దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒకప్పుడు స్నేహితులన్న సంగతి దాదాపు అందరికీ తెలుసు. వీరిద్దరూ కాంగ్రెస్‌లో ఒకే సమయంలో మంత్రులుగా కూడా పనిచేశారు. వీరిద్దరి స్నేహాన్ని ఆధారంగా చేసుకుని దేవా కట్టా మయసభ అనే సిరీస్ రూపొందించారు. అయితే, లీగల్ ఇష్యూస్ తలనొప్పులు ఎందుకనుకున్నారో ఏమో, పూర్తిగా వారి పేర్లను మార్చేయడమే కాదు, సిరీస్ మొత్తం ఒక కల్పిత కథలాగా రాసుకున్నారు. ట్రైలర్ చూస్తేనే దాదాపు విషయం అందరికీ అర్థమైపోతుంది. సోనీ లివ్‌లో ఈ సిరీస్ ఒక రోజు ముందు నుంచే స్ట్రీమింగ్ మొదలు పెట్టేశారు. మరి సిరీస్ ఎలా ఉంది, ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.
కథ: చిత్తూరు ప్రాంతానికి చెందిన కాకర్ల కృష్ణమ నాయుడు (ఆది పినిశెట్టి) కాలేజీలో చదువుకుంటూనే సామాజిక సేవ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ఉంటాడు. ప్రజలకు ఏదైనా చేయాలనే ఉద్దేశంతో తండ్రి వ్యవసాయ పనులు చూసుకోమని చెప్పినా, చదువుకునేందుకే ఆయన ఆసక్తి కనబరుస్తాడు. మరోపక్క, తండ్రి బాంబుల శివారెడ్డి ఫ్యాక్షన్ గొడవలు చేస్తూ ఉన్నా వైద్యం చేసి ఎంతో మందికి సహాయపడాలనే మనసు గల ఎమ్మెస్ రామిరెడ్డి (చైతన్య రావు) కర్ణాటకలో డాక్టర్ కోర్సు చదువుతూ, చేతనైనంతలో సాయం చేస్తూ ఉంటాడు. తాను ప్రేమించిన అనుహారిక (తాన్య రవిచంద్రన్) హీరోయిన్ అవ్వాలనే ఉద్దేశంతో వెళ్లిపోవడంతో ప్రేమలో విఫలమైనట్లl బాధపడుతున్న కాకర్ల కృష్ణమ నాయుడుకు భార్య వైష్ణవి (భావన)ను పుట్టింటి నుంచి ఇంటికి తీసుకువెళుతూ ఉండే రామిరెడ్డి పరిచయమవుతాడు. వీరి పరిచయం రాజకీయ అరంగ్రేటానికి దోహదపడుతుంది. అలా స్నేహితులైన వీరు ప్రధానమంత్రి ఐరావతి బసు (దివ్య దత్త) పార్టీలో చేరి ఎమ్మెల్యేలుగా గెలవాలనుకుంటారు. నాటకీయ పరిణామాలలో ఇద్దరూ ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా కూడా మారతారు. తెలుగులో టాప్ హీరో ఆర్సిఆర్ (సాయికుమార్) కుమార్తెను వివాహం చేసుకున్న కృష్ణమ నాయుడు, ఆర్సిఆర్ పార్టీకి వ్యతిరేకంగా పోరాడాల్సి వస్తుంది. ఈ క్రమంలో తర్వాత ఏం జరిగింది? స్నేహితులుగా ఉన్న రామిరెడ్డి, కృష్ణమ నాయుడు ఎందుకు విడిపోవలసి వచ్చింది? చివరికి వారు కలిసారా లేదా అనే విషయాలు తెలియాలంటే సిరీస్‌ను బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
