టైటిల్ తోనే ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించిన చిత్రం ఇట్లు మీ ఎదవ నిజానికి ఒకప్పుడు పూరీ జగన్ సినిమాలకు ఎక్కువగా ఇలా తిట్లను టైటిల్స్ గా వాడుతూ ఉండేవారు. క్రమంగా ట్రెండ్ తగ్గింది. అయితే తాజాగా ఇట్లు మీ ఎదవ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ప్రకటించినప్పటి నుంచి సినిమా ఎలా ఉంటుందో అని అందరిలోనూ ఆసక్తి ఏర్పడింది. దానికి తోడు మైత్రి మూవీ మేకర్స్ సినిమా రిలీజ్ చేస్తూ ఉండడంతో ఈ సినిమా మీద ఆసక్తి మరింత పెరిగింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది. అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.
కథ
శ్రీను (త్రినాథ్ కఠారి) ఆరేళ్లుగా పీజీ చదువుతూ, జీవితాన్ని లక్ష్యం లేకుండా గడుపుతూ ఉంటాడు. అదే కాలేజీలో మనస్విని (సాహితీ అవాంచ) చేరిన తర్వాత, శ్రీను ఆమెను చూసి మనసు పారేసుకుంటాడు. ఆమెను మెప్పించడం కోసం తను ఎదవ జీవితాన్ని వదిలి మంచిగా మారుతాడు. క్రమంగా శ్రీను ప్రేమలో మను కూడా పడుతుంది. ఎప్పుడూ ఆవారాగా తిరిగే కొడుకులో మార్పు రావడంతో, అతని తండ్రి (గోపరాజు రమణ) సంతోషించి, మను తండ్రి (దేవి ప్రసాద్) వద్దకు వెళ్లి పెళ్లి సంబంధం అడుగుతాడు. అయితే మను తండ్రి అందుకు నిరాకరించి, తన కూతురు శ్రీను వల్లే చెడిపోయిందని నిందిస్తాడు. దాంతో, ఈ సమస్య పరిష్కారం కోసం ఓ డాక్టర్(తనికెళ్ళ భరణి) వద్దకు వెళ్తారు. ఆ డాక్టర్ సూచన మేరకు, శ్రీను ముప్పై రోజులు మను తండ్రితో గడపాలి. ఆ 30 రోజుల్లో శ్రీను నిజంగా ఎదవ అని తేలితే, అతన్ని వదిలేయాలని ఛాలెంజ్ పెడతాడు. మరి శ్రీను ఈ ఛాలెంజ్‌లో నెగ్గాడా? మను తండ్రిని మెప్పించాడా? వారి ప్రేమ వివాహానికి దారి తీసిందా? అనేది తెరపై చూడాల్సిందే.
విశ్లేషణ:
దర్శకుడు రాసుకున్న కాన్సెప్ట్ వినడానికి ఆసక్తికరంగా ఉంది. ‘బొమ్మరిల్లు’ చిత్రంలో హీరోయిన్ హీరో ఇంట్లో ఉండగా, ఇక్కడ హీరో హీరోయిన్ తండ్రితోనే 30 రోజులు తిరగాలనే రివర్స్ పాయింట్ తీసుకున్నారు. అయితే, ఫస్టాఫ్ మాత్రం రొటీన్ లవ్ సీన్స్, కాలేజీ సన్నివేశాలతో కాస్త సాదాసీదాగా సాగింది. అక్కడక్కడ కొన్ని సీన్లను అతికించినట్టుగా అనిపించింది. శ్రీను-మనుల ప్రేమ విషయం ఇంట్లో తెలిసిన దగ్గర్నుంచి కథనం వేగం పుంజుకుంటుంది. ఇంటర్వెల్‌లో ఇచ్చిన 30 రోజుల ఛాలెంజ్, ద్వితీయార్థంపై ఆసక్తిని పెంచుతుంది.
