NTV Telugu Site icon

Gam Gam Ganesha Review: గం గం గణేశా రివ్యూ

Gam Gam Ganesha Review

Gam Gam Ganesha Review

Gam Gam Ganesha Review: విజయ్ దేవరకొండ సోదరుడిగా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన ఆనంద్ దేవరకొండ ఈ మధ్యనే బేబీ అనే సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఒక అమ్మాయి చేతిలో దారుణంగా మోసపోయిన కుర్రాడిగా కనిపించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. అలాంటి ఆనంద్ దేవరకొండ ఇప్పుడు గం గం గణేశా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు. నిజానికి బేబీతో పాటే ఈ సినిమాను కూడా మొదలుపెట్టారు. అయితే షూటింగ్స్ డిలే కావడంతో కాస్త ఆలస్యంగా ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కొత్త దర్శకుడు ఉదయ దర్శకత్వంలో ఈ సినిమాని వంశీ కారుమంచి, కేదార్ నిర్మించారు. టీజర్, ట్రైలర్ తో ప్రేక్షకులలో ఆసక్తి రేకెత్తించిన ఈ సినిమా ఈ శుక్రవారం నాడు ప్రేక్షకులు ముందుకు వచ్చింది. అయితే సినిమా ఎలా ఉంది అనేది ఇప్పుడు మనం రివ్యూలో చూద్దాం.

గం గం గణేశా కథ:
హైదరాబాద్ బస్తీలో నివసించే గణేష్(ఆనంద్ దేవరకొండ) శంకర్ (ఇమ్మానుయేల్) అనాధలు. ఇద్దరూ కలిసి చిల్లర దొంగతనాలు చేస్తూ ఉంటారు. శ్రుతి (నయన్ సారిక)తో ప్రేమలో ఉండగా శ్రుతి గణేశ్‌కి హ్యాండ్ ఇచ్చి వెళ్లి పోతుంది. అయితే ఈ క్ర‌మంలో గ‌ణేష్ ఒక డైమండ్‌ను దొంగ‌త‌నం చేస్తాడు. ఆ డైమండ్ ను పోలీసులకు భయపడి ముంబై నుంచి తెస్తున్న గణేష్ విగ్రహంలో దాస్తాడు. అయితే మరొక పక్కన నంద్యాల ఉప ఎన్నికల్లో గెలవాలని భావిస్తున్న కిషోర్ రెడ్డి అదే విగ్రహంలో 100 కోట్ల రూపాయల నగదు ముంబై నుంచి తెప్పిస్తూ ఉంటాడు. అయితే ఆ డైమండ్ ఆ 100 కోట్ల రూపాయల నగదు కోసం ఒకపక్క గణేష్ గ్యాంగ్ మరొక పక్క కిషోర్ రెడ్డి మనుషులు వెతుకుతూ ఉంటారు. ఆ విగ్రహం కిషోర్ రెడ్డి గోడౌన్ కి కాకుండా రాజావారి పల్లె అనే ఊరికి వెళుతుంది. అయితే ఆ ఊరికి వెళ్లి మారువేషంలో ఉన్న గణేష్ గ్యాంగ్ అలాగే కిషోర్ రెడ్డి గ్యాంగ్ డైమండ్ అలాగే డబ్బుని దక్కించుకున్నారా? దానికి ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? చివరికి ఏం జరిగింది అనే విషయాలు తెలియాలంటే సినిమా మొత్తం చూడాల్సిందే.