విశ్లేషణ: మయసభ అనే పేరు వినగానే అందరికీ మహాభారతంలో ఉన్న ఒక మాయసభ గుర్తొస్తుంది. దాదాపు దానికి ఏమాత్రం తక్కువ కాకుండా ఈ సిరీస్‌ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు దేవా కట్టా. గతంలో ప్రస్థానం, రిపబ్లిక్ లాంటి పొలిటికల్ సెటైర్ సినిమాలు చేసిన అనుభవం ఉన్న ఆయన, అసలు ఇలాంటి ఒక సిరీస్ చేస్తున్నాడనే విషయం తెలిసిన వెంటనే అందరిలో ఆసక్తి నెలకొంది. ఎందుకంటే, తెలుగు రాష్ట్రాలలో వైఎస్ కుటుంబం, చంద్రబాబు కుటుంబం దాదాపు 30 ఏళ్లుగా సీఎం సీటును పంచుకుంటూ వస్తున్నాయి. మధ్యలో కిరణ్ కుమార్ రెడ్డి, రోశయ్య లాంటి వాళ్లు కొంతకాలం పరిపాలించినా, అవి పెద్దగా లెక్కలోకి రావు. అయితే, ఈ మయసభ చూస్తే పాత్రలు పక్కాగా వైఎస్, చంద్రబాబును అని అర్థమవుతుంది, కానీ కథ మాత్రం వారిది కాదు. వారి కథ కొంత, ఎక్కువగా కల్పిత కథనే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు దేవా కట్టా. లీగల్‌గా ఎక్కడ దొరకకుండా జాగ్రత్తగా పాత్రల పేర్లు, సన్నివేశాలు రాసుకున్నారు. చెప్పాలనుకున్నదాన్ని మాత్రం సూటిగా, సినిమాకి తీసుపోని విధంగా చిత్రించాడు. నిజానికి సిరీస్‌లోని ఓపెనింగ్ సీన్‌తోనే ఇది పూర్తిగా కల్పిత కథ. పాత్రలు వారిని ఇన్స్పైర్ చేసుకుని రాసుకుని ఉండవచ్చు, కానీ పూర్తిగా కల్పిత కథ అనే విషయం అర్థమైపోతుంది. వైస్రాయ్ హోటల్ ఘటనను జ్ఞాపకం తెచ్చేలా ఆశ్రమం హోటల్ అనే ప్రస్తావనతో మొదలైన ఈ సిరీస్, తరువాత కాకర్ల కృష్ణమ నాయుడు, ఎమ్మెస్ రామిరెడ్డి పాత్రల పరిచయం, వారి స్వభావాన్ని అర్థమయ్యేలా చెప్పడం కోసం కొన్ని ఎపిసోడ్‌లు వాడుకున్నారు. ఆ తరువాత వారి పరిచయం నుంచి సిరీస్‌లో వేగం పెరుగుతుంది. 9 ఎపిసోడ్‌ల ఈ సిరీస్ ఏమాత్రం బోర్ కొట్టించకుండా బింగే వాచ్ చేయగలిగేలా ఉందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మన రాజకీయాల గురించి కాస్త కూసో అవగాహన ఉన్న వాళ్లకు ఈ సిరీస్ బాగా కనెక్ట్ అవుతుంది. ఇది పూర్తిగా కల్పిత కథ, పాత్రలను ఆధారంగా చేసుకుని ప్రేక్షకులను ఎంగేజ్ చేసేలా సినిమాటిక్ టచ్ ఇస్తూ సిరీస్ మొత్తం పూర్తి చేశారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ సిరీస్ మొదటి సీజన్‌తోనే పూర్తికాలేదు. సెకండ్ సీజన్ కోసం వేచి చూడమని సిరీస్ చివరిలో క్లారిటీ ఇచ్చేశారు. ఈ మొదటి సిరీస్ రైస్ ఆఫ్ టైటాన్స్ అయితే, సెకండ్ సిరీస్ మాత్రం క్లాష్ ఆఫ్ టైటాన్స్ అని టైటిల్ ఇచ్చారు. అంటే, ఈ మొదటి సిరీస్‌లో ఇద్దరి ఎదుగుదల చూపించారు, తర్వాత ఇద్దరి మధ్య వచ్చే విరోధాన్ని చూపించబోతున్నారన్నమాట. అయితే, అటు వైఎస్ అభిమానులను కానీ, ఇటు చంద్రబాబు అభిమానులను కానీ సంతృప్తి పరచాలనే ఉద్దేశం సిరీస్‌లో ఎక్కడా కనిపించలేదు. చాలా న్యూట్రల్‌గా వెళ్లడంలో అక్కడే దేవా కట్టా కొంత విజయాన్ని సాధించాడనిపిస్తుంది.
