Like Share And Subscribe Review:యంగ్ హీరో సంతోష్ శోభన్ నటించిన ‘ఏక్ మినీ కథ’ చిత్రానికి దర్శకుడు మేర్లపాక గాంధీ స్టోరీ, స్క్రీన్ ప్లే అందించాడు. ఇప్పుడు ఆయనే దర్శకత్వం వహిస్తూ సంతోష్ శోభన్ తో ‘లైక్ ,షేర్ అండ్ సబ్ స్క్రైబ్’ మూవీని తెరకెక్కించాడు. వెంకట్ బోయనపల్లి ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమాకి నిహారిక కొణిదెల నిర్మాణ భాగస్వామి. ‘జాతిరత్నాలు’ తర్వాత ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటించిన ఈ మూవీ శుక్రవారం జనం ముందుకొచ్చింది. మరి ఇది జనం ‘లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్’ చేసేలా ఉందో లేదో చూద్దాం.
విప్లవ్ (సంతోష్ శోభన్) ఓ ట్రావెల్ బ్లాగర్. ఢిల్లీలో ఉండే వసుధ (ఫరియా అబ్దుల్లా) ఇన్ స్పిరేషన్ తో అతను ‘గువ్వ విహారి’ అనే యూట్యూబ్ ఛానెల్ ప్రారంభిస్తాడు. తన ఛానెల్ కు వ్యూవర్స్ ను పెంచుకోవడం కోసం కెమెరామేన్ జాక్ డేనియల్ (నెల్లూరు సుదర్శన్)ను తీసుకుని అరకు వెళతాడు. అక్కడ ఊహించని విధంగా వసుధ ఎదురవుతుంది. ఆమెతో కలిసి జీవితాన్ని పంచుకోవాలని విప్లవ్ ప్రయత్నిస్తుండగా, పీపుల్ ప్రొటక్షన్ ఫోర్స్ కు చెందిన ఓ వర్గం వారిని కిడ్నాప్ చేస్తుంది. చిత్రం ఏమంటే తాము కిడ్నాప్ చేసింది డీజీపీ నరేంద్ర వర్మ (‘ఆడుకాలం’ నరేన్) కూతురైన వసుధను, పీపీఎఫ్ కు ప్రభుత్వానికి మధ్య శాంతి చర్చలకు మధ్యవర్తిగా ఉన్న రాజు (బెనర్జీ) కొడుకైన విప్లవ్ ను అనే విషయం వాళ్ళకు తెలియదు. మరి వీళ్ళను ఆ తీవ్రవాదుల బృందం ఎందుకు కిడ్నాప్ చేసింది? అరకులో ఈ ఇద్దరు బ్లాగర్స్ మధ్య చిగురించిన ప్రేమ ఈ వ్యహారంతో ఎలా బెడిసి కొట్టింది? తిరిగి వీళ్ళు ఎలా కలుసుకున్నారు? అనేదే సినిమా!
మూవీ టైటిల్ ‘లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్’ అని వినగానే… ఇదేదో న్యూ ఏజ్ రొమాంటిక్ లవ్ స్టోరీ అని జనం భావిస్తారు. కానీ ఇందులో అవేవీ లేవు. ఇద్దరు బ్లాగర్స్ ను తీసుకుని, తీవ్రవాదులకు పోలీసులకు మధ్య సాగే వార్ ను దర్శకుడు చూపించాడు. దాంతో థియేటర్ కు వచ్చిన వారికి ‘అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి’ అనే భావన కలుగుతుంది. దర్శకుడు కొద్ది రోజులుగా ఇందులో రొమాన్స్ కాకుండా అంతకు మించి సస్పెన్స్ క్రైమ్ ఎలిమెంట్ ఉంటుందని చెప్పినా… జనాలు ఇలాంటి క్రైమ్ ఎలిమెంట్ ను అయితే ఊహించరు. నిజం చెప్పాలంటే.. ఇందులో ఓ చోట మూవీ రివ్యూవర్ అయిన సప్తగిరి… ‘నిర్మాత తన కొడుకుతో హాఫ్ బాయిల్డ్ మూవీ తీశాడని, దాన్ని తాను ఏకి పారేశాన’ని చెబుతాడు. ఓ రకంగా ఇదీ అలాంటి హాఫ్ బాయిల్డ్ మూవీనే. సినిమా పేరు, రాసుకున్న కథ, తెరకెక్కించిన విధానం… మనకు హాఫ్ బాయిల్డ్ కుకింగ్ లానే అనిపిస్తుంది. బాలీవుడ్ కెమెరామేన్ అనే భావనతో పైరసీ వీడియో గ్రాఫర్ అయిన జాక్ డానియల్స్ ను హీరో ఎంగేజ్ చేయడం; విప్లవ్ ను టార్గెట్ చేసి అరకు వచ్చిన వసుథ అతన్నే గుర్తు పట్టకపోవడం… శాంతి చర్చలకు మధ్యవర్తిగా ఉన్న వ్యక్తి కొడుకునే తీవ్రవాదులు గుర్తించకపోవడం… ఇలా