విశ్లేషణ
చిల్లర దొంగతనాలు చేసే హీరో కోట్లు విలువ చేసే వస్తువు ఒకదాన్ని కొట్టేసి దాన్ని ఒకచోట దాయడం దానికోసం అనేక తంటాలు పడి చివరికి దక్కించుకోవడం. ఇదే లైన్ తో వచ్చిన ఎన్నో సినిమాలు ఉన్నాయి. ఈ సినిమా కూడా దాదాపు అదే లైన్ తో తెరకెక్కింది. సినిమా ఓపెనింగ్ లోనే చిల్లర దొంగగా ఆనంద్ దేవరకొండ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేసిన డైరెక్టర్ నెమ్మదిగా కథలోకి తీసుకెళ్లాడు. సమాంతరంగా ఒక పక్కన నంద్యాలలో మరొక పక్క హైదరాబాద్ లో జరుగుతున్న కథలను ఇంటర్వెల్ సమయానికి కలిపేశాడు. ఆ తరువాత ఒక గ్యాంగ్ డైమండ్ కోసం, మరొక గ్యాంగ్ 100 కోట్ల డబ్బు కోసం ఒక విగ్రహం దగ్గర కాపు కాస్తున్న పరిస్థితులు సృష్టించారు. అయితే ఈ ఫార్మాట్లో గతంలో ఎన్నో సినిమాలు రావడం ఈ సినిమాకి కాస్త మైనస్ అయ్యే విషయం. కాకపోతే ఫస్ట్ ఆఫ్ ఎలాగో పరిగెత్తించే ప్రయత్నం చేసినా సెకండ్ హాఫ్ చాలా బోర్ కొడుతుంది. ఎందుకో సాగదీసిన ఫీలింగ్ కలిగినా ఆశ్చర్యం లేదు. అయితే సెకండ్ హాఫ్ లో ఎంట్రీ ఇచ్చిన వెన్నెల కిషోర్ చాలా వరకు కామెడీ బాధ్యతలను భుజాన వేసుకున్నాడు. వెన్నెల కిషోర్ కామెడీ ట్రాక్ తప్పిస్తే మిగతాదంతా జబర్దస్త్ కామెడీని గుర్తు చేస్తుంది. అయితే లైన్ పరంగా బాగానే ఉన్నా స్క్రీన్ ప్లే పరంగా ఇంకా పగడ్బందీగా రాసుకొని ఉంటే సినిమా రిజల్ట్ వేరేలా ఉండేది.

ఇక నటీనటుల విషయానికి వస్తే ఆనంద్ దేవరకొండ బేబీ తర్వాత చేసిన ఈ సినిమాలో పూర్తిస్థాయిలో స్టైలిష్ గా కనిపించాడు. అయితే ఎప్పటిలాగే ఉన్న కంప్లైంట్ మాత్రం అలాగే ఉండిపోయింది. కొన్నిచోట్ల ఆనంద్ వాయిస్ విజయ్ దేవరకొండని గుర్తు చేస్తుంది. అది పక్కన పెడితే ఆనంద్ దేవరకొండ చాలా ఈజ్ తో క్యారెక్టర్ ని నడిపించాడు. ఆనంద్ దేవరకొండతో పాటు పూర్తిస్థాయిలో ఇమ్మానియేల్ కి మంచి క్యారెక్టర్ పడింది. ఎక్కడ తగ్గకుండా పోటాపోటీగా నటించాడు. ఇక హీరోయిన్లుగా నటించిన నయన్ సారిక, ప్రగతి శ్రీ వాస్తవ్ ఇద్దరూ కూడా తమ పాత్రల పరిధి మేరకు నటించారు. కిషోర్ రెడ్డి పాత్రధారితోపాటు రుద్ర పాత్రధారి కూడా అద్భుతంగా నటించారు. వెన్నెల కిషోర్ ఉన్నది కాసేపైన నవ్వులు పూయించాడు. ఇక మిగతా పాత్ర దారులు తమ తమ పాత్రల పరిధి మేరకు నటించారు. ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే సాంగ్స్ బాగున్నాయి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకి తగినట్టు సరిపోయింది. సినిమాటోగ్రఫీ కూడా సినిమా మూడ్ ని క్యారీ చేసే విధంగా ఉంది. అయితే సెకండ్ హాఫ్ ఎడిటింగ్ విషయంలో కొంచెం కేర్ తీసుకుంటే బాగుండేది.

ఫైనల్లీ గంగం గణేశా అక్కడక్కడా నవ్విస్తుంది