NTV Telugu Site icon

Devara Movie Review: దేవర సినిమా రివ్యూ

Devara Review Ntv

Devara Review Ntv

Jr NTR Devara Movie Review in Telugu: జూనియర్ ఎన్టీఆర్ సోలో హీరోగా అరవింద సమేత వీర రాఘవ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆరేళ్లు పూర్తయ్యాయి. తర్వాత రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన సోలో హీరోగా వస్తున్న దేవర సినిమా మీద భారీ అంచనాలున్నాయి. కొరటాల శివ ఆచార్య తర్వాత చేస్తున్న సినిమా కావడం, జూనియర్ ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా మీద అంచనాలు అంతకంతకు పెరుగుతూ వెళ్లాయి. దానికి తోడు టీజర్, ట్రైలర్ కట్స్ సినిమా మీద అంచనాలను మరింత పెంచగా ఎట్టకేలకు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. అర్ధరాత్రి ఒంటి గంట నుంచి సుమారు 500 పైగా షోస్ ఇండియాలో పడగా అమెరికాలో కూడా దాదాపుగా చాలా ప్రీమియర్స్ పడ్డాయి. మరి ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు మనం రివ్యూలో చూద్దాం.

దేవర కథ:
నిఘా వర్గాల హెచ్చరికలతో 1996లో యతి అనే ఒక గ్యాంగ్ స్టార్ ను పట్టుకునేందుకు శివం (అజయ్) ఏపీ తమిళ నాడు బోర్డర్లో ఉన్న రత్నగిరి వెళ్తాడు. యతి కోసం వెళ్లిన శివం అదే ప్రాంతానికి చెందిన దేవర (ఎన్టీఆర్) గురించి సింగప్ప(ప్రకాష్ రాజ్) ద్వారా తెలుసుకుని షాక్ అవుతాడు. చిన్నప్పుడే సొర చేపను చంపి ఒడ్డుకు తెచ్చేంత తెగువున్న దేవర తన వారైన రాయప్ప(శ్రీకాంత్), భైరా (సైఫ్ అలీఖాన్), కుంజ (కళయరసన్), కోర (షేన్ చామ్ టాకో) తో కలిసి పెద్ద పెద్ద షిప్స్ నుంచి మురుగా (మురళి శర్మ) కోసం దొంగతనాలు చేస్తూ ఉంటాడు. అలాంటి దేవర ఒక దొంగతనం చేస్తున్న సమయంలో మనసు మార్చుకుని ఇక దొంగతనం చేయకూడదని ఫిక్స్ అవుతాడు. అయినా వినని తన వారిని భయపెడతాడు. ఆ భయం దెబ్బకు వాళ్ళు మళ్లీ తప్పుడు పని కోసం సముద్రం ఎక్కాలి అంటేనే భయపడతారు. అంతలా భయపెట్టేందుకు దేవర ఒక కీలక నిర్ణయం తీసుకుంటాడు. ఆ కీలక నిర్ణయం ఏమిటి? అందరినీ భయపెట్టే దేవర కొడుకు వరా (ఎన్టీఆర్) ఎందుకు భయస్తుడిగా మారతాడు? వరాను పెళ్లి చేసుకునేందుకు తంగం(జాన్వీ కపూర్) ఏం చేసింది? అసలు దేవర మాటకు బైరా ఎందుకు ఎదురు చెబుతాడు? చివరికి శివంకి యతి దొరికాడా? లేదా? అనే విషయాలు తెలియాలంటే సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.