సెకండాఫ్‌లో ఎక్కువ భాగం హీరో, హీరోయిన్ తండ్రి చుట్టూ, ఆ ఇద్దరి మధ్య నలిగిపోతూ హీరోయిన్ చుట్టూ కథ తిరుగుతుంది. ఈ భాగంలో కూడా కొన్ని సన్నివేశాలు అనవసరం అనిపిస్తాయి. కామెడీ పండించేందుకు చేసిన ప్రయత్నాలు అనుకున్నంతగా వర్కౌట్ అవ్వలేదు. అయితే, సినిమా మొత్తంలో హైలైట్ ఏంటంటే క్లైమాక్స్. ప్రీ-క్లైమాక్స్ కాస్త ఎమోషనల్‌గా నడుస్తుంది. క్లైమాక్స్ మాత్రం కథను నడిపించిన తీరుకు భిన్నంగా, ప్రేక్షకులు ఊహించని విధంగా చాలా బాగా రాసుకున్నారు. కేవలం క్లైమాక్స్ కోసం సినిమా మొత్తం చూడాల్సిందే అని చెప్పవచ్చు. టైటిల్‌కు తగ్గట్టుగానే, సినిమా ఆద్యంతం హీరో ‘ఎదవ’ అని పిలిపించుకుంటూనే ఉంటాడు. కానీ, నిజమైన ‘ఎదవలు’ ఎవరు కారు అని చెప్పే ప్రయత్నం ఈ సినిమాలో జరిగింది.
నటీనటుల పనితీరు:
దర్శకుడిగా బాధ్యతలు నిర్వహిస్తూనే, హీరోగా త్రినాథ్ కఠారి బాగానే నటించి మెప్పించాడు. కాకపోతే రవితేజను ఇమిటేట్ చేసిన ఫీలింగ్ కలుగుతుంది. ఇక సాహితీ అవాంచ చబ్బీగా, క్యూట్‌గా హాఫ్ శారీలలో కనిపిస్తూ తెరపై అందాన్ని తీసుకొచ్చింది. అందంతో పాటు నటనతో కూడా ఆకట్టుకుంది. ఎప్పుడూ కొడుకును విమర్శించే తండ్రి పాత్రలో గోపరాజు రమణ, కూతురు శ్రేయస్సును కోరే తండ్రి పాత్రలో దేవి ప్రసాద్.. ఇద్దరూ తమ పాత్రల్లో ఒదిగిపోయి నటించారు. డాక్టర్ పాత్రలో తనికెళ్ళ భరణి అతిథి పాత్రలో మెరిసి, ఆ పాత్రకు న్యాయం చేశారు. నవీన్ నేని, ప్రభావతి, మధుమణి సహా మిగిలిన నటీనటులు అందరూ తమ పాత్రల పరిధి మేరకు పర్వాలేదనిపించారు.
సాంకేతిక విభాగాలు:
విజువల్స్ బాగానే ఉన్నాయి. ముఖ్యంగా బీచ్ సన్నివేశాలు, పాటల్లో విజువల్స్ అద్భుతంగా చూపించారు. ఆర్పీ పట్నాయక్ అందించిన నేపథ్య సంగీతం, పాటలు వినడానికి బాగున్నాయి. అయితే, ఆయన పాత సినిమాల్లో విన్నామనే ఫీలింగ్ కలుగుతుంది. సినిమాకు కావాల్సినంత ఖర్చుపెట్టినట్లుగా కనిపిస్తున్నాయి. దర్శకుడు కొత్త కాన్సెప్ట్‌ను తీసుకొచ్చి, రొటీన్ సన్నివేశాలతో నడిపి, మంచి క్లైమాక్స్‌తో ముగించడంలో కొంతవరకు విజయం సాధించాడు.
ఫైనల్ తీర్పు:
‘ఇట్లు మీ ఎదవ’ – ‘రివర్స్ బొమ్మరిల్లు’..