Hi Nanna Review: నాని, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం హాయ్ నాన్న. ఈ మూవీ ఆల్రెడీ పాటలు, టీజర్, ట్రైలర్‌లతోనే పాజిటివ్ బజ్ క్రియేట్ చేసింది. ఇక సీతారామం తరువాత మృణాల్ నుంచి వచ్చిన చిత్రం ఇదే. దీంతో మరింతగా క్రేజ్ నెలకొంది. జెర్సీ తరువాత నాని మళ్లీ అలాంటి ఎమోషనల్ డ్రామాను ఎంచుకున్నాడు. కూతురు సెంటిమెంట్‌గా సాగే ఈ హాయ్ నాన్న చిత్రం నేడు (డిసెంబర్ 7) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా సంగతులేంటో ఓ సారి చూద్దాం.
కథ:
విరాజ్ (నాని) తన కూతురు మహి (కియారా ఖన్నా)ను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. ఇంట్లో మహి తన నాన్న, తాతలే ప్రపంచంగా ఉంటుంది. మహికి అనారోగ్య సమస్యలుంటాయి. ఎంతకాలం బతుకుతుందో కూడా చెప్పలేరు. దీంతో ఆమెను ఎలా బతికించుకోవాలని విరాజ్ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంటాడు. తన కూతురు ఏది అడిగితే అది చేసే విరాజ్.. అమ్మ కథను మాత్రం చెప్పడు. అలాంటి ఓ సమయంలో మహి ఇంట్లోంచి బయటకు వెళ్తుంది. మహిని యశ్న (మృణాల్ ఠాకూర్) ఓ ప్రమాదం నుంచి కాపాడుతుంది. ఆ తరువాత మహి, యశ్నలు ఫ్రెండ్స్ అవుతారు. ఈ ఇద్దరూ కలిసి అమ్మ కథ చెప్పాలంటూ విరాజ్ మీద ఒత్తిడి తీసుకొస్తారు. దీంతో విరాజ్ సైతం అమ్మ కథను చెప్పడానికి సిద్దపడతాడు. అమ్మగా ఎవరిని ఊహించుకోవాలంటూ యశ్న అడుగుతుంది. నన్ను ఊహించుకో అని యశ్న అంటుంది. దీంతో విరాజ్ తన ఫ్లాష్ బ్యాక్ చెబుతాడు. వర్షతో పరిచయం, ప్రేమ, పెళ్లి, సంతానం ఇలా అన్నీ చెప్పేస్తాడు. వర్ష, యశ్న ఇద్దరూ ఒక్కటే అని తరువాత తెలుస్తుంది? అసలు వర్ష కాస్త యశ్నగా ఎందుకు మారింది? యశ్న తన గతాన్ని ఎందుకు మరిచిపోయింది? మళ్లీ యశ్నకు గతం గుర్తుకు వస్తుందా? యశ్న చివరకు ఏం చేస్తుంది? విరాజ్ మహి యశ్నల కథ ఎలా సుఖాంతం అవుతుంది? అన్నది థియేటర్లో చూడాల్సిందే.
నటీనటులు..
విరాజ్‌గా నాని నటనకు వంక పెట్టలేం. నాని నటన ఇది వరకు ఎన్నో చిత్రాల్లో చూశాం. కామెడీగా, సీరియస్‌గా, ఎమోషనల్‌గా ఇలా చాలా సినిమాల్లో నటించాడు. పీజే, జెర్సీ ఇలా ఎన్నో సినిమాల్లో అందరినీ ఏడిపిస్తాడు. ఇక ఇందులోనూ నాని తన నటనతో ఏడిపిస్తాడు. నాని నటన ఎంతో సహజంగా ఉంటుందని మరోసారి ఈ చిత్రం నిరూపిస్తుంది. ఇక మృణాల్ ఠాకూర్ తెరపై కనిపిస్తే ఇంకెవ్వరినీ చూడలేమనేట్టుగా అందరినీ ఆకట్టుకుంటుంది. అందంతో, నటనతో కట్టిపడేస్తుంది. మృణాల్ సైతం తన నటనతో ప్రేక్షకుడ్ని ఏడిపిస్తుంది. ఇక చిన్న పాప కియారా ఖన్నా సైతం తన యాక్టింగ్‌తో అందరినీ కదిలిస్తుంది. కంటతడి పెట్టిస్తుంది. ప్రియదర్శి, జయరాం, విరాజ్ అశ్విన్, హీరోయిన్ మదర్ ఇలా అన్ని పాత్రలు ఓకే అనిపిస్తాయి.
