NTV Telugu Site icon

Review : ‘సేవ్ ద టైగర్స్’

Save The Tigers

Save The Tigers

‘పాఠశాల, ఆనందోబ్రహ్మ, యాత్ర’ సినిమాలు తీసిన డైరెక్టర్ మహి వి. రాఘవ. ‘అద్వైతం’ ఫార్ట్ ఫిల్మ్ తో జాతీయ అవార్డు అందుకున్నాడు ప్రదీప్ మాడుగుల. వీరిద్దరూ క్రియేటర్స్ గా వ్యవహరించిన వెబ్ సీరిస్ ‘సేవ్ ద టైగర్స్’. నటుడు తేజ కాకుమాను ఈ వెబ్ సీరిస్ తో దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఏప్రిల్ 27వ తేదీ నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఇది స్ట్రీమింగ్ అవుతోంది.

ఈ మధ్య కాలంలో వెబ్ సీరిస్ అంటే యాక్షన్, థ్రిల్లర్స్ లేదంటే సెంటిమెంట్ డ్రామాస్. అడల్ట్ కంటెంట్ ను బాగా దట్టించి, పోర్న్ మూవీస్ ను తలపించే ‘రానా నాయుడు’ లాంటివి కూడా తెలుగువారి ముందుకొచ్చాయి. అయితే అందుకు పూర్తి భిన్నంగా మహి, ప్రదీప్, తేజ కలిసి… ‘సేవ్ ద టైగర్స్’ను ఫన్ రోలర్ కోస్టర్ రైడ్ గా మలిచారు. పబ్లిక్ లోకి వచ్చినప్పుడు ప్రతి భర్త తానో పులి అన్నట్టుగా బిల్డప్ ఇస్తాడు. కానీ ఇంట్లో నాలుగు గోడల మధ్య భార్య ముందు పిల్లిలా మారిపోతాడు! దానికి రకరకాల కారణాలు!! పులుల్లాంటి ముగ్గురు యువకులు కాల క్రమంలో భార్యల చేతుల్లో ఎలాంటి హ్యుమిలియేషన్ కు గురయ్యారు? అందుకు కారణాలు… పర్యవసానాలు ఏమిటనేదే ఈ వెబ్ సీరిస్.

గంట రవి (ప్రియదర్శి) నాలుగు బర్రెలను పెట్టుకుని డైరీ ఫామ్ నిర్వహిస్తుంటాడు. అతని భార్య హైమావతి (జోర్దార్ సుజాత) బ్యూటీపార్లర్ నడుపుతుంటుంది. బస్తీ వదిలి గేటెడ్ కమ్యూనిటీకి వెళ్ళిపోవాలని, పిల్లలకు హై-ఫై లైఫ్ అలవాటు చేయాలన్నది హైమా కోరిక. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ రాహుల్ (అభినవ్ గోమఠం) కు రైటర్ కావాలన్న యాంబిషన్. అతని భార్య మాధురి (పావని గంగిరెడ్డి) డాక్టర్. రాహుల్ జాబ్ కు రిజైన్ చేసి, ఇంట్లోనే సీరియల్స్ చూస్తూ… కంటెంట్ రైటర్ గా మారాలని తపన పడుతుంటాడు. ఇక మూడో వ్యక్తి విక్రమ్ (చైతన్య కృష్ణ). యాడ్ ఏజెన్సీలో వర్క్ చేస్తుంటాడు. అతని భార్య లాయర్… అంతకంటే ఎక్కువ ఫెమినిస్ట్ (దేవయాని). ఈ ముగ్గురు హస్బెండ్స్ ఓ రోజు రాత్రి మందుకొట్టి పోలీసులకు డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికి పోతారు. ఎంతో హాయిగా సాగిపోతున్న వీరి జీవితం భార్యల ఆధిపత్యధోరణి కారణంగా ఎలా నాశనం అయిపోయిందో చెప్పడమే ఈ ఆరు ఎపిసోడ్స్ లో ఉంది.

