువు లేని పటేలను ఎందుకు ప్రేమించింది? అంతగా ఆమెను ఆకట్టుకున్న విషయం ఏమిటి? అంతా సవ్యంగా సాగిపోతుంది అనుకుంటున్న సమయంలో పటేలకు ఎదురైన చావు రేవు పరిస్థితి ఏమిటి? ఆ పరిస్థితుల నుంచి అతను ఎలా బయటపడ్డాడు? అనే విషయాలు తెలియాలంటే ఈ సినిమా బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
విశ్లేషణ:
వాస్తవానికి ఉరుకు పటేలా అనే సినిమాని ముందు నుంచి కామెడీ థ్రిల్లర్ అని టీం ప్రమోట్ చేస్తూ వచ్చింది. దానికి తగ్గట్టుగానే కామెడీ ఫ్లేవర్ తో సినిమా మొదలైన కొద్దిసేపటి నుంచి హీరో క్యారెక్టర్ ను ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశారు. అయితే హీరో క్యారెక్టర్ ను మనం గతంలోనే ఎన్నో వందల సినిమాల్లో చూసిన ఫీలింగ్ కలుగుతుంది. చదువు అబ్బకపోతే బాగా డబ్బున్న కుటుంబంలో పుట్టిన హీరో తన స్నేహితులతో కలిసి జల్సాలు చేస్తూ ఉంటాడు. ఎలా అయినా బాగా చదువుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మంచిదనే భావనతో ఉంటూ అలాంటి అమ్మాయి కోసమే వెతుకుతూ ఉంటాడు. దాదాపుగా ఆ లైన్ తో మనం ఇప్పటివరకు చాలా సినిమాల్లో మనం చూసే ఉంటాం. అయితే కరెక్టుగా సినిమా ప్రీ ఇంటర్వెల్ వరకు ఇలానే నడుస్తూ ఉంటుంది. ప్రీ ఇంటర్వెల్లో ఇచ్చే ట్విస్ట్ సినిమా మీద ఆసక్తి రేకెత్తిస్తుంది. అయితే సెకండ్ హాఫ్ మొదలైన తర్వాత వచ్చే సీన్స్ అన్నీ ఎందుకో ఊహించడానికి దగ్గరగానే అనిపిస్తాయి. అయితే ప్రేక్షకులు ఊహించిన దానికి కొంచెం దగ్గరగా ఉన్నా తనదైన శైలిలో సినిమాను నడిపించే ప్రయత్నం చేశాడు డైరెక్టర్. అయితే సినిమాని కామెడీ థ్రిల్లర్ గా కాకుండా ముందు నుంచి పూర్తి థ్రిల్లర్గా రాసుకుని తెరకెక్కించి ఉంటే ఆ ఎఫెక్ట్ వేరుగా ఉండేది. ఎందుకంటే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కి కామెడీ మిక్స్ చేసిన నేపథ్యంలో ఎందుకో ప్రేక్షకుడు పూర్తిగా నవ్వలేక పూర్తిగా థ్రిల్ కాలేకపోయిన ఫీలింగ్ కలుగుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. సెకండ్ హాఫ్ లో వచ్చే సీన్స్ కొన్ని ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. అయితే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ మధ్యలో కామెడీ చూపించే ప్రయత్నం ఎందుకో పూర్తిగా వర్క్ అవుట్ అయినట్లు అనిపించలేదు. ఇక క్లైమాక్స్ కూడా ఊహకు తగ్గట్టుగానే ఉంటుంది. డైరెక్టర్ తీసుకున్న పాయింట్ మంచిదే కానీ దాన్ని ఎగ్జిక్యూట్ చేసే విధానంలో తడబడినట్టు అనిపిస్తుంది. స్క్రీన్ ప్లే కూడా లీనియర్ విధానంలో నడిపించుకుంటూ వెళ్లడంతో స్టోరీలో ఎగ్జైట్ చేసే పాయింట్ ఒక్కటి కూడా కనిపించదు. చేసిన కామెడీ విషయంలో కూడా నవ్వించడానికి బదులు ఇదేంటి రా బాబు ఇదంతా క్రింజ్ అనిపించేలా కొన్ని సీన్లు ఉన్నాయి.
నటీనటుల విషయానికి వస్తే తేజస్ కంచర్ల పటేలా అనే పాత్రలో సరిగ్గా సెట్ అయ్యాడు. తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో ఉండే యూత్ ని రిప్రజెంట్ చేసే పాత్రలో అతను ఆకట్టుకున్నాడు. అయితే వేషధారణ కొంత సిద్దు జొన్నలగడ్డను అనుకరించినట్టు అనిపిస్తుంది. ఆ విషయంలో కేర్ తీసుకుని ఉంటే బాగుండేది. హీరోయిన్గా చేసిన కుష్బూ తన పాత్రకు న్యాయం చేసింది. మిగతా పాత్రలలో నటించిన గోపరాజు రమణ, చమ్మక్ చంద్ర, ఆనంద్ చక్రపాణి తమదైన శైలిలో నటించి తమ పాత్రలకు ప్రాణం పోసినట్టు అనిపించింది. ఇక మిగతా పాత్రధారులు అందరూ తమ తమ పాత్రల పరిధి మేరకు నటించారు. ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే పాటలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకునేలా లేవు. అయితే సినిమా కథకు తగ్గట్టుగా ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకి సరిపోయింది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ చాలా క్రిస్పీగా అనిపించింది. చిన్న సినిమానే అయినా నిర్మాణ విలువలు బాగున్నాయి ఎక్కడ వెనక్కి తగ్గినట్టు అనిపించలేదు.
ఫైనల్లీ ఉరుకు పటేలా ప్రేక్షకులను థియేటర్లకు ఉరుకులు పెట్టించేట్టు అయితే లేదు.