Neethone Nenu Movie Review: బజ్జీల పాపగా సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న కుషిత కళ్లపు హీరోయిన్ గా లాంచ్ అయిన మూవీ నీతోనే నేను..సినిమా బండి సినిమాలో హీరోగా నటించిన వికాస్ వశిష్ట ఈ సినిమాలో హీరోగా నటించారు. ఉపాధ్యాయుల గురించి తెరకెక్కించిన ఈ సినిమా టీజర్, ట్రైలర్ ఆసక్తి రేకెత్తించాయి.. మరి ఈ సినిమా ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఎంత వరకు ప్రేక్షకులను మెప్పించింది అనే విషయాలు సినిమా రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటంటే: రామ్(వికాష్ వశిష్ట) ఓ గవర్నమెంట్ స్కూల్ టీచర్. మెదక్ జిల్లా లక్ష్మాపూర్ ప్రభుత్వ పాఠశాలకు ట్రాన్స్ఫర్ అయి రాగా అదే రోజు స్పోర్ట్స్ టీచర్‌గా ఆయేషా(కుషిత)కూడా అదే స్కూల్లో జాయిన్ అవుతుంది. పేద పిల్లలను వృద్ధిలోకి తీసుకు రావాలని ఇద్దరూ అనుకుని ఆ స్కూల్లో చదివే పిల్లలకు అన్ని విషయాల్లో అండగా ఉంటారు. రామ్ ను ప్రేమించిన ఆయేషా తన ప్రేమ విషయాన్ని రామ్‌తో చెబితే అతను రిజెక్ట్ చేసి తనకు అల్రేడీ సీత అనే అమ్మాయితో పెళ్లి అయిందని చెబుతాడు. అసలు ఈ సీత ఎవరు? రామ్, సీతల ప్రేమకథ ఏంటి? అసలు సీతకు ఏమైంది? సీతకు, ఆయేషాకు మధ్య ఉన్న రిలేషన్ ఏంటి? ప్రేమించిన రామ్ కోసం అయేషా ఏం చేసింది? ఆయేషా ప్రేమ కథ సుఖాంతం అయిందా? లేదా? అనేది తెలియాలంటే ‘నీతోనే నేను’ సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే: మాతృదేవోభవ, పితృదేవోభవ ఆచార్యదేవోభవ అని అమ్మ నాన్న తర్వాత అలాంటి స్థానాన్ని గురువుకే ఇచ్చారు. అయితే ఎందుకో కానీ గురువు గొప్పతనం తెలియచేసేలా సినిమాలు మాత్రం అడపాదడపా మాత్రమే వస్తుంటాయి. ఈ మధ్య వచ్చిన ధనుష్`సార్`పెద్ద హిట్ గా నిలవగా అదే కోవలో గురువు గొప్పతనం చెప్పే కథతో నీతోనే నేను అనే సినిమా తెరకెక్కింది. సినిమా మొదట్లోనే హీరో రామ్ పేద విద్యార్థులకు సహాయం చేయడం, స్కూల్ బాగుకోసం పాటుపడటం లాంటివి ఆసక్తికరంగా ఉన్నాయి. ఇక ప్రభుత్వ స్కూల్లో ఉండే సమస్యలను, టాయిలెట్లు లేకపోవడం వల్ల ఆడపిల్లలు టాయిలెట్ వస్తుందని చెప్పి వాటర్ తాగక కిడ్నీ వ్యాధులతో ఇబ్బందులు పడుతున్న విషయాలు కళ్ళకి కట్టినట్టు చూపించారు. లేని భార్యని ఊహించుకుని హీరో మానసికంగా బాధపడడం అతని బాధ ఆద్యంతం ఎమోషనల్ అనిపించింది. ఇక హీరో గతం తెలిసి అతన్ని ప్రేమించిన ఆయేషా తీసుకున్న నిర్ణయం సినిమా మొత్తానికి అతి పెద్ద ట్విస్ట్. అయితే ఒకానొక దశలో సినిమాలో సీన్లు రొటీన్‌గా చాలా సార్లు చూసిన ఫీలింగ్ కలుగుతుంది. సినిమా స్లో నెరేషన్ కూడా కాస్త ఇబ్బంది పెట్టే అంశమే ఇక ఇలా ప్రభుత్వ స్కూల్ బ్యాక్ డ్రాప్లో అక్కడి సమస్యలను ఎత్తిచూపే ఇలాంటి సినిమా చేయడం సాహసమే. కమర్షియల్ యాంగిల్ లో థ్రిల్లింగ్ అంశాలను జోడిస్తూ ఒక సందేశాత్మక చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు అంజిరామ్. డైరెక్టర్ ఎంచుకున్న పాయింట్ బాగున్నప్పటికీ దానికోసం రాసుకున్న డ్రామా రొటీన్‌గా ఉంది. కమర్షియల్ అంశాలు పక్కన పెడితే ఓ మంచి సందేశాత్మక చిత్రం ఈ నీతోనే నేను.
ముందుగా నటీనటుల విషయానికి వస్తే స్కూల్ టీచర్ రాము పాత్రలో వికాస్ వసిష్ట ఒదిగిపోయాడు. బాధ్యత గల టీచర్‌గా, భార్య కోసం పరితపించే భర్తగా భిన్న కోణాలు ఉన్న పాత్రలో ఆకట్టుకున్నాడు. ఇక పీటీ టీచర్ ఆయేషాగా కుషిత తన పాత్ర పరిధిమేరకు నటించింది కానీ ఆమెకు ఇంకాస్త స్కోప్ ఉన్న పాత్ర దొరికితే బాగుండేది. హీరో భార్య సీతగా నటించిన మోక్ష కూడా ఆకట్టుకుంది. ఇక సినిమాలోని మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేత అంశాల విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ బాగుంది. సంగీతం ఫర్వాలేదు అనిపించింది. అయితే సాంగ్స్ ప్లేసెమెంట్స్ విషయంలో కూడా కేర్ తీసుకుంటే బాగుండేది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి.
‘నీతోనే నేను’ కమర్షియల్ అంశాలతో కూడిన మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ.