జర్నలిస్ట్ గా, శాటిలైట్ బిజినెస్ మేన్ గా చిత్రపరిశ్రమలో అపారమైన అనుభవం ఉన్న రాఘవేంద్రరెడ్డి అందించిన కథతో తెరకెక్కిన సినిమా ‘శాసన సభ’. శాసన సభ గౌరవం పెంచేదిగా ఉంటుందని యూనిట్ చేసిన ప్రచారంతో పాటు ట్రైలర్ ఆకట్టుకోవడంతో సినిమామీద కొంత బజ్ ఏర్పడింది. దానికి తోడు పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేస్తుండటంతో మరి కొంత ఆసక్తి కలిగించింది. మరి ఆ ఆసక్తికి తగ్గట్లు ఈ పొలిటికల్ డ్రామా ఉందో లేదో చూద్దాం.
కథ విషయానికి వస్తే ముఖ్యమంత్రి అనీష్ కురువిల్లా, ప్రతిపక్ష పార్టీ నాయకురాలు సోనియా అగర్వాల్ అధికారం కోసం పోటీపడుతుంటారు. ఎన్నికలు జరిగిన తర్వాత ఏ పార్టీకి మెజారిటీ రాదని తేలటంతో ఇండిపెండెంట్ ఎమ్మెల్లేలను కొనటం ధ్యేయంగా ఎత్తుకు పై ఎత్తులు వేస్తుంటారు. అందులో భాగంగా ఆ బేరసారాల్లో ఆరితేరిన దుర్గాను జైలులో చంపాలని ఒకరు, కాపాడాలని ఇంకొకరు ప్రయత్నిస్తుంటారు. అయితే తనని జైల్లో సూర్య (ఇంద్రసేన) కాపాడి నమ్మకం సంపాదించుకుంటాడు. దాంతో దుర్గతో పాటు హీరోని కూడా జైలునుంచి తప్పిస్తారు సి.ఎం. మనుషులు. ఆ తర్వాత ఎమ్మెల్లేలను క్యాంపుకు తరలించాలనే ప్రయత్నం చేస్తారు. కానీ అటు అధికారపార్టీ, ఇటు ప్రతిపక్ష పార్టీ తరపును ఎన్నికల్లో గెలిచిన వారితో పాటు ఇండిపెండెంట్ ఎమ్మెల్లేలను అందరినీ కిడ్నాప్ చేస్తాడు హీరో సూర్య. అతను ఎందుకు వారిని కిడ్నాప్ చేస్తాడు. ప్రజలకి మంచి చేయాలనే తపన ఉన్న ఎ.ఎల్.ఎ నారాయణ స్వామి (రాజేంద్ర ప్రసాద్)కి తనకు ఉన్న సంబంధం ఏమిటి? నోటుకు ఓటు వేసిన ప్రజలకు ఎదురయ్యే సమస్యలు ఏమిటన్నదే ఈ చిత్రం కథాంశం
నిజానికి రాజకీయ చిత్రాలు మనకు కొత్త కాదు. రాజకీయ నేపథ్యంతో వచ్చిన సినిమాలు చూసి ఉన్నాం. ఇది కూడా అదే కోవకు చెందిన సినిమా. ఎత్తుగడ మంచిదే అయినా దానిని తెరకెక్కించిన విధానం మాత్రం అసలు ఏమాత్రం అకట్టుకునేదిగా లేదు. రొద్ద కొట్టుడు యాక్షన్ సినిమాగా దీనిని మలిచారు. ప్రథమార్ధం సరే కనీసం ద్వితీయార్ధంలో రాజేంద్ర ప్రసాద్ ఎంట్రీ తర్వాత అయినా కొంచెం ఆసక్తి పెరుగుతుందని ఆశ కలిగినా నిరాశే ఎదురవుతుంది. హీరోయిన్ తో లవ్ ట్రాక్ పరమ రొటీన్. ఏదో ఒకటి రెండు రాజకీయ సన్నివేశాలు తప్ప, కథనంలో కొత్తదనం లేదు, ప్రేమ, కామెడీ, యాక్షన్ అన్నీ కథలో బలవంతంగా ఇరికించినట్లు అనిపిస్తాయి. కాలం చెల్లిన కథతో క్లైమాక్స్ వరకు ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుందీ చిత్రం.
నటీనటులు పెర్‌ఫార్మెన్స్ గురించి మాట్లాడాలంటే ఇంద్రసేన సూర్య పాత్రలో ఉత్సవ విగ్రహంలా కనిపిస్తాడు. ఫేస్ లో ఎక్స్ ప్రెషన్స్ శూన్యం. సోనియా అగర్వాల్ పోషించిన రాజకీయనాయకురాలి పాత్ర తనకు అంతగా నప్పలేదు. రాజేంద్ర ప్రసాద్ ఎప్పటిలాగే ఎమ్మెల్లే నారాయణ స్వామి పాత్రకు జీవం పోశాడు. ఇలాంటి పాత్రలు ఆయనకు కొట్టినపిండే. హెబ్బాపటేల్ ఐటమ్ సాంగ్ ఎందుకు పెట్టినట్లో అర్థంకాదు. రచయిత కె. రాఘవేంద్రరెడ్డి పాత కథనే కొత్త సీసాలో పోయాలని ప్రయత్నించాడు కానీ ఆ ప్రతయ్నంలో సక్సెస్ కాలేక పోయాడనే చెప్పాలి. రవిబసూర్ నేపథ్య సంగీతం చెవులకు పట్టిన తుప్పును వదిలించేలా ఉంది. దర్శకుడు వేణు మండికంటి టేకింగ్ 80లలో సినిమాలను గుర్తుకు తెచ్చేలా సాగింది.
రేటింగ్: 2.25/ 5
ప్లస్ పాయింట్లు
ఎంచుకున్న లైన్
కొన్ని సన్నివేశాలు
రాజేంద్ర ప్రసాద్ నటన
మైనస్ పాయింట్లు
కథ, కథనం
రవిబసూర్ నేపథ్యం సంగీతం
ఊహకందే క్లయిమాక్స్
బోటమ్ లైన్: యాక్షన్ సభ