NTV Telugu Site icon

Organic Mama Hybrid Alludu Movie Review : ఆర్గానిక్ మామ – హైబ్రీడ్ అల్లుడు!

Telugu Review

Telugu Review

దాదాపు దశాబ్దం తర్వాత ప్రముఖ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తిరిగి తన చేతిలోకి మెగా ఫోన్ తీసుకున్నారు. ‘ఆర్గానిక్ మామ – హైబ్రీడ్ అల్లుడు’ పేరుతో సినిమా రూపొందించారు. తనకు అచ్చివచ్చిన రాజేంద్ర ప్రసాద్ తోనూ, ‘బిగ్ బాస్’ ఫేమ్ సోహెల్ తోనూ టైటిల్ రోల్స్ చేయించారు. కోనేరు కల్పన నిర్మించిన ఈ సినిమాకు కె. అచ్చిరెడ్డి ప్రెజెంటర్! విశేషం ఏమంటే… కథ, స్క్రీన్ ప్లే, సంగీతం, దర్శకత్వంతో పాటు ఎస్వీకే ఈ చిత్రానికి డైలాగ్స్ కూడా రాశారు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా జనం ముందుకు శుక్రవారం వచ్చిన ‘ఆర్గానిక్ మామ – హైబ్రీడ్ అల్లుడు’ ఏమేరకు ఎంటర్ టైన్ చేశారో తెలుసుకుందాం.

విజయ్ (సోహెల్) రెండు ఫ్లాప్ మూవీస్ తీసిన దర్శకుడు. మూడో సినిమానైనా సక్సెస్ చేయాలని కలలుకంటూ ఉంటాడు. అందుకోసం ప్రయత్నిస్తుంటాడు. అతని తల్లిదండ్రులు కొయ్యబొమ్మలు చేస్తూ జీవితాన్ని గడుపుతుంటారు. ఈ సంప్రదాయ కళకు ఆదరణ కరువు అవుతున్న టైమ్ లో విజయ్ ఓ స్టార్ హోటల్ తో టై-అప్ అయ్యి తండ్రి చేసే బొమ్మలను అమ్మే ప్రయత్నం చేస్తాడు. అదే సమయంలో అతనికి హాసిని (మృణాళిని రవి) పరిచయం అవుతుంది. అతనిలోని మాటకారితనానికి ఆమె ఫిదా అయిపోతుంది. ఆర్గానిక్ వ్యవసాయం చేస్తూ స్టార్ హోటల్స్ కు కూరగాయలు సప్లయ్ చేసే వెంకట రమణ (రాజేంద్ర ప్రసాద్) కూతురే హాసిని. కూతరంటే ఎంతో ప్రేమ ఉన్న వెంకట రమణ ఆమెను బాగా డబ్బున్నవాడికిచ్చి పెళ్ళి చేయాలనుకుంటాడు. కానీ ఇక్కడేమో ఈమె బొమ్మలు తయారు చేసే వాళ్ల కుర్రాడి ప్రేమలో పడుతుంది. మరి డైరెక్టర్ గా సక్సెస్ సాధించాలనుకున్న విజయ్ కోరిక తీరిందా? కోటీశ్వరుడికిచ్చి తన కూతురు పెళ్ళి చేయాలనుకున్న వెంకట రమణ ఆశయం నెరవేరిందా? పెద్దలంటే విపరీతమైన గౌరవం ఉన్న ఈ యువ ప్రేమికులు ఎలా పెళ్ళిపీటలు ఎక్కారు? అనేది మిగతా కథ.

ఈ సినిమాలో నిర్మాత మునికొండ… దర్శకుడైన విజయ్ ను తాము తీయబోతున్న సినిమా కథేంటో చెప్పమని తెగ బతిమలాడతాడు. సినిమా విడుదలై సక్సెస్ సాధించే వరకూ అతను నిర్మాతకు కథే చెప్పడు. ప్రతిసారీ ఏదో రకంగా దాటేస్తుంటాడు. బహుశా దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి కూడా ఈ సినిమా కథను చెప్పకుండానే తెర మీద చూడండని నిర్మాత కోనేరు కల్పనకు చెప్పి ఉండొచ్చు. ఎందుకంటే ఇందులో చెప్పుకోవడానికి పెద్దంత కథేమీ లేదు. చాలా సింపుల్ స్టోరీ. ఎలాంటి ట్విస్ట్స్ అండ్ టర్న్ ఉండవు. అయితే… సినిమా ప్రారంభం నుండి ముగింపు వరకూ దర్శకుడు కృష్ణారెడ్డి తనదైన శైలిలో నడిపించేశాడు. బహుశా ‘ఇదీ కథ’ అని చెబితే… ఆమె కూడా ‘రొటీన్ కథే కదా!’ అని పెదవి విరిచే ఆస్కారం లేకపోలేదు.

