NTV Telugu Site icon

Janaka Aithe Ganaka Review: జనక అయితే గనక రివ్యూ.. సూహాస్ హిట్ కొట్టాడా?

Janaka Aithe Ganaka

Janaka Aithe Ganaka

నటీనటులు: సుహాస్‌, సంగీర్తన, రాజేంద్రప్రసాద్‌, గోపరాజు రమణ, వెన్నెక కిశోర్‌, మురళీ శర్మ తదితరులు
నిర్మాణ సంస్థ: దిల్‌ రాజు ప్రొడక్షన్స్‌
నిర్మాతలు : హర్షిత్‌ రెడ్డి, హన్షిత్ రెడ్డి
దర్శకత్వం: సందీప్‌రెడ్డి బండ్ల
సంగీతం: విజయ్‌ బుల్గానిక్‌
సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరామ్‌
విడుదల తేది: అక్టోబర్‌ 12, 2024

కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు వెతికి మరీ చేసుకుంటూ వెళుతున్నాడు హీరో సుహాస్. ఇప్పటికే అనేక సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన ఆయన ఇప్పుడు జనక అయితే గనక అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సందీప్ రెడ్డి అనే కొత్త దర్శకుడు దర్శకత్వంలో ఈ సినిమాని దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ మీద హర్షిత్ రెడ్డి, హన్షిత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉన్న ఈ సినిమా పలు కారణాలతో వాయిదా పడింది. ఎట్టకేలకు దసరా సందర్భంగా అక్టోబర్ 12వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా మీద ఉన్న నమ్మకంతో రెండు రోజులు ముందుగానే ప్రీమియర్స్ కూడా ప్లాన్ చేశారు నిర్మాత. మరి ఈ సినిమా ఎలా ఉంది? ఎంతవరకు ప్రేక్షకులను ఆకట్టుకుంది? అనేది ఇప్పుడు మనం రివ్యూలో చూద్దాం పదండి.

కథ: ప్రసాద్(సుహాస్) ఒక టిపికల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన వ్యక్తి. తాను ఇచ్చిన సలహాలు తన తండ్రి (గోపరాజు రమణ) పాటించక పోవడం వల్లనే ఇంకా మిడిల్ క్లాస్ లోనే ఉండిపోయామని భావంలో బతికేస్తూ ఉంటాడు. ప్రసాద్ కి పెళ్లి అయింది. తన భార్య (సంగీర్తన విపిన్) తో చాలా అన్యోన్యమైన దాంపత్య జీవితం గడుపుతూ ఉంటాడు. అయితే పిల్లల విషయంలో మాత్రం ఇప్పుడే వాళ్లని కనలేను అని ఒక గిరి గీసుకుని కూర్చుంటాడు. అలా ఎందుకు గిరి గిసుకున్నాడు? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఎంత ఫ్యామిలీ ప్లానింగ్ చేసిన ప్రసాద్ భార్య నెల తప్పుతుంది. దీంతో తాను కండోమ్ వాడినా తన భార్యను ఎలా తప్పింది కాబట్టి అది కంపెనీ తప్పే అంటూ కంపెనీ మీద కోర్టుకు వెళతాడు. తనకు కోటి రూపాయల నష్టపరిహారం ఇప్పించాలని కోరుతాడు. అయితే కండోమ్ కంపెనీ ఆ నష్టపరిహారం ఇచ్చిందా? ఇలాంటి ఒక టిపికల్ కేసు వేసిన తర్వాత ప్రసాద్ జీవితంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి? చివరికి కోటి రూపాయలు వచ్చాయా? లేదా? ప్రసాద్ జీవితంలో చోటు చేసుకున్న సంఘటనలు ఏమిటి? లాంటి విషయాలు తెలియాలంటే సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.

