BRO Movie Review: పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన తాజా మూవీ బ్రో. తమిళంలో సూపర్ హిట్గా నిలిచిన వినోదయ సిత్తం అనే సినిమాని తెలుగులో బ్రో పేరుతో రీమేక్ చేశారు. తమిళ సినిమాలో సముద్రఖని పోషించిన పాత్రను తెలుగులో పవన్ కళ్యాణ్ పోషించగా అక్కడ తంబి రామయ్య పోషించిన పాత్రను తెలుగులో సాయి ధరమ్ తేజ్ పోషించారు. తమిళ దర్శకుడు సముద్రఖని ఈ సినిమాని తెలుగులో కూడా డైరెక్ట్ చేశారు. అయితే తెలుగు నీటివిటీకి తగినట్లుగా త్రివిక్రమ్ సినిమాకి డైలాగ్స్ అందించడమే కాక స్క్రీన్ ప్లే కూడా అందించారు. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఆ అంచనాలను రెట్టింపు చేసేలా సినిమా ప్రమోషనల్ స్టఫ్ ఉంది. అలా భారీ అంచనాలతో ఈ శుక్రవారం నాడు బ్రో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మరి ఆ అంచనాలను బ్రో సినిమా ఎంతవరకు అందుకుంది అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.
కథ ఏమిటంటే?
ఒక పెద్ద టెక్స్టైల్ కంపెనీలో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గా పని చేస్తూ ఉంటాడు మార్కండేయులు అలియాస్ మార్క్( సాయి ధరమ్ తేజ్). ఒక సగటు మధ్యతరగతి ఉద్యోగిగా మార్కండేయులు జీవితంలో దేనికీ సరిగా సమయం కేటాయించలేక ప్రతి చిన్న విషయానికి టైం లేదు టైం లేదు అంటూ ఉరుకుల పరుగులతో జీవిస్తూ ఉంటాడు. పెళ్లీడుకు వచ్చిన చెల్లి( ప్రియా ప్రకాష్ వారియర్) చదువుకుంటున్న మరో చెల్లి(యువ లక్ష్మీ) అమెరికాలో కొత్తగా ఉద్యోగంలో చేరిన తమ్ముడు, అనారోగ్యంతో బాధపడుతున్న తల్లి( రోహిణి) వీరందరిని ఎలా అయినా లైఫ్ లో సెటిల్ చేయాలని కష్టపడుతూ ఉంటాడు. అలా ఉరుకులు పరుగులతో జీవిస్తున్న అతను అనుకోకుండా రోడ్డు ప్రమాదానికి గురై మరణిస్తాడు. అయితే అక్కడే అతనికి టైం ( పవన్ కల్యాణ్) ఒక మనిషి రూపంలో ఎదురు వస్తుంది. తాను 30 ఏళ్లకే చనిపోవడం ఏ మాత్రం కరెక్ట్ కాదని చక్కదిద్దాల్సిన పనులు కొన్ని ఉన్నాయి అని చెబితే 90 రోజులు జీవించేలా అవకాశం ఇస్తానని టైం మాటిస్తాడు. ఆ 90 రోజులలో మార్క్ చేయాలనుకున్న పనులు ఏమిటి? మార్క్ అనుకున్నవన్నీ జరిగాయా? మార్క్ తో లైఫ్ షేర్ చేసుకోవాలనుకున్న రమ్య (కేతిక శర్మ) ఏమైంది? చివరికి మార్క్ తొంబై రోజుల తర్వాత బతికే ఉంటాడా? లేదా? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
సాధారణంగానే రీమేక్ సినిమాలు అంటే అందరిలోనూ ఒక రకమైన ఆసక్తి ఏర్పడుతుంది. ఎందుకంటే ఒరిజినల్ గా హిట్ అయిన సినిమాలే ఇతర భాషల్లో రీమేక్ చేస్తూ ఉంటారు. కాబట్టి అలా ఇక్కడ హిట్ అవ్వాలంటే ఖచ్చితంగా చాలా ఫ్యాక్టర్స్ ప్రభావితం చేస్తూ ఉంటాయి. కాబట్టి రీమేక్ సినిమాల మీద అందరి దృష్టి పడుతుంది. అలాగే ఈ బ్రో సినిమా మీద కూడా అందరి దృష్టి పడింది. అయితే తమిళ మాతృకకు తెలుగు బ్రో సినిమాకి చాలా వ్యత్యాసం ఉంటుంది. అక్కడ వయసు అయిపోయిన వ్యక్తికి జీవితంలో రెండో అవకాశం ఇస్తే ఇక్కడ ఒక యువకుడికి రెండో అవకాశం ఇచ్చినట్లయింది. నిజానికి సినిమా నిడివి కూడా చాలా తక్కువే కాబట్టి ఎక్కడా సాగదీయకుండా సుత్తి లేకుండా చెప్పాల్సిన విషయాన్ని క్లియర్గా చెప్పే ప్రయత్నం చేశారు మేకర్స్. సినిమా మొదలైన పదో నిమిషంలోనే