NTV Telugu Site icon

Maname Movie Review: మనమే మూవీ రివ్యూ

Mm

Mm

ఒకే ఒక జీవితం సినిమాతో చాలా రోజుల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన శర్వానంద్ ఇప్పుడు మనమే అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేసాడు. భిన్నమైన సినిమాలు చేస్తాడనే పేరున్న శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ మీద విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల, కృతి ప్రసాద్ నిర్మాతలు గా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి ప్రేక్షకులలో చాలామందినీ ఆకర్షించింది. పిల్లాడిని పెంచే క్రమంలో ఒక జంట ఎదుర్కొన్న ఇబ్బందులను కట్ చేసి ట్రైలర్లో చూపించడంతో ఫామిలీ ఆడియన్స్ కూడా కనెక్ట్ అయ్యే సబ్జెక్టు లాగానే అనిపించింది కృతి శెట్టి హీరోయిన్గా నటించిన ఈ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది అనేది ఇప్పుడు మనం రివ్యూలో చూద్దాం.

కథ:
ఎలాంటి బాధ్యత లేకుండా తిరిగే విక్రమ్(శర్వానంద్) ఒక ప్లే బాయ్. అనుకోకుండా తన స్నేహితుడి కుటుంబం చనిపోవడంతో స్నేహితుడి కొడుకుని చూసుకోవాల్సిన బాధ్యత మీద పడుతుంది. స్నేహితుడి భార్య స్నేహితురాలు సుభద్ర(కృతి శెట్టి)తో కలిసి లండన్లో ఒకే ఇంట్లో ఉండాల్సి వస్తుంది. అసలు బాధ్యతలు అంటేనే చిరాకు పడే విక్రమ్ అయిష్టంగానే బాబు(విక్రమ్ ఆదిత్య)ను చూసుకునేందుకు సిద్ధమవుతాడు.. అలాంటి విక్రమ్ ఆ బాబుని వదులుకోలేని పరిస్థితికి ఎందుకు వచ్చాడు? అసలు లవ్ మీద కానీ రిలేషన్ మీద కానీ పూర్తిస్థాయిలో నమ్మకం లేని అతను ఎలా ఒకరి మీద పిచ్చి ప్రేమ పెంచుకున్నాడు? అభం శుభం తెలియని రెండేళ్ల బాబుని చంపాలని ఎవరు ప్రయత్నించారు? వారి బారి నుంచి ఎవరు కాపాడారు? సుభద్రతో ముందు నుంచి గిల్లికజ్జాలు పడుతూ వచ్చిన విక్రమ్ చివరికి ఏం చేశాడు? అనేది బిగ్ స్క్రీన్ మీద చూసి తెలుసుకోవాల్సిందే.

విశ్లేషణ:
నిజానికి ఇలాంటి కథలు మనం గతంలో కొన్ని చూశాం కానీ ఈ సినిమాను ట్రెండ్ కి తగినట్లు డిజైన్ చేసుకున్నాడు డైరెక్టర్. అనాధ అయిన హీరో ఫ్రెండ్ తన భార్యతో ప్రమాదంలో చనిపోతే ఆ వారి కుమారుడిని కొన్నాళ్ల పాటు సంరక్షించాల్సిన బాధ్యత హీరో మీద పడుతుంది. అసలు ఏమాత్రం ఇష్టం లేకుండానే తన వైబ్ కి అసలు ఏ మాత్రం సెట్ అవ్వని సుభద్ర అనే అమ్మాయితో కొన్నాళ్లపాటు ఒకే ఇంట్లో ఉండాల్సి వస్తుంది. అలాంటి క్రమంలో వారిద్దరి మధ్య వచ్చే సరదా గిల్లికజ్జాలను ఎంగేజింగ్ తెరమీదకు తీసుకురావడంలో డైరెక్టర్ సఫలం అయ్యాడు. నిజానికి ఈ ఫస్టాఫ్ అంతా ఇలాగే గిల్లికజ్జాలతో సాగిపోతూ ఉంటుంది ఏమాత్రం నచ్చదు అనుకున్నా అమ్మాయితో ప్రేమలో పడడంతో ఇంటర్వెల్ బ్యాంగ్ రాసుకున్నాడు. అయితే ప్రేమలో పడిన తర్వాత ఆ ప్రేమను ఆమెకు వ్యక్తం చేయలేక తనలో తానే ఇబ్బంది పడుతూ ఆమెకు కాబోయే భర్త ముందు తన ఇష్టాన్ని వ్యక్తం చేస్తూ ఇబ్బంది పడే క్యారెక్టర్ లో శర్వానంద్ ఆకట్టుకున్నాడు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆకట్టుకున్నంత బాగా సెకండ్ హాఫ్ ప్రేక్షకులను ఎంగేజ్ చేసే విషయంలో తడబడినట్లు అనిపించింది. సెకండ్ హాఫ్ లో త్వరగా ముగించేయాల్సిన విషయాన్ని సాగదీసిన ఫీలింగ్ కలిగితే ఆశ్చర్యం లేదు. మొత్తం మీద నవ్విస్తూ, ఆలోచింప చేస్తూ ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకునేలా తెరకెక్కించే విషయంలో దర్శకుడు సఫలమయ్యాడు. అయితే యూత్ ఈ సినిమాకి కనెక్ట్ అయ్యే విషయం మీద ఈ సినిమా కలెక్షన్స్ ఆధారపడి ఉంటాయి. ఎందుకంటే కంప్లీట్ గా ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేసి సినిమా చేసినట్లే అనిపించింది. యూత్ కనెక్ట్ అయ్యే విషయాలు కొన్ని ఉన్నా పూర్తిస్థాయిలో కనెక్ట్ అవుతారా లేదా అనేది చూడాలి.

