తమిళ స్టార్ హీరో ధనుష్‌కి తెలుగులో కూడా అభిమానులు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన నటించిన దాదాపు అన్ని తమిళ సినిమాలు తెలుగులో కూడా రిలీజ్ అవుతూ వస్తున్నాయి. సర్, కుబేర లాంటి హిట్స్‌తో ఉన్న ఆయన ఇప్పుడు తాజాగా ఇడ్లీ కొట్టు సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తమిళంలో ఇడ్లీ కడై పేరుతో రూపొందించబడిన ఈ సినిమాని తెలుగులో చింతపల్లి రామారావు రిలీజ్ చేశారు. స్వయంగా ధనుష్ హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకి తమిళంలో డీసెంట్ బజ్ ఏర్పడింది. కానీ తెలుగులో సినిమా వస్తున్నట్లు కూడా జనానికి తెలియ లేదు. మరి ఈ నేపథ్యంలో ఈ సినిమా ఎలా ఉంది, ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది అనేది ఇప్పుడు రివ్యూలో.
కథ:
మురళి (ధనుష్) తండ్రి శివకేశవులు (రాజ్ కిరణ్) తన స్వగ్రామంలో ఒక ఇడ్లీ కొట్టు నడుపుతూ ఉంటాడు. తలుచుకుంటే పట్నానికి వెళ్లి బాగా సంపాదించగలిగినా తన ఊరిని, తన వారిని వదిలి వెళ్ళలేక అదే ఊరిలో ఇడ్లీ కొట్టు నడుపుకుంటూ ఉంటాడు. కానీ హోటల్ మేనేజ్మెంట్ చదివిన మురళి మాతరం ఆ ఇడ్లీ కొట్టు ఫ్రాంచైజీలు అమ్మి సంపాదించాలని అనుకుంటాడు. కానీ అందుకు శివకేశవులు ఒప్పుకోడు. ఈ నేపథ్యంలో తండ్రి మాటకు విరుద్ధంగా బయటకు వెళ్లిన మురళి బ్యాంకాక్‌లో ఒక పెద్ద సంస్థలో మంచి స్థాయికి వెళ్తాడు. ఆ కంపెనీ ఓనర్ కుమార్తె(శాలినీ పాండే) మురళితో ప్రేమలో పడి పెళ్లికి కూడా సిద్ధమవుతుంది. మరికొన్నాళ్లలో పెళ్లి అనుకుంటున్న సమయంలో మురళి తండ్రి శివకేశవులు మరణిస్తాడు. అతని అంత్యక్రియల కోసం తిరిగి వచ్చిన మురళి మళ్లీ తిరిగి వెళ్లి బ్యాంకాక్‌లో పెళ్లి చేసుకునేందుకు నిరాకరిస్తాడు. పెళ్లికి సిద్ధమై బ్యాచిలర్ పార్టీ ఇస్తున్న మురళి పెళ్లి చేసుకోవడానికి ఎందుకు వెనుకాడాడు? ఇండియాకి వచ్చిన మురళి మళ్లీ ఎందుకు వెళ్లకుండా ఇక్కడే ఉండిపోయాడు? చివరికి ఏం జరిగింది? అసలు ఈ సినిమాకి ఇడ్లీ కొట్టు అనే టైటిల్ జస్టిఫికేషన్ ఏంటి? లాంటి విషయాలు తెలియాలంటే సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
విశ్లేషణ:
సినిమా ఓపెనింగ్‌లోనే సూటిగా సుత్తి లేకుండా హీరో క్యారెక్టరైజేషన్‌తో పాటు హీరో తండ్రికి ఇడ్లీ కొట్టు అంటే ఎంత ప్రేమ ఉందనేది సింపుల్‌గా చెప్పేశారు. కథ నడుస్తున్న కొద్ది ధనుష్ విదేశాల్లో సెటిల్ అవడం, అక్కడ బాస్ కూతురుతో లవ్ ట్రాక్, పెళ్లి వంటివి ఆసక్తికరంగా అనిపిస్తాయి. అయితే అవి ఎక్కువసేపు చూపించకుండానే వెంటనే సీన్స్ మళ్లీ ఇండియాకి మారిపోతాయి. ఇండియాకి మారినప్పటి నుంచి ఆసక్తి రేగుతుంది. అయితే ఒకప్పక ఆసక్తి కలిగిస్తూనే మరొకప్పక సినిమాలో ఏం జరగబోతోంది అనే విషయాన్ని ఈజీగా కనిపెట్టేలా రాసుకున్నారు. అది కొంత మైనస్ అనిపించే అంశం. దానికి తోడు ఫస్ట్ హాఫ్ అంతా ఆసక్తికరంగానే సాగిన సెకండ్ హాఫ్ మొదలయ్యాక ఎందుకు ఫస్ట్ హాఫ్ అనిపించినంత ఆసక్తికరంగా సెకండ్ హాఫ్ అనిపించదు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ అంత ఎమోషన్స్ చుట్టూ కథ నడిస్తే సెకండ్ హాఫ్‌లో మాత్రం ఎక్కువగా విలన్ వర్సెస్ హీరో అన్నట్టుగా సాగుతుంది. అయితే అక్కడ కూడా కొన్ని సీన్స్ ఆసక్తికరంగా అనిపించాయి. మొత్తంగా చూసుకుంటే ఈ సినిమా రియాలిటీకి ఏ మాత్రం దగ్గరగా అనిపించదు. కానీ ఎమోషన్స్ మాత్రం బాగానే వర్క్‌ఔట్ అయ్యాయి. కొన్నిచోట్ల ప్రేక్షకులకు కంటతడి పెట్టించేలా సీన్స్ రాసుకున్నాడు ధనుష్. ఓవరాల్‌గా ఈ సినిమా అటు అద్భుతం అనలేము, అలా అని తీసిపారేయదగ్గ సినిమా కూడా కాదు. ఆసక్తికరమైన స్టోరీ ఉన్నా ఎగ్జిక్యూషన్ విషయంలో మరింత కేర్ తీసుకుని ఉంటే ఈ సినిమా ఇంకా వర్క్‌ఔట్ అయి ఉండేదేమో. ఓవరాల్‌గా చెప్పాలంటే తండ్రి మాట కోసం లక్షల జీతాన్ని, జీవితాన్ని వదులుకుని మళ్లీ సొంత ఊరిలో తండ్రి నడిపిన ఇడ్లీ కొట్టు నడిపేందుకు వచ్చిన ఓ కొడుకు కథ ఈ సినిమా. అలా చేసేందుకు ఎన్ని ఇబ్బందులు పడాల్సి వచ్చింది, వాటిని తట్టుకుని ఆ కొడుకు ఎలా నిలబడ్డాడు అనేది సరైన డ్రామాతో ఆకట్టుకునేలా తెరకెక్కించారు.
నటీనటుల విషయానికి వస్తే:
ఈ సినిమాలో మురళి అనే పాత్రలో ధనుష్ ఇమిడిపోయాడు. ధనుష్‌కి ఇలాంటి తరహా పాత్రలు కొత్తేమీ కాదు. దీంతో తనకు కొట్టిన పిండి లాంటి పాత్రలో ఆకట్టుకున్నాడు. ఇక ఆ తర్వాత అంతగా చెప్పుకోదగ్గ పాత్ర నిత్యా మీనన్‌కి దొరికింది. ఆమె పల్లెటూరి పిల్లగా ఆకట్టుకుంది. శాలిని పాండే పాత్ర పెద్దగా లేదు కానీ ఉన్నంతలో పర్వాలేదనిపించింది. సత్యరాజ్‌కి కొంచెం ఇది కొత్త పాత్ర అని చెప్పొచ్చు. ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. అరుణ్ విజయ్‌కి మాత్రం ఈ పాత్ర రొటీన్ అనిపిస్తుంది, మనోడి యాక్టింగ్ కూడా అంతే. ఇక సముద్ర ఖని కూడా ఎప్పటినుంచో చేస్తూ వస్తున్న లాంటి పాత్రలోనే కనిపించాడు. మిగతా నటీనటులు పర్వాలేదు. ఉన్నంతలో తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇక ఈ సినిమా టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే తెలుగు డబ్బింగ్ డైలాగ్స్ ఎవరు రాశారో తెలియదు కానీ కరెక్ట్‌గా ఇప్పటి ట్రెండుకు తగ్గట్టుగా ఆడియన్స్ పల్స్ పట్టుకున్నట్టుగానే రాయడం గమనార్హం. సినిమాటోగ్రఫీ కొంచెం కొత్తగా అనిపించింది. సినిమా అంతా దాదాపుగా ఒక పల్లెటూరు లాంటి సెట్‌లోనే నడిచిపోతున్న ఫీలింగ్ కలుగుతుంది. అక్కడే కాస్త రియాలిటీ మిస్ అయిన ఫీలింగ్ కలిగింది. ఆర్ట్ డిపార్ట్‌మెంట్ వాటిని ఇంకా న్యాచురల్‌గా క్రియేట్ చేసి ఉంటే బాగుండేదనిపిస్తుంది. కాస్ట్యూమ్స్ మాత్రం నటీనటులకు కరెక్ట్‌గా సెట్ అయ్యాయి. పాటలు తెలుగులో పెద్దగా గుర్తించుకునేలా లేవు కానీ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రం సినిమాకి కచ్చితంగా ప్రాణంగా నిలిచింది. ఎమోషనల్ సీన్స్‌తో పాటు దాదాపు అన్నిచోట్ల గూడ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో ఆకట్టుకునే ప్రయత్నం చేసినాడు జీవి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టున్నాయి.
ఓవరాల్‌గా: ఇడ్లీ కొట్టు.. ఓ ఆలోచింపచేసే ప్రయత్నం..కానీ??