దర్శకుడైన హీరో క్యారెక్టరైజేషన్ చూస్తే… కృష్ణారెడ్డి తన గురించి తానే కొంత వివరణ ఇచ్చుకున్నట్టు అనిపిస్తుంది. ఫ్లాప్ ఇచ్చినంత మాత్రాన ఆ డైరెక్టర్ లో విషయంలేదని అనుకోకూడదని చెబుతూనే, అలా ఫ్లాప్స్ ను పదే పదే గుర్తు చేసి వేధించే మీడియా మీద కూడా ఎస్వీకే సెటైర్ వేశాడు. అంతస్తుల అంతరం ఉన్న ప్రేమికులకు ఆడపిల్ల తండ్రే ప్రతిబంధకంగా నిలుస్తాడు. ఇందులో హీరోయిన్ తండ్రి పాత్ర కూడా అలాంటిదే. అయినా… దాన్ని పాజిటివ్ కోణంలోనే చూపించారు. దాంతో మూవీలోని ప్రధాన పాత్రల మధ్య ఎలాంటి బిగ్ క్లాష్‌కూ ఆస్కారం లేకుండా పోయింది. సో… హీరో తనని తాను ప్రూవ్ చేసుకుని, తన మీద అందరూ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే అసలు టార్గెట్. దీన్ని సాధించే క్రమంలో హీరో ఎలా కష్టపడ్డాడు? అనే దానికి దర్శకుడు పెద్దంత ప్రాధాన్యం ఇవ్వలేదు. దాని మీద దృష్టీ పెట్టలేదు. సీరియస్ గా కథలోకి పోవాల్సిన ద్వితీయార్థాన్ని డైరెక్టర్ వినోద ప్రధానంగా చూపించడంతో సినిమా తేలిపోయింది.

నటీనటుల విషయానికి వస్తే… సీనియర్ నటుడైన రాజేంద్రపసాద్ తన పాత్రను చాలా హుందాగా చేశారు. మెచ్యూర్డ్ యాక్టింగ్ తో ఆకట్టుకున్నారు. మీనా పాత్రను మలిచిన తీరు బాగుంది. యంగ్ హీరో సోహెల్ తన క్యారెక్టర్ లో చక్కగా ఒదిగిపోయాడు. ఈ మధ్యలో వచ్చిన ఒకటి, రెండు సినిమాలతో పోల్చితే ఇందులో చాలా సెటిల్డ్ గా నటించాడు. డాన్స్ చక్కగా చేశాడు. మృణాళిని రవి ఓకే. ఆమె నుండి అంతకు మించి ఏమీ ఆశించలేం. ఇతర ప్రధాన పాత్రలను సూర్య, హేమ, హర్ష, రాజా రవీంద్ర, అలీ, సునీల్, ‘రాకెట్’ రాఘవ, సప్తగిరి, కృష్ణ భగవాన్, సన, అజయ్ ఘోష్‌, ప్రవీణ్‌, బాబూ మోహన్, పృధ్వీ, సురేఖ వాణి తదితరులు పోషించారు. వెంకట్, వరుణ్ సందేశ్, రష్మీ గౌతమ్ అతిథి పాత్రల్లో మెరిశారు. ఈ మూవీకి మెయిన్ హైలైట్ సి. రాం ప్రసాద్ సినిమాటోగ్రఫీ. పాటల చిత్రీకరణ బాగుంది. వాటి సాహిత్యం కూడా అర్థవంతంగా ఉంది. చిన్నా నేపథ్య సంగీతం మూవీకి మరో ప్లస్ పాయింట్. డైలాగ్స్, యాక్షన్ కొరియోగ్రఫీ బాగున్నాయి. నిర్మాత కోనేరు కల్పన ఎక్కడా రాజీ పడకుండా సినిమాను నిర్మించారు. అయితే… కథ ఎంపికలో ఇంకాస్తంత జాగ్రత్త ఉండాల్సింది. దాదాపు పదేళ్ళ తర్వాత ఎస్వీ కృష్ణారెడ్డి మూవీ వస్తోందంటే ఆయన అభిమానుల అంచనాలు అంబరాన్ని తాకడం సహజం. వాటినైతే ఈ సినిమా అందుకోలేకపోయింది. ఇది ఎస్వీ కృష్ణారెడ్డి మార్క్ ఆర్గానిక్ మూవీనే అయినా… ఈ తరం కోరుకునే హైబ్రీడ్ మెటీరియల్ ఇందులో మిస్ అయ్యింది.

రేటింగ్: 2.5/ 5

ప్లస్ పాయింట్స్
నటీనటుల నటన
ఆకట్టుకునే సంభాషణలు
రాంప్రసాద్ సినిమాటోగ్రఫీ

మైనెస్ పాయింట్స్
బలహీనమైన కథ
ఆకట్టుకోని కథనం
నిరాశ పరిచే క్లయిమాక్స్

ట్యాగ్ లైన్:   ఓన్లీ  ఆర్గానిక్.. నో హైబ్రీడ్