నటీనటుల విషయానికి వస్తే, కాకర్ల కృష్ణమ నాయుడు అనే పాత్రలో ఆది పినిశెట్టి ఇమిడిపోయాడు. చంద్రబాబు నాయుడుని గుర్తు చేస్తూ ఉండే ఈ పాత్రను చాలా బాగా డిజైన్ చేసుకోవడమే కాదు, ఆది పినిశెట్టి చేత అంతే అద్భుతంగా పెర్ఫార్మ్ చేయించారు. ఎమ్మెస్ రామిరెడ్డి అనే పాత్రలో చైతన్య రావు కూడా ఆకట్టుకున్నాడు. నిజానికి వ్యక్తిగతంగా ఈ సిరీస్ అనౌన్స్ చేసినప్పుడు చైతన్య రావు వైఎస్ పాత్రలో సూట్ కాడేమో అనిపించింది, కానీ నటన విషయంలో మాత్రం ఎలాంటి కంప్లైంట్స్ లేవు. ఇక స్టార్ హీరోగా సాయికుమార్ అదరగొట్టాడు. పరిటాల రవి పాత్రలో రవీంద్ర విజయ్‌కి ఇంకా నటించే స్కోప్ ఈ సిరీస్ మొదటి సీజన్‌లో దక్కలేదు. వంగవీటి రంగాను పోలి ఉండే పాత్రలో శత్రు ఆకట్టుకున్నాడు. అయితే బాంబుల శివారెడ్డి అనే పాత్ర చేసిన నటుడు మాత్రం అదిరిపోయే పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. కాస్టింగ్ మాత్రం సినిమాకి ఒక ప్లస్ పాయింట్. కేసీఆర్‌ను పోలి ఉండే పాత్ర కోసం అలాంటి లక్షణాలతోనే ఉన్న వ్యక్తిని పట్టుకొచ్చారంటే, కాస్టింగ్ కోసం ఎంత శ్రద్ధ పెట్టారో ఈజీగా అర్థమవుతుంది. ఇక ఈ సిరీస్ టెక్నికల్‌గా చాలా టాప్-నాచ్ క్వాలిటీతో ఉంది. ఒక సినిమాకి ఎంత ఖర్చు పెట్టారో, ఈ సిరీస్‌కి అంత ఖర్చు పెట్టినట్లు అర్థమవుతుంది. విజువల్స్ కానీ, ఏఐ వాడకం కానీ బావుంది. సిరీస్‌లో పాటలు లేవు, కానీ సహోదర అంటూ వచ్చే ట్రాక్ మాత్రం చాలా కాలం గుర్తుండిపోయేలా ఉంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బావుంది. సినిమాటోగ్రఫీ అయితే సినిమాకి చాలా ప్లస్ పాయింట్. సిరీస్ కాబట్టి నిడివి విషయంలో లిబర్టీ తీసుకున్నారు, అయితే అది వర్క్ అనిపించింది.
ఫైనల్లీ, ఈ మయసభ.. కల్పిత పాత్రలతో మాయ చేసే సభ.. ఆసక్తికరమైన కథ, కథనం.. మంచి మేకింగ్‌తో ఆకట్టుకుంటుంది.