‘పలాస 1978’ సినిమాతో హీరోగా గుర్తింపు సంపాదించిన రక్షిత్ అట్లూరి హీరోగా, ‘హిట్’ సిరీస్‌తో మంచి క్రేజ్ సంపాదించిన కోమలి హీరోయిన్‌గా ‘శశివదనే’ అనే సినిమా రూపొందింది. రవితేజ, బెల్లంకొండ నిర్మించిన ఈ సినిమా సాంగ్స్‌కి మంచి బజ్ వచ్చింది. అయితే, తాజాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా ఎలా ఉంది, ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.
శశివదనే కథ:
రాఘవ (రక్షిత్) గోదావరి లంక గ్రామంలో తన తండ్రి (శ్రీ మాన్)తో కలిసి జీవనం సాగిస్తూ ఉంటాడు. అనుకోకుండా, రాఘవ పక్కూరికి చెందిన ఓ అమ్మాయి(కోమలి ప్రసాద్)ని చూసి, మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు. అలా, పేరు తెలుసుకునే క్రమంలో ఏర్పడిన పరిచయం క్రమంగా ప్రేమగా మారుతుంది. అయితే, వారిద్దరి మధ్య ప్రేమ ఎంత దూరం వెళ్లింది, కులాలు వేరు కావడంతో వీరికి ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి, చివరికి ఏం జరిగింది అనేది ఈ సినిమా కథ.
విశ్లేషణ
నిజానికి, ఇది ఒక విలేజ్ లవ్ స్టోరీగా తెరకెక్కించారు మేకర్స్. నిజానికి, ఇది కొత్త కథ ఏమీ కాదు, అలాగని ట్రీట్‌మెంట్ కూడా కొత్తగా అనిపించలేదు. కానీ, గోదావరి లొకేషన్స్‌లో ఆసక్తికరంగా సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారనిపించింది. వాస్తవానికి, ఈ సినిమా క్లైమాక్స్ కొత్తగా అనిపించింది. అయితే, క్లైమాక్స్‌ను దృష్టిలో పెట్టుకునే సినిమా కథ మొత్తం రాసుకున్నారేమో అని ఫీలింగ్ కూడా కలిగింది. నిజానికి, ఇలాంటి లైన్‌తో పదుల సంఖ్యలో కాదు, వందల సంఖ్యలోనే సినిమాలు వచ్చాయి. అయితే, ఈ సినిమాలో కూడా దాదాపుగా అదే కథతో బండి నడిపించారు. హీరో తక్కువ కులం, హీరోయిన్ ఎక్కువ కులం, వారి మధ్య ప్రేమ పుట్టడం, హీరోయిన్ హీరో కోసం ఎంత దూరం అయినా సిద్ధం అవ్వడం, ఆ తర్వాత వారు దూరం అవ్వాల్సి రావడం లాంటి కథలతో ఎన్నో సినిమాలు చూశాం. దాదాపు ఇది కూడా అలాగే నడుస్తుంది. కానీ, క్లైమాక్స్ ఒక్కటే కాస్త భిన్నంగా అనిపిస్తుంది.
నటీనటులు
నటీనటుల విషయానికి వస్తే, హీరోగా రక్షిత్ అట్లూరి ప్రాణం పెట్టి పనిచేశాడు. రెండు భిన్నమైన లుక్స్‌లో ఆకట్టుకునేలా కనిపించాడు. అయితే, హీరోయిన్ కోమలి ప్రసాద్ మాత్రం శశి అనే పాత్రలో ఒదిగిపోయింది. ఒక పల్లెటూరి పిల్లగా, ఒకపక్క అందంగా కనిపిస్తూ, మరోపక్క అమాయకత్వంతో అభినయిస్తూ, అసలు పల్లెటూరి అమ్మాయి అంటే ఇలానే ఉండాలేమో అనేలా ఆ పాత్రలో ఒదిగిపోయింది. మరీ ముఖ్యంగా, ఒకపక్క పంటి బిగువున బాధను భరిస్తూ, మరోపక్క గంభీరంగా బయటకు కనిపించాల్సి వచ్చే పరిస్థితుల్లో అయితే, ఆమె నటన మరింత ఆకట్టుకునేలా ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ‘హిట్’లో పూర్తిస్థాయిలో టాంబాయ్ క్యారెక్టర్లో కనిపించిన ఆమె, ఈ సినిమాలో మాత్రం 16 అణాల తెలుగమ్మాయిగా సరిగ్గా సూట్ అయింది. హీరో తండ్రి పాత్రలో శ్రీమాన్ సినిమాకి ప్లస్ అయ్యాడు. అదేవిధంగా, విలన్‌గా నటించిన వ్యక్తి కూడా తన పరిధి మేరకు ఆకట్టుకున్నాడు.
టెక్నికల్ టీమ్ విషయానికొస్తే, సినిమాలోని డైలాగ్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి, కొన్ని ఆలోచనలు చేసే విధంగా ఉన్నాయి. ఇక, సినిమాటోగ్రఫీ అయితే సినిమాకి మంచి ప్లస్ పాయింట్ అయింది. ఎందుకంటే, గోదావరి అందాలను చూపించడమే కాదు, కొన్ని విషయాలను మాటలతో చెప్పకుండా ఫ్రేమ్స్‌లోనే చూపించాల్సి వచ్చే సందర్భాల్లో అయితే, టాప్ నాచ్ లెవెల్లో చూపించారు. పాటలు బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకి తగ్గట్టుగా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. నిడివి మరికాస్త తగ్గించినా ఇబ్బందులు లేదేమో అనిపిస్తుంది.
శశివదనే.. రొటీన్ స్టోరీ విత్ షాకింగ్ క్లైమాక్స్.