YS Jagan: వంగవీటి మోహన రంగా వర్ధంతి సందర్భంగా వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన ట్వీట్ ఇప్పుడు రాజకీయ చర్చలకు దారి తీస్తోంది. రంగా కుమారుడు వంగవీటి రాధా వైసీపీలో ఉన్నంతకాలం రంగా జయంతులు, వర్ధంతులను అధికారికంగా నిర్వహించిన వైసీపీ.. ఆ తర్వాత అలాంటి కార్యక్రమాలకు దూరంగా ఉంది.. కనీసం, గత ఐదేళ్ల వైసీపీ పాలనలోనూ వంగవీటి మోహన రంగా పేరుతో ఎలాంటి అధికారిక కార్యక్రమాలు వైసీపీ చేయలేదు.. అయితే, నేడు రంగా వర్ధంతి సందర్భంగా.. “పేదల సమస్యలను తన సమస్యలుగా భావించి, వారి గొంతుకగా నిలిచిన గొప్ప నాయకుడు వంగవీటి మోహన రంగా..# అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేసి నివాళులు అర్పించారు.
Read Also: Fire Accident : మంటలతో పెట్రోల్ బంకులోకి దూసుకెళ్లిన ఓమ్నీ వ్యాన్
ఇదిలా ఉండగా, రంగా కుమారుడు వంగవీటి రాధా ఇప్పటికే వైసీపీని వీడి టీడీపీలో చేరారు. తాజాగా, రంగా కుమార్తె ఆశా కిరణ్ రాజకీయంగా యాక్టివ్ అవుతున్నారు. భవిష్యత్తులో ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారన్న మీడియా ప్రశ్నకు.. రాధారంగ మిత్రమండలి సలహాలతో ముందుకెళ్తున్నట్లు ఆమె స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఆశా కిరణ్‌ను పార్టీలోకి తీసుకోవాలన్న ఆసక్తి వైసీపీలో ఉందా? అసలు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ట్వీట్ వెనుక రాజకీయ సంకేతాలున్నాయా? అనే సందేహాలు ఇప్పుడు రంగా అభిమానుల్లో వ్యక్తమవుతున్నాయి. కాగా, “పేద ప్రజల సమస్యలను తన సమస్యలుగా భావించి, వారి గొంతుకగా నిలిచిన గొప్ప నాయకుడు వంగవీటి మోహన రంగా గారు. నేడు ఆయన వర్ధంతి సందర్భంగా నివాళులు” అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు..
పేద ప్రజల సమస్యలను తన సమస్యలుగా భావించి, వారి గొంతుకగా నిలిచిన గొప్ప నాయకుడు వంగవీటి మోహన రంగా గారు. నేడు ఆయన వర్ధంతి సందర్భంగా నివాళులు. pic.twitter.com/CPgKs65Lbt
— YS Jagan Mohan Reddy (@ysjagan) December 26, 2025