Richie Gadi Pelli Movie Review: తమిళ దర్శక నిర్మాత కె. ఎస్. హేమరాజ్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తూ రూపొందించిన సినిమా ‘రిచి గాడి పెళ్ళి’. కొద్ది రోజుల క్రితం ఈ మూవీ ట్రైలర్ విడుదల కాగానే ఇది గత యేడాది వచ్చిన మోహన్ లాల్ మలయాళ చిత్రం ‘ట్వల్త్ మ్యాన్’కు రీమేక్ అంటూ నెటిజన్స్ విపరీతంగా ట్రోల్ చేశారు. అయితే… కోర్ పాయింట్ ను మాత్రమే ఆ సినిమా నుండి డైరెక్టర్ తీసుకున్నాడు తప్పితే… దీనికి ఆ సినిమాకు ఎలాంటి సంబంధం లేదు.
రిచి (సత్య ఎస్.కె) అనే కుర్రాడికి సంబంధించిన కథ ఇది. అప్పటికే ప్రేమలో ఓసారి ఓడిపోయిన రిచి సిరి (చందనరాజ్)తో మ్యారేజ్ కు రెడీ అవుతాడు. ఊటీలో జరగబోతున్న తన పెళ్ళికి స్నేహితులందరినీ ఆహ్వానిస్తాడు. పెళ్ళికి ముందు అదే రిసార్ట్ లో బ్యాచిలర్ పార్టీని ఏర్పాటు చేస్తాడు. రిచి స్నేహితులంతా ఓ చోట చేరిన తర్వాత లక్ష్మీపతి (సతీశ్) కారణంగా వాళ్లు తప్పని సరి పరిస్థితుల్లో ఓ ఫన్ గేమ్ లో ఇన్ వాల్వ్ అవుతారు. ఎవరికి ఫోన్ వచ్చినా దాన్ని లౌడ్ స్పీకర్ లో పెట్టి మాట్లాడాలి, అలానే మెసేజ్ ఏది వచ్చిన పైకి చెప్పాలి అన్నది షరతు! సరదాగా మొదలైన ఈ క్రేజీ గేమ్ ఆ తర్వాత వాళ్ళ మధ్య ఊహించని వైరాలకు కారణం అవుతుంది. వాళ్ళంతా స్నేహితులే అయినా ఒకరికి తెలియని రహస్యాలు మరొకరి తెలుస్తాయి. కొందరిలోని గ్రే షేడ్స్ బయట పడతాయి. తెలియక చేసిన తప్పులు, తెలిసి నిర్లక్ష్యంతో చేసిన తప్పులు కూడా ఆ ఫోన్ కాల్స్ కారణంగా ఇతరులకు తెలిసి పోతాయి. ఈ ఫోన్ కాల్స్ వల్ల వారి మధ్య ఎలాంటి అపార్థాలు చోటుచేసుకున్నాయి? వాటిని మెచ్యూర్ మైండ్ తో తిరిగి ఎలా సాల్వ్ చేసుకున్నారు? అన్నదే మిగతా కథ.
సహజంగా సినిమాల్లో బ్యాచిలర్స్ పార్టీ అనేది ఓ చిన్న సీన్ గా వస్తూ ఉంటుంది. సరదాగా వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ బ్యాచిలర్ పార్టీ చుట్టూనే కథంతా సాగింది. ఊటీలో ఓ చల్లని సాయంత్రం, ఒకే వయసు ఉన్న ఆడ-మగ స్నేహితులంతా మద్యం తాగుతూ బ్యాచిలర్ పార్టీని జరుపుకోవడం, దానికి ‘స్పీకర్ ఆన్ చేసి ఫోన్ మాట్లాడటం’ అనే మసాలా జోడించడంతో కథ రసకందాయంలో పడింది. ఇవాళ కుటుంబ సభ్యులతో సైతం సీక్రెట్స్ మెయిన్ టైన్ చేసే రోజులు వచ్చాయి. ఏ ఒక్కరూ అన్ని విషయాలను మరొకరితో షేర్ చేసుకోని పరిస్థితి. అటువంటి రోజుల్లో ఇలా ఫోన్ కాల్స్ ను స్పీకర్ లో పెట్టి మాట్లాడితే ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయనే అంశాన్ని దర్శకుడు ఆసక్తి కరంగా తెరకెక్కించాడు. ఓ చిన్న పాయింట్ ను తీసుకుని మానవ సంబంధాలను, కుటుంబ సభ్యుల మధ్య ఏర్పడిన అగాథాలను తెలియచెప్పే ప్రయత్నం చేశాడు. పాత్రలను పరిచయం చేయడానికి కొంత ఎక్కువ సమయం తీసుకోవడంతో ప్రథమార్థం కాస్తంత సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. ద్వితీయార్థంలో ఒక్కొక్కరి సమస్యలు, వాటి పరిష్కారం దిశ కథ సాగడంతో చకచకా సాగినట్టు అనిపిస్తుంది.