చాలా సన్నివేశాలు టేకిట్ గ్రాంట్ లా దర్శకుడు తెరకెక్కించాడు. ఫ్లాష్ బ్యాక్ ను దశల వారిగా హీరో, రఘుబాబుకు చెప్పడం బాగానే ఉన్నా టూ మచ్ ఫ్లాష్ బ్యాక్స్ ప్రేక్షకులకు బోర్ కొట్టించేలా ఉన్నాయి. అయితే, సినిమా ప్రారంభంలో రైల్వే స్టేషన్ లో వచ్చే ఐటమ్ సాంగ్ కు చక్కని రీజన్ పెట్టాడు. ఆ పాట చిత్రీకరణ కూడా సందర్భానుసారంగానే ఉంది. కానీ సెకండ్ హాఫ్ లో వచ్చే ‘లచ్చమమ్మో…’ సాంగ్ పిక్చరైజ్ చేసిన లొకేషన్ కరెక్ట్ కాదు… జానపదాన్ని తలపించే ఆ పాటను ఐలాండ్స్ లో తీసి ఫీల్ ను చెడగొట్టేశారు. తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోవాలనే ఫరియా అబ్దులా ఇన్ టెన్షన్ మంచిదే అయినా… ఆమెతో ఇంకాస్తంత బాగా డబ్బింగ్ చెప్పించి ఉండాల్సింది. మూవీ చూస్తున్నంత సేపు ప్రేక్షకులు హాయి నవ్వుకున్నారంటే… అందులోని సంభాషణలే ప్రధాన కారణం!
హీరో క్యారెక్టరైజేషన్ పైనా దర్శకుడు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టలేదు. కమ్యూనిస్టు అయిన తన తండ్రిని డబ్బులు ఇవ్వలేదని విమర్శించిన అతనితోనే, క్లయిమాక్స్ లో తీవ్రవాదుల వల్లే పొలిటీషియన్స్ భయంతో మంచి పనులు చేస్తున్నారని చెప్పించడం అర్థం లేనిది. ఇక తన తండ్రిని చంపిన తీవ్రవాదుల మీద పగ తీర్చుకోవడం కోసం ఐపీఎస్ చదివి, ఆపైన చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకునే పోలీస్ ఆఫీస్ పాత్ర కూడా సరిగా లేదు. దానికి బదులు అతన్ని తీవ్రవాదుల కోవర్ట్ గా చూపించి ఉంటే కథ రక్తికట్టేది. దీనికి తోడు తన క్రింది అధికారి తీవ్రవాదులను హతమార్చిన విషయం డీజీపికి తెలియదని చూపడం కామెడీగా ఉంది. ఇలాంటి లూప్ హోల్స్ మూవీలో చాలానే ఉన్నాయి.
నటీనటుల విషయానికి వస్తే సంతోష్ శోభన్ చాలా ఈజ్ తో ఈ పాత్రను పోషించాడు. ఫరియా స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. కానీ డబ్బింగ్ ఆమె చెప్పకుండా ఉంటే ఇంకా బాగుండేది. తీవ్రవాదుల నాయకుడిగా మైమ్ గోపీ, డీజీపీగా ‘ఆడుకాలం’ నరేన్, అతని సహాయకుడిగా గోవింద్ పద్మసూర్య నటించారు. దళం నుండి వెలివేయబడ్డ బ్రహ్మన్నగా బ్రహ్మాజీ కామెడీ పండించాడు. తీవ్రవాదులను ఇందులో మరీ బఫూన్లుగా చూపించారు. దానికి కాంపన్ సేట్ గా లాస్ట్ లో వారి వల్ల సమాజానికి మేలు జరుగుతోందని హీరో పాత్రతో చెప్పించారు. ప్రథమార్థంలో సంతోష్ శోభన్, నెల్లూరు సుదర్శన్ మధ్య సన్నివేశాలు వినోదాన్ని అందించాయి. అలానే ద్వితీయార్థంలో సప్తగిరి తెర మీద కనిపించేది కొద్దిసేపే అయినా తనదైన శైలితో ఆకట్టుకున్నాడు. ఇతర ప్రధాన పాత్రలను బెనర్జీ, ‘శుభలేఖ’ సుధాకర్, మిర్చి కిరణ్ తదితరులు పోషించారు. ప్రవీణ్ లక్కరాజు స్వరాలు ఓకే కానీ వాటి చిత్రీకరణ ఏమంత ఆకట్టుకునేలా లేదు. వసంత్ సినిమాటోగ్రఫీ ఫర్వాలేదు. ఈ సినిమాను ఓటీటీలో చూసి లైక్ చేయొచ్చు కానీ థియేటర్లలో చూసి మెచ్చడం కష్టమే!
రేటింగ్: 2.5 / 5
ప్లస్ పాయింట్స్
ఆకట్టుకునే సంభాషణలు
వినోదాత్మక సన్నివేశాలు
మైనెస్ పాయింట్స్
బలహీనమైన కథ
నీరసం తెప్పించే కథనం
ట్యాగ్ లైన్: లైక్ చేయడం కష్టమే!