బాల నటుడిగా తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించిన నిఖిల్ దేవాదుల ఘటికాచలం అనే సినిమాతో హీరోగా లాంచ్ అయ్యాడు. హారర్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో ఈ సినిమాని ఎంసీ రాజు నిర్మించగా, అమర్ కామేపల్లి డైరెక్ట్ చేశారు. ప్రభాకర్, అరవికా గుప్తా వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటించిన ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది, ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది అనేది ఇప్పుడు మనం రివ్యూ లో చూద్దాం.
ఘటికాచలం కథ
బాలా (నిఖిల్ దేవాదుల) డాక్టర్ కోర్సు చదువుతూ ఉంటాడు. స్వతహాగా పిరికివాడు, భయస్తుడైన బాలా తనకు నచ్చిన ఫుడ్, కోర్సు, బట్టలు కూడా గట్టిగా అడిగి సంపాదించలేని వ్యక్తిగా ఉంటాడు. తనకు ఇష్టమైన చిన్న చిన్న విషయాలు కూడా బయటకు చెప్పలేక, లోపల లోపల కుమిలిపోతుంటాడు. ఇంట్లో బందీగా ఉన్న ఫీలింగ్, కాలేజీలో ఫ్రెండ్స్ ఎగతాళి చేయడంతో మానసికంగా డిస్టర్బ్ అవుతాడు. కాలేజీలో తనతో ఫ్రీగా ఉండే క్లాస్‌మేట్ (సంయుక్త రెడ్డి)ని ప్రేమిస్తే, ఆమె వేరే అబ్బాయితో లవ్‌లో ఉంటుంది. ఇది చూసి తట్టుకోలేక మరింత మానసిక సంఘర్షణకు లోనవుతాడు. ఈ క్రమంలో బాలాలో మానసికమైన మార్పులు వస్తాయి. బయట నుంచి శబ్దాలు వినిపిస్తున్న ఫీలింగ్ మొదలవుతుంది. అలాగే దెయ్యం వెంటాడుతూ చదువుకోనివ్వకుండా రెబల్‌గా మారమంటుంది, తనకు నచ్చిన విషయాలు బయటకు చెప్పాలని బలవంతం చేయడం మొదలు పెడుతుంది. కొడుకును ఇలా చూసిన తండ్రి పరశురామ్ (ప్రభాకర్) డాక్టర్‌కి చూపిస్తాడు. బాలా ఒక సైకలాజికల్ సమస్యతో బాధపడుతున్నాడని డాక్టర్ చెబితే, బాలాకి గాలి సోకిందని బాబాలు, మంత్రాలు చేసేవారి వద్దకు తీసుకెళ్తారు. ఆ సమయంలోనే బాలాని ఆవహించింది కుందనబాగ్ ఘటికాచలం అనే ఆత్మ అని తెలుస్తుంది. అయితే ఆ ఘటికాచలం ఎవరు? బాలాని ఎందుకు ఆవహించాడు? బాలా ఇలా మారిపోవడానికి కారణాలేంటి? ఘటికాచలం బారి నుంచి బాలా ఎలా బయటపడ్డాడు? అనేది మిగిలిన కథ.
