థాయ్‌లాండ్-కంబోడియా మధ్య మరోసారి శాంతి ఒప్పందం జరిగింది. గత 20 రోజులుగా నెలకొన్న ఉద్రిక్తతలకు ఫుల్‌స్టాప్ పడింది. కాల్పుల విరమణకు అంగీకరిస్తున్నట్లు రెండు దేశాలు సంయుక్తంగా ప్రకటించాయి. ఆయుధాలు వాడకంపై తాత్కాలికంగా నిషేధం విధిస్తూ ఇరు దేశాల రక్షణమంత్రులు ప్రకటించారు. డిసెంబర్ 27 మధ్యాహ్నం 12 గంటల నుంచి కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి రానుంది.
ఇది కూడా చదవండి: Ukraine: ట్రంప్‌తో జెలెన్‌స్కీ భేటీకి ముందు కీవ్‌లో భారీ పేలుళ్లు.. మళ్లీ ఉత్కంఠ
థాయ్‌లాండ్-కంబోడియా మధ్య చాలా రోజులుగా సరిహద్దు వివాదం నడుస్తోంది. అయితే ట్రంప్ రంగంలోకి దిగి ఇరు దేశాలతో చర్చించి కాల్పుల విరమణ చేయించారు. రెండు దేశాల అధ్యక్షులు ట్రంప్ సమక్షంలో సంతకాలు కూడా చేశారు. కానీ ఇంతలో ఏమైందో.. ఏమో తెలియదు గానీ ఈనెల ప్రారంభంలో మరోసారి ఇరు దేశాలు దాడులకు దిగాయి. వైమానిక దాడులతో ఉద్రిక్తతలు చోటుచేసుకుంది. పలువురు ప్రాణాలు కోల్పోయారు. మొత్తానికి 20 రోజుల తర్వాత రెండు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి.
ఇది కూడా చదవండి: Silver Rates: సిల్వర్ సునామీ.. ఈరోజు భారీగా పెరిగిన వెండి ధర
ఇదిలా ఉంటే ఇటీవల కంబోడియా సరిహద్దులో ఉన్న విష్ణువు విగ్రహాన్ని థాయ్‌లాండ్ కూల్చేసింది. ఈ ఘటనపై భారతదేశం అభ్యంతరం వ్యక్తం చేసింది. హిందువుల మనోభావాలు దెబ్బతీశారంటూ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇటువంటి అగౌరవకరమైన చర్యలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనుచరుల మనోభావాలను దెబ్బతీస్తాయని.. ఇలా జరగకూడదని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు.
అయితే భారత్ అభ్యంతరంపై థాయ్‌లాండ్ స్పందించింది. భద్రత కోసమే విష్ణు విగ్రహాన్ని ధ్వంసం చేశామని.. అంతేతప్ప హిందూ మనోభావాలను దెబ్బతీయడానికి కాదని థాయ్‌లాండ్ స్పష్టం చేసింది. వివాదాస్పద సరిహద్దు ప్రాంతంలో కావాలనే కంబోడియా సైనికులు విగ్రహాన్ని నిర్మించారని.. ఆ ప్రాంతం తమదేనని అందుకోసమే భద్రతా ప్రమాణాలను దృష్టిలో పెట్టుకుని కూల్చేసినట్లుగా వెల్లడించింది. వాస్తవంగా ఆ ప్రాంతం మతపరమైన ప్రాంతం కూడా కాదని.. ఉద్దేశపూర్వకంగా కంబోడియా సైనికులు నిర్మించారని పేర్కొంది. తాజాగా రెండు దేశాలు శాంతి ఒప్పందం చేసుకోవడం పరిస్థితులు చల్లబడ్డాయి.