Off The Record: వైసీపీ సోషల్ మీడియా సైన్యం ఇప్పుడు ఆ పార్టీకి ప్రధాన ఆయుధంగా మారిందట. ప్రజా సమస్యలను వైరల్ కంటెంట్‌గా మార్చి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే కీలక శక్తిగా ఎదుగుతోందని తెలుస్తోంది. కూటమి వైఫల్యాలు, ప్రజావ్యతిరేక విధానాలను ఒకేసారి కోట్ల మందికి చేరవేస్తోంది. జగన్ మాటను వక్రీకరణ లేకుండా ప్రజల్లోకి తీసుకెళ్లి తప్పుడు ప్రచారానికి కౌంటర్ ఇస్తోందని పొలిటికల్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. పల్లె నుంచి పట్టణం వరకూ విస్తరించిన ఈ డిజిటల్ సైన్యమే వైసీపీ రాజకీయ బలానికి బేస్‌గా మారిందని తెలుస్తోంది. అధికారంలో లేకపోయినా కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తూ పోరాటం కొనసాగిస్తోందట వైసీపీ.
అసెంబ్లీ బయట జరుగుతున్న రాజకీయ పోరాటం ఇప్పుడు సోషల్ మీడియాలోనే కొనసాగుతుందనే చర్చ నడుస్తోంది. ప్రభుత్వ సంక్షేమ పథకాల నిలిపివేతపై ప్రశ్నలు లేవనెత్తుతూ ముందుకు సాగుతోందట. ప్రభుత్వ నిర్ణయాలపై తక్షణం విమర్శ, కౌంటర్లతో అధికార పార్టీ ప్రచారాన్ని ఎదుర్కొంటోంది. ఫ్యాక్ట్ చెక్ పేరుతో ప్రభుత్వ వాదనలను ప్రశ్నించడం ద్వారా సోషల్ మీడియాలో నిరంతర రాజకీయ యుద్ధం కొనసాగిస్తోంది వైసీపీ.
మరోవైపు…మీడియా కవరేజ్‌లేని అంశాలను కూడా సోషల్ మీడియాలో ముందుకు తీసుకెళ్లి వైరల్ చేయగల వ్యూహం వైసీపీకి ప్రత్యేక బలంగా మారినట్లు సమాచారం. ప్రతిపక్ష గొంతును ప్రజల్లో నిలబెట్టే డిజిటల్ మైక్‌గా సోషల్ మీడియాను పార్టీ వినియోగిస్తున్నట్లుగా తెలుస్తోంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రసంగాలు, పర్యటనలు, పార్టీ కార్యక్రమాలను డిజిటల్ వేదికలపై బలంగా ప్రచారం చేస్తోంది. క్యాడర్‌ను ఉత్సాహపరిచే మోటివేషనల్ కంటెంట్‌పై ప్రత్యేక దృష్టి సారించిందని తెలిసింది. ఫేస్‌బుక్, ఎక్స్, యూట్యూబ్ వేదికలుగా డిజిటల్ వార్‌ను నడిపిస్తోందట. ఇలా ఎన్నికలకు ముందే డిజిటల్ గ్రౌండ్‌ను సిద్ధం చేసే ప్రయత్నం వైసీపీ వ్యూహంలో స్పష్టంగా కనిపిస్తోందని టాక్. రాజకీయ పార్టీల్లో అత్యంత బలమైన సోషల్ మీడియా నెట్‌వర్క్ వైసీపీదేనన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. క్లిష్టమైన రాజకీయ అంశాలను సాధారణ ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా చెప్పడం, సంక్షేమం, ప్రజాసమస్యలు, ప్రభుత్వ నిర్ణయాలపై డిజిటల్ వాయిస్ వినిపించడం వైసీపీ ప్రత్యేకతగా మారినట్లుగా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
సోషల్ మీడియా బలం, గ్రౌండ్ లెవల్ కార్యకర్తలు..డిజిటల్ వాలంటీర్ల సమన్వయం వైసీపీకి ప్రధాన బలాలుగా మారినట్లుగా తెలిసింది. హ్యాష్‌ట్యాగ్ క్యాంపెయిన్స్‌లో నిరంతర ట్రెండింగ్ సామర్థ్యం, నాయకత్వం నుంచి క్యాడర్ వరకూ ఒకే లైన్ మెసేజ్ వెళ్లే వ్యవస్థ, ప్రజల స్పందనను కంటెంట్‌గా మార్చే రియల్ టైమ్ స్ట్రాటజీ వైసీపీకి బెంచ్‌మార్క్‌గా మారిందట. యువత, డిజిటల్ ఓటర్లపై గట్టి ప్రభావంతో సోషల్ మీడియాను ప్రచార సాధనంగానే కాకుండా రాజకీయ పోరాట వేదికగా మలిచిన పార్టీగా ప్రత్యేక గుర్తింపు పొందుతున్నట్లు తెలుస్తోంది. వైసీపీ సోషల్ మీడియా జిల్లాస్థాయి నుంచి గ్రామస్థాయి వరకూ పూర్తిస్థాయిలో విస్తరించి ఉంది. అన్ని స్థాయిలను కలిపితే దాదాపు 80వేల మందితో ప్రత్యేకమైన సోషల్ మీడియా స్టేట్ కమిటీ వ్యవస్థ ఉంది. యూత్, స్టూడెంట్, మహిళా, బీసీ, ఎస్సీ, ఎస్టీతో పాటు ఇతర విభాగాల నుంచి యాక్టివ్‌గా పాల్గొంటున్నారట. ప్రతి నియోజకవర్గం నుంచి 3వేల మంది వరకు అనధికారంగా సోషల్ మీడియాలో చురుకుగా ఉన్నారని తెలుస్తోంది. మొత్తంగా ఐదు లక్షలకుపైగా సభ్యులతో వైసీపీకి సోషల్ మీడియా సైన్యం సిద్ధంగా ఉందట. సోషల్ మీడియానే రాజకీయ యుద్ధ భూమిగా మారుతున్న వేళ, రాబోయే ఎన్నికల్లో ఈ డిజిటల్ టీమ్ వైసీపీకి గేమ్ ఛేంజర్ అవుతుందన్న అభిప్రాయం వినిపిస్తోంది.