NTV Telugu Site icon

Ramabanam Review: రామబాణం రివ్యూ

Ramabanam

Ramabanam

యాక్షన్ హీరోగా గోపీచంద్ తనదైన బాణీ పలికిస్తూ సాగారు. కానీ, కొంతకాలంగా ఆయనతో సక్సెస్ దోబూచులాడుతోంది. ఈ నేపథ్యంలో గోపీచంద్, దర్శకుడు శ్రీవాస్ కాంబోలో రూపొందిన ‘రామబాణం’పై ఆసక్తి నెలకొంది. అందుకు కారణం – శ్రీవాస్ దర్శకునిగా పరిచయం అయిందే గోపీచంద్ ‘లక్ష్యం’ చిత్రంతో. ఆ తరువాత గోపీచంద్, శ్రీవాస్ కలయికలో రూపొందిన ‘లౌక్యం’ కూడా ఆకట్టుకుంది. వారిద్దరూ కలసి పనిచేసిన మూడో చిత్రంగా ‘రామబాణం’ తెరకెక్కింది. శుక్రవారం ఈ సినిమా జనం ముందు నిలచింది.

ఇంతకూ ఈ ‘రామబాణం’ కథ ఏమిటంటే – అందరూ ఆరోగ్యంగా ఉండాలన్న సంకల్పంతో జనానికి ఆర్గానిక్ ఫుడ్ ను అందిస్తుంటాడు రాజారామ్ (జగపతిబాబు). అతనికి పూర్తిగా విరుద్ధమైనవాడు పాపారావు (నాజర్). ఫుడ్ తో సొమ్ము చేసుకోవాలే కానీ, జనం ఆరోగ్యం గురించి మనకెందుకు అన్నది పాపారావు భావన. రాజారామ్ ఫుడ్ లైసెన్స్ ను రద్దు చేసే ప్రయత్నంలో ఉంటాడు పాపారావు. ఇది తెలిసిన రాజారామ్ తమ్ముడు పదిహేనేళ్ళ విక్కీ (గోపీచంద్) పాపారావు గోడౌన్ ను దగ్ధం చేస్తాడు. నిజాయితీ పరుడైన రాజారామ్ తమ్ముణ్ని పోలీసులకు లొంగిపొమ్మంటాడు. కానీ, విక్కీ పారిపోయి కలకత్తా చేరుకొని అక్కడ ఓ డాన్ చెంత చేరతాడు. తరువాత ఇతను కూడా విక్కీదాదాగా చెలామణీ అయ్యి, కోట్లకు పడగలెత్తుతాడు. కానీ పేద ప్రజల పక్షాన ఉంటాడు. అక్కడ భైరవి (డింపుల్ హయతి) అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. వారి కుటుంబసభ్యులు ‘నీకు కోట్ల ఆస్తి ఉండవచ్చు, కానీ, ఏ ఫ్యామిలీ లేని నీకు మా అమ్మాయిని ఎలా ఇస్తామని’ అంటారు. తనకు హైదరాబాద్ లో ఫ్యామిలీ ఉందని చెప్పి, తన అన్నను కలవడానికి వస్తాడు విక్కీ. అక్కడ రాజారామ్ ‘సుఖీభవ’ పేరుతో హోటల్ నడుపుతూ ఉంటాడు. పాపారావు అల్లుడు (తరుణ్ అరోరా) ‘జి.కె.ఫుడ్స్’బ్రాండ్ పై కల్తీ ఆహారం సప్లై చేస్తుంటాడు. అతని వ్యాపారం మూయించాలని రాజారామ్ ప్రయత్నిస్తాడు. దాంతో పాపారావు అల్లుడు రాజారామ్ కుటుంబాన్ని అంతం చేయాలని చూస్తాడు. తన అన్న రాజారామ్ కుటుంబాన్ని విక్కీ ఎలా రక్షించాడు అన్నదే మిగిలిన కథ.

ఇందులో అన్నదమ్ముల అనుబంధం, వదిన-మరిది సెంటిమెంట్ కూ ప్రాధాన్యమిచ్చారు. మేచోమేన్ గా పేరున్న గోపీచంద్ తనదైన నటనతోనూ, యాక్షన్ సీన్స్ లోనూ ఆకట్టుకున్నారు. నాయిక డింపుల్ హయతి గ్లామర్ కే పరిమితమయింది. జగపతిబాబు మళ్ళీ ఫ్యామిలీ మేన్ గా ఇందులో కనిపించారు. సినిమాలో చాలామంది నటీనటులు కనిపిస్తారు. కానీ, వారెవ్వరినీ దర్శకుడు శ్రీవాస్ పూర్తి స్థాయిలో ఉపయోగించుకోలేక పోయారు. భూపతిరాజా అందించిన కథకు, మధుసూదన్ పడమటి మాటలు పలికించారు. సన్నివేశాలకు తగ్గట్టుగా మధుసూదన్ మాటల రచన సాగింది. పాటల్లో పసలేదు, మిక్కీ జె.మేయర్ బాణీలు ఏ మాత్రం ఆకట్టుకోవు. నిర్మాత విశ్వప్రసాద్ ఎక్కడా రాజీపడకుండా ఖర్చుచేసిన వైనం కనిపిస్తుంది. మాస్ మసాలాలు దట్టించడంలో కొన్నిసార్లు సక్సెస్ చూసిన శ్రీవాస్ ఈ సినిమాలోనూ అదే ప్రయత్నం చేశారు. కానీ, మసాలా కాసింత ఎక్కువైనట్టు అనిపిస్తుంది.

ప్లస్ పాయింట్స్:
– గోపీచంద్, శ్రీవాస్ కాంబో కావడం
– ప్రొడక్షన్ వేల్యూస్
– ఆకట్టుకొనే మాటల రచన

మైనస్ పాయింట్స్:
– కథలో కొత్తదనం లేకపోవడం
– సాగదీసినట్టుగా ఉన్న కొన్ని సీన్స్
– అంతగా ఆకట్టుకోని సంగీతం

ట్యాగ్ లైన్: పదునులేని ‘రామబాణం’!