Read also: Pawan Kalyan: నేడు విశాఖకు పవన్ కళ్యాణ్..
విశ్లేషణ
దర్శకుడు శౌర్యువ్‌కు ఇది మొదటి సినిమా. కానీ అలా ఎక్కడా అనిపించదు. ఎలాంటి అనుభవం లేకుండా ఇలాంటి ఎమోషనల్ డ్రామాను ఇంత అద్భుతంగా తీశాడా? అంటే నమ్మబుద్ది కాదు. అలా అని ఈ సినిమాలో ఎలాంటి లోపాలు లేవా? అంటే కాదు. లోపాలున్నా కూడా నాని, మృణాల్, కియారా ఖన్నా నటన ముందు అవి కనిపించవు. అలా మెయిన్ లీడ్స్‌తో యాక్టింగ్‌ను, ఎమోషన్‌ను రాబట్టుకున్నాడు దర్శకుడు.
ప్రథమార్దం కాస్త బోరింగ్‌గా, సాగదీసినట్టుగా అనిపిస్తుంది. మెయిన్ ప్లాట్ స్టార్ అయ్యే వరకు కాస్త ఓపిక పట్టాల్సిందే. విరాజ్ తన కథ స్టార్ట్ చేసినప్పటి నుంచి కథ ఇంకో గేర్ మార్చి వేగం పెంచినట్టుగా అనిపిస్తుంది. అయితే ఇంటర్వెల్ కార్డ్ మాత్రం కాస్త సాగదీసినట్టుగా అనిపిస్తుంది. విరాజ్ తన కంప్యూటర్ ఓపెన్ చేసినప్పుడే ఇంటర్వెల్ పడుతుందని ప్రేక్షకులు అనుకుంటూ ఉంటారు. కానీ అక్కడే మళ్లీ సాగదీసినట్టుగా కనిపిస్తుంది. దీంతో ఫస్ట్ హాఫ్ ఎప్పుడు అవుతుందా? అని ప్రేక్షకులు ఎదురుచూస్తుంటారు.
రెండో భాగం మొత్తం కూడా గోవాలోనే షూట్ చేసినట్టుగా కనిపిస్తోంది. రెండో భాగంలో ఎమోషన్స్ మరింత ఎక్కువగా ఉండేట్టు రాసుకున్నాడు దర్శకుడు. ఇంటర్వెల్‌కు ఇచ్చే ట్విస్ట్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్‌లో ఇచ్చే ట్విస్ట్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక ప్రీ క్లైమాక్స్ నుంచి ఎమోషనల్ ఎపిసోడ్స్ స్టార్ట్ అవుతాయి. అక్కడ గుండె బరువెక్కేలా దర్శకుడు సీన్లను, డైలాగ్స్‌ను రాసుకున్నాడు. నా ప్రేమ సరిపోవడం లేదా? అంటూ నాని తన కూతురితో చెప్పే మాటలకు ప్రేక్షకుడికి కంటతడి రావొచ్చు. అలా చివరకు ఎండింగ్ వరకు ప్రేక్షకుడ్ని అదే ఎమోషన్‌తో కూర్చోబెట్టడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. సాంకేతికంగా ఈ సినిమా ఉన్నతంగా కనిపిస్తుంది. హేషం అబ్దుల్ వాహబ్ సంగీతం ఎంతో వినసొంపుగా, గుండెను తాకేలా ఉంటుంది. ఆర్ఆర్ సైతం సినిమా మూడ్‌ను క్యారీ చేసింది. కెమెరామెన్ ఇచ్చిన విజువల్స్‌లో నాని మరింత యంగ్‌గా, మృణాల్ మరింత అందంగా కనిపిస్తారు. ఫ్లాష్ బ్యాక్‌లో లొకేషన్స్అద్భుతంగా అనిపిస్తాయి. ఎడిటర్ ఫస్ట్ హాఫ్ ఇంకాస్త చూసుకుని ఉంటే బాగుండేదేమోననిపిస్తుంది. మాటలు గుండెల్ని తాకుతాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి.
తండ్రీ కూతుళ్ళ ఎమోషనల్ జర్నీ విత్ యాడెడ్ లవ్ స్టోరీ