సహజంగా ఇలాంటి వెబ్ సీరిస్ లలో ఆడవాళ్ళ బాధలే ఎక్కువగా ఉంటాయి. బట్…. ఆడవారివల్ల మగవాళ్లు పడే బాధలను వినోదాత్మకంగా ఇందులో చూపించారు. గంట రవిని అతని భార్య మాత్రమే కాదు… తల్లి (గంగవ్వ), కూతురు కూడా ఆడుకుంటారు. రాహుల్ ను భార్య మాత్రమే కాదు… ఇంటి పనిమనిషి కూడా రకరకాలుగా ఆడేసుకుంటుంది. ఇక విక్రమ్ కైతే… ఇటు భార్య, అటు అత్తగారు కలిసి చుక్కలు చూపిస్తారు. ఈ వెబ్ సీరిస్ లో చెప్పుకోవడానికి పెద్దంత కథ లేకపోయినా… ప్రతి సన్నివేశాన్ని ఫన్ జనరేట్ అయ్యేలా తేజ కాకుమాను తీశాడు. దాంతో మొదటి ఎపిసోడ్ నుండి ఆరో ఎపిసోడ్ వరకూ ఎక్కడా బోర్ కొట్టదు. ఇందులోని ముగ్గురు హీరోల పాత్రలలో తమని తాము ఐడెంటిఫై చేసుకునే ప్రయత్నం కొందరు చేస్తారనుకోవడంలో తప్పులేదు. మధ్య తరగతి మనుషుల జీవితాలలో రెగ్యులర్ గా జరిగే ఇన్సిడెంట్స్ నుండే దర్శకుడు తేజ వినోదాన్ని పంచే ప్రయత్నం చేశాడు.

ప్రియదర్శి, అభినవ్ గోమఠం తమదైన కామెడీ టైమింగ్ తో అదరగొట్టేశారు. చైతన్యకృష్ణ హస్బెండ్స్ ఫ్రస్ట్రేషన్ ను బాగా పోట్రేట్ చేశాడు. తెలంగాణ యాసతో జోర్దార్ సుజాత తన పాత్రకు న్యాయం చేకూర్చింది. ఫెమిసిస్టుగా దేవయాని డిగ్నిఫైడ్ గా చేసింది. పావని గంగిరెడ్డి తెర మీద హుందాగా ఉంది. అంతేకాదు… ఈ ముగ్గురు మహిళల్లో భర్తను వేపుకు తినని క్యారెక్టర్ ఏదైనా ఉందంటే ఆమెదే. అయితే ఆ లోటును దర్శకుడు రోషిణి పాత్ర ద్వారా తీర్చేశాడు. ఈ వెబ్ సీరిస్ చూస్తున్నంత సేపు అప్పట్లో జంధ్యాల, ఆ తర్వాత ఆయన శిష్యుడు ఇవీవీ సత్యనారాయణ తీసిన సినిమాలే గుర్తొస్తాయి. ఇందులో ఇతర ప్రధాన పాత్రలను రాజా చేంబోలు, శ్రీకాంత్ అయ్యంగార్, గంగవ్వ, హర్షవర్థన్, సద్దాం, రోషిణి, సత్యకృష్ణన్, సునయన, వేణు టిల్లు తదితరులు పోషించారు.

‘సేవ్ ద టైగర్స్’కు శ్రీరామ్ మద్దూరి సంగీతాన్ని సమకూర్చగా, ఎస్.వి. విశ్వేశ్వర్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించాడు. దీనికి క్రియేటర్స్ లో ఒకరైన ప్రదీవ్ అద్వైతం రచన చేశారు. ఓ స్టార్ హీరోయిన్ కిడ్నాప్ డ్రామాను తెర మీదకు తీసుకొచ్చి… చివరి ఎపిసోడ్ ను సస్పెన్స్ తో ఎండ్ చేశారు. మరి మిగిలిన ఎపిసోడ్స్ ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతాయో చూడాలి. మొత్తం మీద ఈ మధ్యకాలంలో ఇలాంటి నాన్ స్టాప్ కామెడీ వెబ్ సీరీస్ మరొకటి రాలేదనే చెప్పాలి.

ప్లస్ పాయింట్స్:
వినోదానికి పెద్దపీట వేయడం
ఆర్టిస్టుల నటన
ఆకట్టుకునే సంభాషణలు

మైనస్ పాయింట్స్:
గ్రిప్పింగ్ మిస్ అయిన చివరి ఎపిసోడ్
కాస్తంత ఓవర్ గా ఉన్న సన్నివేశాలు

ట్యాగ్ లైన్: సేవ్ ద హజ్బెండ్స్!

Show comments