 

నటీనటుల విషయానికి వస్తే ఈ సినిమాలో శర్వానంద్ ఇప్పటివరకు చేసిన పాత్రలకు చాలా భిన్నంగా ఒక ప్లే బాయ్ తరహా క్యారెక్టర్ లో ఇమిడిపోయాడు. చూస్తున్నది శర్వానంద్ నేనా అని డౌట్ వచ్చేలా కొన్ని సీన్స్ ఉన్నాయంటే ఎంతలా క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయ్యాడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రేమలో పడిన తర్వాత భిన్న వేరియేషన్స్ చూపించే విషయంలో కూడా శర్వానంద్ నటనలో మెచ్యూరిటీ కనిపించింది. కృతి శెట్టి యాక్టింగ్ కూడా ప్రేక్షకులను ఎంగేజ్ చేసేలా ఉంది. నిజానికి శర్వానంద్, కృతి శెట్టి కెమిస్ట్రీ మాత్రం చాలా బాగుంది.మాస్టర్ విక్రమాదిత్యకి ఇది మొదటి సినిమానే అయినా భలే క్యూట్ గా ఆకట్టుకున్నాడు రాహుల్ రవీంద్రన్, రాహుల్ రామకృష్ణ, వెన్నెల కిషోర్, సుదర్శన్ లాంటివాళ్ళు ఉన్నా పూర్తి స్థాయిలో వాడుకోలేదు. ఒకరకంగా సినిమా స్క్రిప్ట్ కి తగ్గట్టుగానే వాళ్ళ పాత్రను డిజైన్ చేశారు ఉన్నంతలో మెప్పించారు. ఇక ముఖేష్ రిషి, సచిన్ కేడ్కర్, తులసి, విజయ్ చందర్ వంటి సీనియర్లు ఉన్న వాళ్ల పాత్రలు కూడా పరిమితమే. శివ కందుకూరి కృతి శెట్టి కాబోయే భర్త పాత్రలో మెరిశాడు. ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ సినిమాకి బాగా ప్రెస్ అయింది ప్రతి ఫ్రేమ్ ని ఒక పెయింటింగ్ లాగా కలర్ఫుల్ సీనరీతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేశాడు సినిమాటోగ్రాఫర్. హేషం సంగీతం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయన అందించిన బిట్ సాంగ్స్ తో పాటు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఆకట్టుకుంది. ఇక సెకండ్ హాఫ్ ఎడిటింగ్ విషయంలో మరింత కేర్ తీసుకుంటే బాగుండేది. పీపుల్ మీడియా నిర్మాణ విలువలు అయితే టాప్ నాచ్.

ఫైనల్లీ మనమే హోల్సం ఫ్యామిలీ ఎంటర్టైన్నర్.. కొన్ని సీన్స్ పక్కన పెడితే ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయదగ్గ సినిమా ఇది.