నటీనటుల విషయానివస్తే అందరూ దాదాపుగా కొత్తవారే. వారి మీద ఎలాంటి ఇమేజ్ లేకపోవడం కొంత ఉపయోగపడింది. రిచిగా సత్య ఎస్.కె., అతని ప్రియురాలు సిరిగా (చందన రాజ్) నటించారు. రిచి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గా బన్నీ వాక్స్, సీరియల్ ఆర్టిస్ట్ గా నవీన్ నేని, లక్ష్మీపతిగా కొరియోగ్రాఫర్ సతీశ్ చక్కటి నటన కనబరిచారు. అలానే సూడో ఫెమినిస్టుగా ప్రణీత పట్నాయక్ మెప్పించింది. ఇతర ప్రధాన పాత్రలను కిశోర్ మారిశెట్టి, ప్రవీణ్ రెడ్డి, కియారా నాయుడు, మాస్టర్ రాకేష్ తమోగ్న తదితరులు పోషించారు. ఈ మూవీకి మెయిన్ హైలైట్ విజయ్ ఉలగనాథ్ సినిమాటోగ్రఫీ. సినిమా దాదాపుగా నైట్ ఎఫెక్ట్స్ లోనే సాగుతుంది. పైగా ఒకే రిసార్ట్ లో మూవీ మొత్తం తీసేశారు. విజయ్ ఉగలనాథ్ తన ప్రతిభతో ప్రతి సన్నివేశాన్ని అందంగా, ఆసక్తికరంగా తెరపై చూపించారు. సత్యన్ అందించిన నేపథ్య సంగీతం సీన్స్ మూడ్ ను బాగానే ఎలివేట్ చేసింది. కథను నాగరాజుతో కలిసి అందించిన రాజేంద్ర వైట్ల మాటలు ఆకట్టుకున్నాయి. పరిమితమైన బడ్జెట్ లో పక్కా ప్రణాళికతో మూవీని తెరకెక్కించారు. అయితే… ప్రేక్షకులను కట్టిపడేసే సన్నివేశాలేవీ ఇందులో లేవు. సెంటిమెంట్ సైతం పెద్దంత పండలేదు. ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్ కు వెళ్ళితే రొటీన్ కు భిన్నమైన సినిమాను చూసిన అనుభూతిని పొందొచ్చు. యాక్షన్ సినిమాలను, ఫ్యామిలీ డ్రామాలను ఇష్టపడేవారు ఓటీటీలో స్ట్రీమింగ్ అయినప్పుడు చూస్తే బెటర్!
రేటింగ్: 2.5/5
ప్లస్ పాయింట్స్
నటీనటుల సహజ నటన
ఎంచుకున్న పాయింట్
విజయ్ ఉగలనాథ్ సినిమాటోగ్రఫీ
మైనెస్ పాయింట్
స్లోగా సాగే ప్రథమార్ధం
పెద్దంత ట్విస్టులు లేకపోవడం
పండని సెంటిమెంట్ సీన్స్
ట్యాగ్ లైన్: సమ్ థింగ్ డిఫరెంట్!