మొగలిరేకులు సీరియల్‌తో తెలుగు ప్రేక్షకులలో విశేషమైన ఆదరాభిమానాలు సంపాదించుకున్న ఆర్.కె. సాగర్, తర్వాత కొన్ని సినిమాలు కూడా చేశారు. సిద్ధార్థ, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, షాదీ ముబారక్ లాంటి సినిమాలు ఆయనకు మంచి గుర్తింపు తెచ్చాయి. ఇప్పుడు కాస్త గ్యాప్ తీసుకున్న ఆయన ‘ది 100’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. శుక్రవారం నాడు రిలీజ్ అవుతున్న ఈ సినిమాను ముందుగానే మీడియాకు స్పెషల్ ప్రీమియర్ ద్వారా ప్రదర్శించారు. ఈ సినిమా ఎలా ఉంది, ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.
ది 100 కథ:
విక్రాంత్ (ఆర్.కె. నాయుడు) అప్పుడే ఐపీఎస్ ట్రైనింగ్ పూర్తి చేసుకుని నగరంలో అడుగుపెడతాడు. అడుగుపెట్టే సమయానికి ఒక రాబరీ గ్యాంగ్ అరాచకం సృష్టిస్తూ ఉంటుంది. ఆ కేసును డీల్ చేస్తున్న క్రమంలో, తాను ప్రేమించిన ఆర్తి (మిశా నారంగ్) గురించి ఒక షాకింగ్ విషయం తెలుస్తుంది. ఈ క్రమంలో ఆ కేసు ఎంక్వైరీ చేస్తున్న కొద్దీ అనేక షాకింగ్ విషయాలు బయటపడుతూ ఉంటాయి. ఈ రాబరీ వ్యవహారాల వెనుక ఒక పెద్ద బిగ్ షాట్ ఉన్నాడని విక్రాంత్ తెలుసుకుంటాడు. ఈ క్రమంలో విక్రాంత్ ఏం చేశాడు? విష్ణుప్రియ పాత్ర ఏంటి? వల్లభ (తారక్ పొన్నప్ప)కి ఈ కేసుకి ఉన్న సంబంధం ఏంటి? చివరికి ఏం జరిగింది అనేది తెలియాలంటే ఈ సినిమాను బిగ్ స్క్రీన్‌పై చూడాల్సిందే.
విశ్లేషణ:
నిజానికి ఈ సినిమా మొదలైనప్పుడు ఏదో ఒక ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ అనే ఫీలింగ్ కలుగుతుంది. కానీ సినిమా సాగుతున్న కొద్దీ కార్పొరేట్ వ్యవస్థలో ఒక దారుణమైన విషయాన్ని బయటపెడుతుంది. ఇలాంటి విషయాలు మనం వార్తల్లో చూసుంటాం, కానీ దాన్ని ఆసక్తికరంగా తెరమీదకు తీసుకొచ్చిన తీరు అభినందనీయం. నిజానికి ఇలాంటి విషయాన్ని టచ్ చేయాలంటే ఎంతో సాహసం ఉండాలి. ఆ విషయంలో దర్శకుడు, నిర్మాతలు చాలా డేరింగ్ స్టెప్ తీసుకున్నారు. ఒకపక్క సిటీలో జరుగుతున్న వరుస రాబరీల పాయింట్ ఆఫ్ వ్యూలో మొదలుపెట్టి, ఆ తర్వాత మర్డర్లు ఎలా జరుగుతున్నాయి అనే విషయాన్ని ఆసక్తికరంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన తీరు ఆకట్టుకుంది. దర్శకుడు రాసుకున్న కథను ఎక్కువ కమర్షియల్ హంగుల జోలికి వెళ్లకుండా ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేశాడు. దర్శకుడి టేకింగ్, స్క్రీన్‌ప్లే సినిమాను చాలా వరకు ప్రేక్షకులకు ఆకట్టుకునేలా మార్చాయి. ఇక సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే, శ్యామ్ కె. నాయుడు అందించిన సినిమాటోగ్రఫీ సినిమాను ఎలివేట్ చేసింది. అలాగే, హర్షవర్ధన్ రామేశ్వర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లిందనడంలో సందేహం లేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.
ఇక నటీనటుల విషయానికి వస్తే, ఈ సినిమాలో ఆర్.కె. సాగర్ నటన ఒక ప్లస్ పాయింట్. సాగర్‌కి పోలీస్ పాత్ర కొత్త కాదు, దీంతో ఒకరకంగా హోం గ్రౌండ్‌లో స్వైరవిహారం చేశాడు. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే, ఈ సినిమాకి మూల కథ కూడా సాగర్ అందించడమే. కథలో ఇన్వాల్వ్‌మెంట్ ఉండడంతో ఆయన స్క్రీన్ మీద చాలా సెటిల్డ్ పెర్ఫార్మన్స్‌తో ఆకట్టుకున్నాడు. మిశా నారంగ్, ధన్య బాలకృష్ణ ఇద్దరూ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. ఇక విష్ణుప్రియకు చాలా కాలం తర్వాత మంచి పాత్ర దొరికింది. తారక్ పొన్నప్ప అదరగొట్టాడు. మిగతా పాత్రధారులు అందరూ తమ పాత్రల పరిధి మేరకు నటించారు.
ఫైనల్లీ: ‘ది 100’ ఒక ఆసక్తికరమైన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్.