విజయ్ ఆంటోనీ హీరోగా తెలుగులో కూడా ఎన్నో సినిమాలు వచ్చాయి. దాదాపుగా ఆయన చేస్తున్న అన్ని తమిళ సినిమాలను తెలుగులో కూడా డబ్బింగ్ చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు మార్గన్ అనే సినిమాని ఆయన తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. విజయ్ ఆంటోనీ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాతో ఆయన తన మేనల్లుడు అయిన అజయ్ దిశన్‌ను సినీ పరిశ్రమకు పరిచయం చేస్తున్నాడు. ఇక ఈ సినిమాలో బ్రిగేడా, ప్రీతిక, దీక్షిక వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటించారు. లియో జాన్ పాల్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని విజయ్ ఆంటోనీ ఫిలిం కార్పొరేషన్ ద్వారా విజయ్ ఆంటోనీ స్వయంగా నిర్మించడం గమనార్హం.
కథ:
హైదరాబాద్ సిటీలో ఒక అమ్మాయి మర్డర్ అయ్యి చెత్తకుప్పలో శవమై కనిపిస్తుంది. ఆ అమ్మాయి శరీరమంతా నల్లటి రంగు ఉండడంతో, గతంలో ఇలాంటి ఒక కేసు డీల్ చేసిన ధ్రువ (విజయ్ ఆంటోనీ)ని ముంబై నుంచి హైదరాబాద్ రప్పిస్తారు. ఇక కేసు హ్యాండ్ ఓవర్ చేసుకుని పని మొదలుపెట్టిన ధ్రువ, ఈ కేసుతో సంబంధం ఉన్న అరవింద్(దిషన్ ) అనే ఒక స్విమ్మర్‌ను అదుపులోకి తీసుకుంటాడు. అరవింద్‌ని అదుపులోకి తీసుకున్న తర్వాత అతడికి కొన్ని షాకింగ్ విషయాలు తెలుస్తాయి. అరవింద్ సహాయంతో విజయ్ ఆంటోనీ పని మొదలు పెడతాడు. మరి ఈ క్రమంలో అసలు ఈ కిల్లర్ ఎవరో కనుక్కున్నారా? ఎందుకు చంపేసిన వారి శరీరాలు నల్లరంగులు మారిపోతున్నాయి? లాంటి విషయాలు తెలియాలంటే సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
విశ్లేషణ:
ఈ సినిమా ఒక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. అయితే దానికి కొన్ని సూపర్ నేచురల్ పవర్స్ ఉన్న కుర్రాడి కథతో లింక్ చేశారు. సినిమా ఫస్ట్ ఫ్రేమ్ నుంచి చెప్పాలనుకున్న విషయాన్ని సిన్సియర్‌గా చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు. అయితే ఒకపక్క ఇన్వెస్టిగేషన్ ఆసక్తికరంగా నడిపిస్తూనే మరొక పక్క తాళపత్ర గ్రంథాలు, గగన మార్గన్ అంటూ కొన్ని పూర్వీకుల పద్ధతులు చూపించే ప్రయత్నం చేశారు. అయితే అది పూర్తిస్థాయిలో ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌లో ఇమడ లేదు. సినిమా స్టార్టింగ్‌లో అసలు ఏం జరగబోతోంది, తర్వాత ఎవరు ఈ హత్యలు చేస్తున్నారు అనే విషయాల మీద ఆసక్తికరమైన కథను నడిపించారు. కానీ ఒకానొక దశకు వచ్చాక ట్విస్టులు కూడా ఊహించినట్టుగానే ఉంటాయి. ఇక అన్ని సినిమాల్లో లాగా కాకుండా ఈ సినిమా క్లైమాక్స్‌లోనే అసలు కిల్లర్ ఎవరు అనే విషయాన్ని డైరెక్టర్ రివీల్ చేశాడు. అది ప్రేక్షకులు కాస్త ఊహకు దూరంగానే ఉన్నా, ఎందుకో అది కాస్త బలవంతంగా చొప్పించిన ఫీలింగ్ కలిగించింది. అయితే సాధారణ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌లాగా ముగించకుండా ఈ సినిమాని సూపర్ నాచురల్ ఎలిమెంట్స్‌తో నింపడం కాస్త ఆసక్తికరమైన అంశం.
నటీనటుల విషయానికి వస్తే, విజయ్ ఆంటోని పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాడు. ముఖానికి సగం నల్ల రంగుతో కాస్త కొత్త పాత్రలో కనిపించాడు. విజయ్ మేనల్లుడు అజయ్ మొదటి సినిమానైనా ఎంతో అనుభవం ఉన్న వ్యక్తిలా కనిపించాడు. ఇక సముద్రఖని అతిథి పాత్రలా వచ్చి కనిపించాడు. బ్రీడా సాగా పోలీస్ ఆఫీసర్‌గా ఆకట్టుకుంది. దీక్షిక, మహంతి శంకర్, వినోద్ వంటి వారు తమ పాత్రలలో ఆకట్టుకునేలా నటించారు. ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే, ఈ సినిమా దర్శకుడికి ఇది మొదటి సినిమా అయినా తనదైన శైలిలో నడిపించే ప్రయత్నం చేశాడు. ఇక విజయ్ అంటోని తాను అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో కొన్ని సీన్స్ ఎలివేట్ చేయడమే కాక, తర్వాత ఏం జరగబోతోంది అనే విషయాన్ని కూడా ప్రేక్షకులు థియేటర్‌లకు అతుక్కునేలా చేయడంలో సక్సెస్ అయ్యాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ కూడా బాగుంది. సినిమాకి సంబంధించి నిడివి విషయంలో ఎడిటింగ్ టేబుల్ మీద బాగానే కష్టపడినట్టు అనిపించింది.
ఫైనల్‌గా ఈ మార్గన్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ విత్ సూపర్ నాచురల్ ఎలిమెంట్స్.