చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేసే నవీన్ పొలిశెట్టి, యాక్సిడెంట్ కారణంగా చాలా గ్యాప్ తీసుకున్నాడు. సుదీర్ఘమైన గ్యాప్ తర్వాత ‘అనగనగా ఒక రాజు’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచే సినిమా మీద అంచనాలు ఉన్నాయి. దానికి తోడు ప్రమోషనల్ కంటెంట్ కూడా వర్కవుట్ కావడంతో, సినిమా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందని అందరూ భావించారు. దీనికి తోడు నిర్మాత నాగవంశీ సినిమాని నెక్స్ట్ లెవల్‌లో ప్రమోట్ చేశారు. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి మొదట దర్శకులు వేరైనా, సినిమా పూర్తి చేసింది మాత్రం మారి. యుఎస్ లో సినిమాకి కొంత పాజిటివ్ టాక్ రావడంతో సినిమా మీద మరింత అంచనాలు పెరిగాయి. అయితే సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.
అనగనగా ఒక రాజు కథ
జమీందారీ వంశానికి చెందిన రాజు (నవీన్ పొలిశెట్టి) కి రిచ్ గా బతకాలని కోరిక. ఆస్తులన్నీ తాత కరగబెట్టడంతో, లేని దర్పాన్ని ప్రదర్శిస్తూ కాలం వెళ్లదీస్తూ ఉంటాడు. తన బంధువుల్లో ఒకతను ఆస్తులున్న అమ్మాయిని పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వడంతో, తాను కూడా అలాగే పెళ్లి చేసుకోవాలని భావిస్తాడు. పక్క ఊరికి చెందిన చారులత (మీనాక్షి చౌదరి) అయితే తనకు కరెక్ట్ గా సెట్ అవుతుందని భావించి, ఆమెను ప్రేమలో పడేలా చేస్తాడు. కోట్లాది రూపాయల ఆస్తులున్న చారులతను పెళ్లి చేసుకున్న మొదటి రాత్రే రాజుకి ఒక షాకింగ్ విషయం తెలుస్తుంది. అసలు ఆస్తులున్న ఆమెను చేసుకున్నాక తెలిసిన షాకింగ్ విషయం ఏమిటి? అసలు చారులత రాజుని ఎందుకు ప్రేమించింది? చివరికి రాజు ఏం చేశాడు? వీరిద్దరూ చివరి వరకు కలిసి ఉన్నారా లేదా? మధ్యలో ఎర్రి బాబు (తారక్ పొన్నప్ప) పాత్ర ఏమిటి? లాంటి విషయాలు తెలియాలంటే ఈ సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
విశ్లేషణ
నవీన్ పొలిశెట్టి హీరోగా ఒక సినిమా చేస్తున్నాడంటే, ఖచ్చితంగా ప్రేక్షకులకు ఆ సినిమా మీద అంచనాలు ఉంటాయి. ఎందుకంటే గతంలో అతను ఎంచుకున్న సినిమాలు అలాంటివి. ఖచ్చితంగా విలక్షణంగా ఉన్న సినిమాలను మాత్రమే ఎంచుకుంటూ ప్రేక్షకులలో మంచి గుర్తింపు సంపాదించాడు నవీన్. ఈ సినిమా కూడా దాదాపుగా అలాంటిదే అని అందరూ అనుకున్నారు, కానీ వారి అంచనాలను తలకిందులు చేస్తూ ఒక రొటీన్ సినిమాతో ఈసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నవీన్ పొలిశెట్టి.
నిజానికి కథగా చెప్పుకోవాలంటే ఇందులో పెద్దగా కథేమీ లేదు. ఒక డబ్బున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్న, ఆస్తులు పోగొట్టుకున్న జమీందారీ కుటుంబానికి చెందిన కుర్రాడు అక్కడ మోసపోయి, చివరికి ఎలా బుద్ధి తెచ్చుకున్నాడు అనే లైన్ తో సినిమా రాసుకున్నారు. నిజానికి ఇలాంటి లైన్ తో గతంలో కొన్ని సినిమాలు వచ్చాయి. కామెడీ పరంగా ఇవి వర్కవుట్ అయ్యాయి కూడా. కానీ ఈ సినిమా ఎందుకో కామెడీ విషయంలో పూర్తిస్థాయిలో సఫలం కాలేకపోయింది.
ఫస్టాఫ్ అంతా హీరో క్యారెక్టరైజేషన్ పరిచయం, హీరో హీరోయిన్ల ప్రేమ, పెళ్లి అంటూ ఆసక్తికరంగా సాగుతుంది. ఇక ఇంటర్వెల్ ముందు ఒక ఆసక్తికరమైన ట్విస్ట్ తో సెకండాఫ్ మీద అంచనాలు పెంచారు. సెకండాఫ్ ఆసక్తికరంగానే సాగింది. పొలిటికల్ యాంగిల్ ఒకటి యాడ్ కావడంతో ఒక పొలిటికల్ సెటైర్ లాగా సినిమా సాగిపోయింది. ఫస్టాఫ్ తో పోలిస్తే సెకండాఫ్ ఎంటర్టైనింగ్ గా ఉంది. చివర్లో ఎప్పటిలాగే ఒక మెసేజ్ ఇచ్చి సినిమాని క్లోజ్ చేశారు. అయితే ఓవరాల్ గా చూస్తే కామెడీ కొన్ని చోట్ల వర్కవుట్ అయింది, కొన్ని చోట్ల వర్కవుట్ కాలేదు. ఒక రకంగా చెప్పాలంటే పూర్తిస్థాయిలో నవ్వించడంలో సినిమా టీం సక్సెస్ కాలేదని చెప్పాలి. కానీ నవ్వించిన కొన్ని చోట్ల మాత్రం కామెడీ బాగా వర్కవుట్ అయింది.
నటీనటుల ప్రతిభ
నటీనటుల విషయానికి వస్తే, నవీన్ పొలిశెట్టికి ఇలాంటి పాత్రలు కొత్తేమీ కాదు, కొట్టిన పిండి. ఈ రాజు అనే పాత్రలో నవీన్ పొలిశెట్టి ఇమిడిపోయాడు, ఒకరకంగా అదరగొట్టాడు. మీనాక్షి చౌదరి కూడా అమాయకమైన పాత్రలో ఆకట్టుకుంది. ఆమె పాత్రకు పూర్తి న్యాయం చేసిందని చెప్పాలి. చమ్మక్ చంద్ర, జబర్దస్త్ మహేష్ వంటి వాళ్ళు తమ పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతిక విభాగం
టెక్నికల్ టీం విషయానికి వస్తే, ఈ సినిమాలో సినిమాటోగ్రఫీ బాగుంది. ఆ ఫ్రేమ్ వర్క్స్ అన్ని బాగా వర్కవుట్ అయ్యాయి. నిడివి విషయంలో ఇంకా కేర్ తీసుకుని ఉంటే బాగుండేది. సంగీతం బాగుంది, నేపథ్య సంగీతం సైతం సినిమాకి తగ్గట్టుగా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
ఓవరాల్ గా చెప్పాలంటే, ‘అనగనగా ఒక రాజు’ అక్కడక్కడ నవ్విస్తాడు.