విశ్లేషణ :
దేవర అనే సినిమా మొదలుపెట్టినప్పుడే ఇది పూర్తిగా ఫిక్షనల్ స్టోరీ అని ఫర్ గాటెన్ ల్యాండ్స్ ని ఆధారంగా చేసుకుని చేస్తున్న సినిమా అని కొరటాల శివ ప్రకటించారు. సినిమా మొదలైనప్పటి నుంచి ఆయన చెప్పిన మాటలు నిజమే అనిపించేలా సాగింది. ఒక ఊహాజనిత ప్రాంతాన్ని సృష్టించి తన కథకు కావాల్సిన ఎత్తుగడను చాలా ఆసక్తికరంగా ఎత్తుకున్నాడు కొరటాల శివ. ఈ మధ్యకాలంలో బాగా వర్క్ అవుట్ అవుతున్న ఎలివేషన్ ఫార్ములాని నమ్ముకున్నట్లే అనిపించింది. ఒక వ్యక్తిని వెతుకుతూ పోలీసుల గ్యాంగ్ రావటం, ఆ వ్యక్తికి సంబంధం లేని మరో వ్యక్తి గురించి ఎలివేషన్లు ఇవ్వడంతో సినిమా మొదలవుతుంది. అసలు దేవర ఎవరు? దేవర నేపథ్యం ఏంటి? ఎందుకు దేవర ఇకమీదట తప్పు చేయకూడదని ఫిక్స్ అయ్యాడు? లాంటి విషయాలను చాలా ఆసక్తికరంగా చూపించడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు.. నిజానికి ఫస్ట్ హాఫ్ మొత్తం మీద అన్ని విషయాల కంటే ప్రీ ఇంటర్వెల్ బ్లాక్ అదిరిపోయేలా ప్లాన్ చేసుకున్నాడు.. సినిమాలో కథను దేవర క్యారెక్టర్ ను ఎస్టాబ్లిష్ చేసేందుకు చాలా సమయమే తీసుకున్నాడు కొరటాల శివ. ఒకపక్క డైలాగులతో మరొక యాక్షన్ తో సినిమాని ఎలివేట్ చేసే విషయంలో బాగా వర్కౌట్ చేసినట్లు అనిపించింది. అలా ఫస్ట్ హాఫ్ పూర్తి చేసి సెకండ్ హాఫ్ మొదలైన తర్వాత రెండో ఎన్టీఆర్ ఇంటి తర్వాత కథలో వేగం తగ్గిన ఫీలింగ్ కలుగుతుంది. దానికి తోడు జాన్వీ కపూర్ ట్రాక్ కొంత క్రింజ్ అనిపించినా ఆమె కాంబినేషన్ లో ఉన్న సాంగ్ ని మాత్రం ఎంజాయ్ చేసేలా డిజైన్ చేశారు. అయితే ఫస్ట్ ఆఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ ఫీలింగ్ కలుగుతుంది. కానీ క్లైమాక్స్ విషయంలో మాత్రం సినిమా రెండవ పార్ట్ కోసం వదిలిన లీడ్ ఆసక్తి రేకెత్తించేలా ఉంది. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? అని బాహుబలిలో ఆసక్తి రేకెత్తించిన విధంగానే ఈ సినిమాలో కూడా ఒక అనుమానం రేకెత్తించే విషయంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు.

నటీనటుల విషయానికి వస్తే జూనియర్ ఎన్టీఆర్ దేవర, వరా అనే రెండు పాత్రలలో తనదైన శైలిలో వేరియేషన్స్ చూపించాడు. అయితే జూనియర్ ఎన్టీఆర్ వేషధారణ విషయంలో మరింత జాగ్రత్త తీసుకుని ఉంటే బాగుండేది. ఒకపక్క దేవరగా మరొకపక్క వరగా ఎన్టీఆర్ ద్విపాత్రాభినయంతో అదరగొట్టాడు. అయితే జాన్వి కపూర్ కి ఎన్టీఆర్ తో కాంబినేషన్ సీన్స్ చాలా తక్కువ.. ఉన్నంతలో ఆమె పరవాలేదు అనిపించింది. ఇక విలన్గా నటించిన సైఫ్ అలీ ఖాన్ మాత్రం జూనియర్ ఎన్టీఆర్ను ఢీకొట్టే పాత్రలో ఒక రేంజ్ లో నటించాడు. ఇక ముఖ్య పాత్రలలో నటించిన ప్రకాష్ రాజ్, కళయరసన్, షేన్ చాం టాకో, శ్రీకాంత్, శృతి మరాఠీ, మురళీ శర్మ, అభిమన్యు సింగ్ వంటి వాళ్ళు తమ తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకున్నారు. నిజానికి ఈ సినిమాలో చాలామంది పాత్రధారులు ఉన్నారు. వాళ్లని గుర్తుపెట్టుకోవడం వాళ్ళ పాత్రల పేర్లు గుర్తు పెట్టుకోవడమే సినిమా మొత్తం మీద అతిపెద్ద టాస్క్. టెక్నికల్ టీం విషయానికి వస్తే సినిమా మొత్తానికి హీరో జూనియర్ ఎన్టీఆర్ అయితే టెక్నికల్ టీం విషయానికి మాత్రం అనిరుధ్ హీరో అనిపించాడు. సాంగ్స్ ఇప్పటికే ఎలాంటి టాక్ తెచ్చుకున్నాయో మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో మాత్రం ఒక రేంజ్ లో అదరగొట్టేసాడు అనిరుధ్. ఇక అనిరుధ్ తర్వాత ఆ స్థాయిలో మంచి మార్కులు కొట్టేసింది మాత్రం యాక్షన్ కొరియోగ్రాఫర్స్. నీటిలో ఫైట్స్ తో పాటు సముద్రపు ఒడ్డున డిజైన్ చేసిన ఫైట్స్ ఒక రేంజ్ లో పేలాయి. ఇక సినిమాటోగ్రఫీ కూడా సినిమా అందాన్ని మరింత పెంచేలా ఉంది. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్ లతోపాటు డాన్స్ లో విషయంలో సినిమాటోగ్రఫీ బాగా వర్కౌట్ అయింది. ఇక కంప్యూటర్ గ్రాఫిక్స్ కోసం మరింత సమయం వెచ్చించి ఉంటే బాగుండేది అనిపిస్తుంది.

ఫైనల్లీ ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్ కి వెళితే దేవర అలరిస్తాడు.