విశ్లేషణ:
కథగా చెప్పుకోవాలంటే ఇది ఒక సరికొత్త లైన్. తెలుగులో ఇలాంటి ప్రయత్నాలు ఇప్పటివరకు రాలేదు. ఒక మధ్యతరగతి కుర్రాడు అనుకోకుండా తండ్రి అవుతున్న పరిస్థితుల్లో కండోమ్ కంపెనీ మీద కేసు వేసి ఎలా పోరాడాడు? అనే లైన్ తో సినిమాని తెరకెక్కించారు. నిజానికి కండోమ్ అనే పదం వాడాలంటేనే మన తెలుగు వాళ్ళందరూ అదోరకంగా ఫీల్ అయిపోతూ ఉంటారు. అలాంటిది దాన్నే ప్రధానమైన లైన్ గా చేసుకునే సినిమా చేస్తున్నారు అంటే అది ఒక రకంగా సాహసం అనే చెప్పాలి. దానికి దిల్ రాజు ప్రొడక్షన్స్ లాంటి ఒక పెద్ద సంస్థ ఇలాంటి సినిమా చేయడం నిజంగా అభినందనీయం. వాస్తవానికి సినిమాలో ప్రస్తావించింది కండోమ్ కేసు అయినా సరే ఆ కేసు వెనుక ప్రస్తావించిన కారణాలు ప్రతి తండ్రి కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. కండోమ్ కంపెనీతో మొదలుపెట్టి విద్యాసంస్థలు, వైద్య రాంగాన్ని కూడా ప్రశ్నించేలా ఈ సినిమాని రాసుకున్నారు. నిజానికి ప్రసాద్ భార్య గర్భం దాల్చే వరకు సినిమా సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. ఎప్పుడైతే ప్రసాద్ భార్య గర్భం దాల్చిందో అక్కడి నుంచి సినిమా పరుగులు పెడుతుంది. కోర్టు రూమ్ డ్రామా మొదలైన తర్వాత అక్కడ పండించిన కామెడీ బాగా వర్కౌట్ అయింది. కండోమ్ అనే సీరియస్ సబ్జెక్టుని సరదాగా ఆలోచింప చేసే విధంగా డీల్ చేసిన విధానం ఆకట్టుకునేలా ఉంది.

నటీనటుల విషయానికి వస్తే సుహాస్ సినిమా సినిమాకు వైవిధ్యం చూపిస్తూ తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు. ఈ సినిమాలో కూడా ఒక మిడిల్ క్లాస్ టిపికల్ కుర్రాడిగా అదరగొట్టాడు. ఒక హీరోలా కాకుండా పక్కింటి కుర్రాడిగా కనిపిస్తూ సినిమా భారాన్ని మోసేసాడు. అతని భార్య పాత్రలో నటించిన సంగీర్తన కూడా తనదైన నటన కనబరిచింది. గోపరాజు రమణ, వెన్నెల కిషోర్, ప్రభాస్ శ్రీను వంటి వాళ్ళ కాంబినేషన్ సీన్స్ లో సుహాస్ కామెడీతో అదరగొట్టాడు. వాళ్లతో కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. సుహాస్ తల్లి పాత్రలో నటించిన శ్రీవాణి, బామ్మ పాత్రలో నటించిన తెనాలి శకుంతల ఇద్దరికీ మంచి పాత్రలు పడ్డాయి. ఇక మిగతా పాత్రధారులు తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకున్నారు. సాంకేతిక నిపుణుల పనితీరు విషయానికి వస్తే ఆ విషయంలో సినిమా చాలా అద్భుతంగా అనిపించింది. ముఖ్యంగా విజయ్ బుల్గేనిన్ సంగీతం ఆకట్టుకుంటుంది. కొన్ని పాటలు ఇప్పటికే చార్ట్ బస్టర్స్ అయ్యాయి. నేపథ్య సంగీతం కూడా సినిమాకి తగ్గట్టుగా ఉంది. ఇక సినిమాటోగ్రఫీ సినిమాని కలర్ ఫుల్ గా చూపించడంలో సక్సెస్ అయ్యింది. అయితే సినిమా ఎంతగా నవ్వించిందో కొన్ని లాజిక్స్ విషయంలో కూడా అంతే మిస్ అయినట్లు అనిపించింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

ఫైనల్లీ జనక అయితే గనక కడుపుబ్బ నవ్విస్తూ ఆలోచింపజేసే సినిమా..