వైజాగ్ నేపథ్యంలో సాగే కథలతో తెలుగు సినిమాలకు ఎప్పుడూ ఒక ప్రత్యేక అనుబంధం ఉంటుంది, అదే కోవలో సస్పెన్స్, ఎమోషన్ సహా సోషల్ మెసేజ్ అంశాలతో రూపొందిన చిత్రమే ‘వన్ బై ఫోర్’. బాహుబలి పళని కె దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో పరిశీలిద్దాం.
కథా నేపథ్యం
కిరణ్ (వెంకటేష్) చదువు పూర్తి చేసుకుని, ఉద్యోగంలో చేరడానికి వైజాగ్‌లో సరదాగా గడుపుతుంటాడు. అదే కాలనీలో పవిత్ర (హీనా సోనీ) తన పిల్లలతో కలిసి నివసిస్తుంటుంది. ఆమె భర్త దుబాయ్‌లో ఉంటారు. పవిత్ర తన కాలేజీ స్నేహితుడైన ఒక ప్రొఫెసర్‌ని అప్పుడప్పుడు కలుస్తుంటుంది. అయితే కిరణ్ స్నేహితులుగా నటించే ఒక బైక్ మెకానిక్ (టెంపర్ వంశీ) అతని ముగ్గురు స్నేహితులు కలిసి పవిత్ర స్నేహాన్ని అడ్డుపెట్టుకుని ఆమెను బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభిస్తారు. డబ్బు కోసం వారు చేసే ఈ తప్పుడు పనులు చివరకు పవిత్ర జీవితాన్ని అతలాకుతలం చేస్తాయి. తనను నమ్మిన వారిని మోసం చేసిన ఆ నలుగురిపై కిరణ్ ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? పవిత్రకు న్యాయం జరిగిందా? అనేదే ఈ చిత్ర కథ.
విశ్లేషణ
ఈ సినిమా మొదటి సగభాగం పాత్రల పరిచయానికే ఎక్కువ సమయం తీసుకుంది. హీరో లవ్ స్టోరీ కాస్త సాగదీసినట్లు అనిపించినా, కథ ఎప్పుడైతే పవిత్ర పాత్ర చుట్టూ తిరుగుతుందో అప్పటి నుండి వేగం పుంజుకుంటుంది. ఇంటర్వెల్ ముందు వచ్చే సీన్స్ సినిమాపై ఆసక్తిని పెంచుతాయి. సెకండాఫ్‌లో ఎమోషన్స్‌ను దర్శకుడు బాగా డీల్ చేశారు. పాత కథే అయినప్పటికీ, స్క్రీన్‌ప్లేలో కొన్ని ట్విస్టులను జోడించడం వల్ల రివెంజ్ డ్రామా ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్‌లో ఇచ్చిన సందేశం బాగుంది. సాధారణంగా రివెంజ్ డ్రామాలు అనగానే కేవలం రక్తపాతం, యాక్షన్ సీన్లు మాత్రమే గుర్తుకు వస్తాయి. కానీ ‘వన్ బై ఫోర్’ సినిమా ఆ మూస పద్ధతిని కాస్త పక్కన పెట్టి, ఒక సున్నితమైన సామాజిక సమస్యను భావోద్వేగాలతో ముడిపెట్టి ఆవిష్కరించే ప్రయత్నం చేసింది. ఈ సినిమా ప్రధానంగా “డబ్బు కోసం ఎంతకైనా తెగించే స్వభావం” అలానే “మహిళల పట్ల సమాజం చూపే వివక్ష” అనే రెండు అంశాల మీద నడుస్తుంది. హీరో కిరణ్ తన చుట్టూ ఉన్న వారు తనను ప్రేమిస్తున్నారని నమ్ముతాడు. కానీ, అదే స్నేహం ముసుగులో వారు చేసే ఘోరాలు అతని కళ్లు తెరిపిస్తాయి. భర్త ఊర్లో లేని మహిళను సమాజం లేదా స్వార్థపరులు ఏ విధంగా టార్గెట్ చేస్తారు? చిన్న తప్పును పట్టుకుని వారిని ఎలా మానసికంగా, శారీరకంగా హింసిస్తారు? అనే అంశాన్ని దర్శకుడు చాలా ధైర్యంగా చూపించారు. పవిత్ర పాత్ర ఎదుర్కొనే సంఘర్షణ ప్రతి ప్రేక్షకుడిని ఆలోచింపజేస్తుంది.
నటీనటుల పనితీరు
కన్నడ నటుడు వెంకటేష్ తెలుగులో కిరణ్ పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. యాక్షన్ అలానే ఎమోషన్ సీన్లలో ప్రతిభ కనబరిచాడు. పవిత్రగా నటించిన హీనా సోనీ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. కష్టాల్లో ఉన్న మహిళగా ఆమె నటన సహజంగా ఉంది. విలన్ పాత్రలో టెంపర్ వంశీ తనదైన శైలిలో మెప్పించాడు. మిగిలిన నటీనటులు తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు.
సాంకేతిక విభాగం
దర్శకుడు పళని పాత కథనే కొత్తగా చూపించాలని చేసిన ప్రయత్నం అభినందనీయం. సినిమాటోగ్రఫీ విజువల్స్ వైజాగ్ అందాలను బాగా చూపించాయి. ఎడిటింగ్ విషయంలో మరికొంత జాగ్రత్త తీసుకుని ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. సినిమా మొదటి అర్ధభాగంలో కాస్త నెమ్మదిగా సాగినా, రెండో సగభాగంలో వచ్చే ‘మైండ్ గేమ్స్’, ‘ప్రతీకార వ్యూహాలు’ ఆసక్తిని కలిగిస్తాయి. పాత కథను కొత్త స్క్రీన్‌ప్లేతో చెప్పాలనే దర్శకుడి తాపత్రయం కొన్ని చోట్ల బాగా ఫలించింది. నేపథ్య సంగీతం కథలోని తీవ్రతను పెంచింది. అయితే, కొన్ని నిశ్శబ్దంగా ఉండాల్సిన సీన్లలో కూడా హెవీ మ్యూజిక్ ఇవ్వడం కాస్త ఇబ్బందికరంగా అనిపించవచ్చు.
ఫైనల్లీ ‘వన్ బై ఫోర్’ ఒక మెసేజ్ ఇచ్చే సస్పెన్స్ రివెంజ్ డ్రామా.