అగరబత్తుల తయారీపై కేంద్ర ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. అగరబత్తుల తయారీలో ఉపయోగించే కొన్ని హానికరమైన క్రిమిసంహారక రసాయనాలను పూర్తిగా నిషేధిస్తూ చర్యలు చేపట్టింది. వినియోగదారుల ఆరోగ్యం, భద్రతను దృష్టిలో ఉంచుకుని అగరబత్తుల తయారీకి సంబంధించిన కొత్త నాణ్యత ప్రమాణాలను విడుదల చేసింది.
అయితే..ఈ ప్రమాణాల ప్రకారం మానవ ఆరోగ్యానికి హాని కలిగించే రసాయనాల వినియోగాన్ని పూర్తిగా నిషేధించింది. దీని వల్ల ప్రజలకు సురక్షితమైన, నాణ్యమైన అగరబత్తులు అందుబాటులోకి రానుండగా, ఆరోగ్యపరమైన ప్రమాదాలు గణనీయంగా తగ్గే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. వినియోగదారుల భద్రత, పర్యావరణంపై పడే ప్రభావం, గాలి నాణ్యత, సువాసన ప్రమాణాలు, అలాగే రసాయనాలపై ఉన్న అంతర్జాతీయ ఆంక్షలను పరిగణనలోకి తీసుకుని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) ఐఎస్ 19412:2025 అనే కొత్త ప్రమాణాలను రూపొందించింది.
ఈ ప్రమాణాలకు అనుగుణంగా తయారైన అగరబత్తులపై బీఐఎస్ హాల్‌మార్క్ ఉండటం ద్వారా వినియోగదారులు నమ్మకమైన సమాచారంతో అగరబత్తులను కొనుగోలు చేయగలరని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. అంతేకాకుండా, అగరబత్తులు, ధూప సామగ్రి తయారీలో ఉపయోగించడానికి నిషేధించబడిన పదార్థాల జాబితాను కూడా ప్రభుత్వం విడుదల చేసింది.
అయితే, అలెత్రిన్, పెర్మెత్రిన్, సైపర్‌మెత్రిన్, డెల్టామెత్రిన్, ఫిప్రోనిల్ వంటి కొన్ని రసాయనాలను ఉపయోగించవచ్చని స్పష్టంచేసింది. అలాగే డైఫినైలమైన్, బెంజైల్ సైనైడ్, ఇథైల్ అక్రిలేట్ వంటి సింథటిక్ సుగంధాలను కూడా వినియోగించేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో గ్లోబల్ మార్కెట్‌లో మరింత డిమాండ్ పెరుగుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం దేశంలో అగరబత్తుల పరిశ్రమ సుమారు రూ. 8 వేల కోట్ల వ్యాపారాన్ని కొనసాగిస్తోంది.