విశ్లేషణ
నిజానికి తెలుగు మాత్రమే కాదు, అన్ని భాషల ప్రేక్షకులు హారర్ సినిమాలంటే పడి చస్తారు. ఒక పక్క భయపడుతూనే, సినిమా బాగుంటే ఆస్వాదించడానికి ఏమాత్రం వెనుకాడరు. ఇప్పుడు ఘటికాచలం కూడా దాదాపు అదే లైన్‌లో రూపొందించారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఇది నిజంగా జరిగిన సంఘటన. నిర్మాత ఎక్కడో విని, దాన్ని సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఈనాటి పోటీ ప్రపంచంలో పేరెంట్స్ జాబ్‌లతో బిజీగా ఉంటూ, పిల్లలను స్కూల్స్, ట్యూషన్ల పేరుతో ఒత్తిడికి గురి చేస్తున్నారని ఎన్నో చర్చలు మనకు తెలుసు. ఆ కారణంగా పిల్లలకు, పేరెంట్స్‌కు మధ్య దూరం పెరుగుతోంది. ఈ రోజుల్లో అందుకే ఎన్నో వృద్ధాశ్రమాలు పుట్టుకొస్తున్నాయి, అలాగే మానసిక వైద్యులకు కూడా డిమాండ్ పెరుగుతోంది. అవే పాయింట్స్ ఆధారంగా ఘటికాచలం రూపొందించారు. ఫస్ట్ హాఫ్‌లోనే హీరో పాత్రను ఎస్టాబ్లిష్ చేయడానికి టైమ్ తీసుకున్నారు. ఎలాంటి పరిస్థితుల్లో తాను మానసిక సమస్యకు గురవుతున్నాడనేది డిటెయిలింగ్‌గా చెప్పడం కోసం ఎక్కువ సమయం వెచ్చించారు. హీరో భయపడే సీన్స్ ఒకపక్క భయం కలిగించేలా ఉంటూనే, మరో పక్క నవ్వు తెప్పించేలా రాసుకున్నారు. ఒక ఆత్మ బాలాని చేరుతున్నప్పుడు వచ్చే సన్నివేశాలు ఆద్యంతం ఉత్కంఠకు గురి చేసేలా ఉన్నాయి. సెకండ్ హాఫ్‌లో ఘటికాచలం దెయ్యం ఎంట్రీతో సినిమా మరింత ఆసక్తి రేకెత్తిస్తుంది. నెక్స్ట్ ఏం జరుగుతుందనే ఉత్కంఠ క్రియేట్ చేసింది. నిజానికి సినిమా పాయింట్ చాలా చిన్నది. దాన్ని బాగా లాగినట్టుగా, ఎంతసేపు కథ అక్కడక్కడే తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. అదే సమయంలో క్లైమాక్స్‌లో చాలా లాజిక్స్ మిస్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. ఘటికాచలం బాలాని ఆవహించడం వెనుక లాజిక్ కన్విన్సింగ్‌గా లేదు. కామెడీ ఎలిమెంట్స్, హారర్ ఎలిమెంట్స్ ఇంకా బాగా చూపించే స్కోప్ ఉంది.
నటీనటులు
బాలా పాత్రలో నిఖిల్ దేవాదుల ఆకట్టుకున్నాడు. తనదైన శైలిలో నటించాడు. ఇంత చిన్న వయసులోనే ఇలాంటి సంఘర్షణతో కూడిన పాత్ర దొరకడం అదృష్టం. పాజిటివ్‌తో పాటు నెగటివ్ షేడ్స్‌లోనూ అదరగొట్టాడు. నటుడిగా మంచి ఫ్యూచర్ ఉందనిపిస్తుంది. బాలా తండ్రిగా ప్రభాకర్ సైతం బాగా ఇంప్రెస్ చేసేలా నటించాడు. హీరో తల్లిగా దుర్గాదేవి, అరవికా గుప్తా కనిపించే సమయం తక్కువే అయినా మంచి బలమైన పాత్రలు పోషించారు. హీరోయిన్‌గా సంయుక్త రెడ్డి ఫర్వాలేదు. మిగిలిన పాత్రలు ఓకే.
టెక్నికల్ అంశాలు
టెక్నికల్‌గా సినిమా బాగుంది. ఎస్.ఎస్. మనోజ్ కెమెరా వర్క్, విజువల్స్ ఆకట్టుకుంటాయి. శ్రీనివాస్ బైనబోయిన ఎడిటింగ్ ఫర్వాలేదు. ప్లేవియో కుకురోలో మ్యూజిక్ సినిమాకి స్పెషల్ ఎట్రాక్షన్, ముఖ్యంగా బీజీఎం చాలా బాగుంది. హారర్ ఎలిమెంట్స్‌కి సౌండ్ సెట్ అయింది. దర్శకుడు అమర్ కామేపల్లి ఎంచుకున్న కథ బాగుంది. దాన్ని సహజంగా, సందేశాత్మకంగా తెరకెక్కించిన తీరు అభినందనీయం. కథ ఊహించేలా ఉంది. ఆ విషయంలో కాస్త జాగ్రత్త తీసుకుంటే బాగుండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
ఫైనల్‌గా: పేరెంట్స్, పిల్లలు చూడాల్సిన సందేశాత్మక హారర్ థ్రిల్లర్ ఘటికాచలం.