NTV Telugu Site icon

Bhaag Saale Review: శ్రీసింహా ‘భాగ్ సాలే’ రివ్యూ

Bhaag Saale Review

Bhaag Saale Review

Bhaag Saale Movie Review: శ్రీసింహా కోడూరి, నేహా సోలంకి హీరోహీరోయిన్లుగా నటించిన తాజా మూవీ ‘భాగ్ సాలే’ ఈ శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గతంలో సూర్యకాంతం అనే సినిమాతో డైరెక్టర్ గా మారిన ప్రణీత్ బ్రాహ్మాండపల్లి దర్శకత్వంలో క్రైమ్ కామెడీ గా తెరకెక్కిన ఈ సినిమాని గట్టిగా ప్రమోట్ చేశారు. దానికి తోడు విజయ్ దేవరకొండ మేనమామ యష్ రంగినేని, అర్జున్ దాస్యం నిర్మించిన ఈ సినిమా కోసం బండ్ల గణేష్ వంటి వారు ప్రమోషన్స్ చేయడం, సిద్దు జొన్నలగడ్డ వాయిస్ ఓవర్ ఇవ్వడంతో సినిమా మీద హైప్ ఏర్పడింది. మరి ఈ సినిమా ఆ హైప్ అందుకుందా? లేదా అంటే ఈ సినిమా రివ్యూ చదివి తెలుసుకోవాల్సిందే.

కథ:
అర్జున్(శ్రీసింహా) ఒక స్లమ్ లో నివసిస్తూ ఉంటాడు, ఆ స్లమ్ మొత్తం మీద వారిదే పెద్ద ఇల్లు కావడం తండ్రి(రాజీవ్ కనకాల)ను అందరూ రాయల్ మూర్తి అని పిలవడంతో తమది ఒక రాయల్ ఫ్యామిలీ అని భావిస్తూ ఉంటాడు అర్జున్. మాయ(నేహా సోలంకి) కూడా అదే నిజమని నమ్మి అతన్ని ప్రాణంగా ప్రేమిస్తుంది. అయితే నిజంగానే రాజవంశానికి చెందిన మాయ తండ్రి వద్ద నిజాంకు చెందిన శాలి శుక గజ అనే వజ్రపు ఉంగరం కోసం ఆయన్ని కిడ్నాప్ చేస్తాడు సామ్యూల్(జాన్ విజయ్) అండ్ బ్యాచ్. మరి ఆ వజ్రాన్ని ఇచ్చి అర్జున్ తన ప్రియురాలి తండ్రిని కాపాడుకుంటాడా? లేదా? అర్జున్ నిజస్వరూపం తెలుసుకున్న మాయ ఏం చేసింది? డాన్ సామ్యూల్ కి అసలు శాలి శుక గజతో పనేముంది? అనేదే సినిమా కథ.

విశ్లేషణ:
నిహారికతో సూర్యకాంతం మూవీ, నాన్న కూచి అనే వెబ్-సిరీస్‌లకి దర్శకత్వం వహించిన ప్రణీత్ భాగ్ సాలేతో మంచి హిట్ అందుకోవాలని అనుకున్నాడు. దానికి కామెడీ జానర్ ను ఎంచుకున్నాడు. అయితే ఇక్కడ కథ ఏమీ కొత్తది కాదు, మనం చాలా సినిమాల్లో చూసిన కథనే ఆద్యంతం కామెడీ వేలో చెప్పే ప్రయత్నం చేశాడు. అర్జున్, మాయతో ప్రేమలో ఉండి తన తల్లిదండ్రులతో (రాజీవ్ కనకాల, బిందు) మధ్యతరగతి జీవనశైలిని గడుపుతున్నా ఒక సెలబ్రిటీ అని కలరింగ్ ఇస్తూ మాయను మోసం చేస్తాడు. ఈ ఎపిసోడ్ వేదంలో అల్లు అర్జున్ ఎపిసోడ్ ను గుర్తు చేస్తుంది. మరోపక్క డాన్ సామ్యూల్(జాన్ విజయ్), నటి నళిని (నందిని రాయ్)ని పెళ్లి చేసుకునేందుకు చేసే ప్రయత్నాలు అంత కన్విన్సింగ్ గా అనిపించవు. ముఖ్యంగా మధ్యలో కథకు ట్విస్టులు ఇచ్చేందుకు ఎంచుకున్న రమ్య (వర్షిణి సౌందరరాజన్),ప్రామిస్ రెడ్డి (సత్య) అనే పోలీసు అధికారి ఎపిసోడ్ నవ్వులు పూయించేందుకు వర్కౌట్ అయింది కానీ గజిబిజి గందరగోళం చేసి పడేసింది. భాగ్ సాలే సినిమాలో క్రైమ్ కంటే మధ్యలో వచ్చే కామెడీ సన్నివేశాలే పేలాయి, ప్రణీత్ కామెడీ మీద పెట్టిన శ్రద్ద థ్రిల్లింగ్ స్క్రీన్ ప్లే మీద చూపించడంలో ఫెయిల్ అయ్యాడని అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ సినిమా చూస్తున్నపుడే ఇంతకు ముందెప్పుడో చూశామే అనే అనుభూతి కలగడం గమనార్హం. సినిమాలో అనేక మంది కమెడియన్లు ఉన్నప్పటికీ, దర్శకుడు అనుకున్నంత ‘కామెడీ’ పండినా మిగతావన్నీ మిస్సయ్యాయి.

ఇక నటీనటుల విషయానికి వస్తే అర్జున్ పాత్రలో శ్రీ సింహా సూట్ అయ్యాడు. నేహ సోలంకి కేవలం సాంగ్స్ కి మాత్రమే కాకుండా మంచి రోల్ లో ఇరగతీసింది. ఇక ఈ సినిమాలో నటించిన జాన్ విజయ్ విలన్ పాత్రలో బాగా సూట్ అయ్యాడు. నందిని, వర్షిణి సౌందరరాజన్, సుదర్శన్, సత్య, హర్ష చెముడు వంటి వారు తమ పాత్రల పరిధి మేర నటించారు. సత్యను ఇంకా వాడుకుంటే బాగుండేది. ఈ సినిమాను కామెడీతోనే నడిపించాలని భావించి ఆమేర ప్రయత్నించినా పూర్తి స్థాయిలో మాత్రం సఫలం కాలేదు. ఇక ఈ సినిమాకి కాల భైరవ సంగీతం, BGM బాగా ఉపయోగపడ్డాయి కానీ పూర్తి స్థాయిలో మాత్రం ఎలివేట్ చేయలేక పోయింది. ఇక ఎడిటింగ్ క్రిస్పీ అనిపించింది, సినిమాటోగ్రఫీ కూడా బాగా నప్పింది. నిర్మాణ విలువలు సినిమాకి తగినట్టు ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్:
నిడివి
సంగీతం-బీజీఎం

మైనస్ పాయింట్స్
రొటీన్ స్టోరీ
పండని కామెడీ

బాటమ్ లైన్:
‘భాగ్ సాలే’ కామెడీ మెచ్చే వారికోసం మాత్రమే..