పవన్ కళ్యాణ్ ఎంట్రీతో సినిమా కిక్ స్టార్ట్ అవుతుంది. పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత తేజ్ కి రెండోసారి జీవించే అవకాశం ఇవ్వడం, ఆ తరువాత డిజైన్ చేసుకున్న సీన్లు ఆకట్టుకునేలా ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ మొత్తం తేజ్ ఏదైతే ఒక భ్రమలో బతికేస్తున్నాడో ఆ భ్రమను తొలగించే ప్రయత్నం చేయగా సెకండ్ హాఫ్ లో మాత్రం త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ తో అదరగొట్టారు. మీ మనుషులందరూ భస్మాసురుడి వారసులు, నిన్ను నరకం నుంచే నేను స్వర్గానికి తీసుకు వెళుతున్నాను, రేపటి కోసం ఈరోజు తప్పులు చేయకు వంటి త్రివిక్రమ్ మార్క్ డైలాగులు గుర్తుండి పోయేలా రాసుకున్నాడు. నిజానికి ఫస్ట్ ఆఫ్ లో ఎక్కువగా పవన్ కళ్యాణ్ సాంగ్స్ తో ఫ్యాన్స్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. గతంలోని పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ సాంగ్స్ అన్నింటినీ సినిమా కోసం వాడారు. ఫాన్స్ మాత్రం ఈ సాంగ్స్ వచ్చినప్పుడల్లా పండుగ చేసుకుంటారు. అయితే కామన్ ఆడియన్స్ కి కొంత ఈ పాటలు ఎబ్బెట్టుగా అనిపించవచ్చు. అనుకోకుండా లైఫ్ లో సెకండ్ ఛాన్స్ వస్తే దానిని ఎలా ఒక యువకుడు సద్వినియోగం చేసుకున్నాడు అనే చిన్న లైన్ తో ఈ సినిమా మొత్తాన్ని తెలుగు నేటివిటీకి తగినట్టు తెరకెక్కించడంలో సముద్రఖని దాదాపుగా సఫలం అయ్యాడు. త్రివిక్రమ్ మారకు డైలాగులు కూడా ఆద్యంతం ఆకట్టుకుంటాయి.
నటీనటుల విషయానికి వస్తే
ఈ సినిమాలో మార్క్ అనే పాత్రలో కనిపించిన సాయి ధరంతేజ్ తన పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేశాడు. 30 ఏళ్లకే బండెడు కష్టాలు భుజాన వేసుకున్న వ్యక్తి పాత్రలో ఆకట్టుకునేలా నటించాడు. ఒక ఈ సినిమాకి స్టార్ అట్రాక్షన్ అయిన పవన్ కళ్యాణ్ కనిపించినప్పుడల్లా ఏదో తెలియని ఎనర్జీ స్క్రీన్ ను ఆవహించినట్లు చేసాడు. కేతిక శర్మ సాయి ధరంతేజ్ సరసన నటించిన పాత్రకు పెద్దగా ప్రాధాన్యత దక్కలేదు. ప్రియ ప్రకాష్ వారియర్ , రోహిణి , యువలక్ష్మి వంటి వాళ్లకు కాస్త పవన్ కళ్యాణ్, సాయి ధరంతేజ్ తర్వాత ఎక్కువ స్క్రీన్ స్పేస్ లభించింది. వారు తమ తమ పాత్రల పరిధి మేరకు నటించారు. సముద్రఖని కనిపించింది ఒక సీన్ లోనైనా ఆకట్టుకున్నారు. ఇక మిగతా పాత్రధారులు సైతం తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. ఆల్రెడీ తమిళంలో హిట్టు కొట్టిన సినిమాని తెలుగులో రీమేక్ చేసే విషయంలో సముద్రఖని చాలా వరకు సక్సెస్ అయ్యారు. దానికి త్రివిక్రమ్ మార్క్ డైలాగులు స్క్రీన్ ప్లే తోడవడంతో కొంత మ్యాజిక్ కూడా కనిపించింది. సుజిత్ వాసుదేవ్ సినిమాటోగ్రఫీ సినిమాకు బాగా ప్లస్ అయింది. తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో ఆకట్టుకున్నాడు అలాగే కొన్ని సాంగ్స్ మాత్రమే కాదు విజువల్ గా కూడా బాగున్నాయి. ఎడిటింగ్ చాలా క్రిస్పీగా ఉంది. అయితే సినిమాలో వాడిన కంప్యూటర్ గ్రాఫిక్స్ విషయంలో కొంత కేర్ తీసుకుని ఉంటే బాగుండేది.
ప్లస్ పాయింట్స్
తేజ్ – పవన్ కళ్యాణ్ కాంబో
తక్కువ నిడివి
కామెడీ
త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్
మైనస్ పాయింట్స్
కంప్యూటర్ గ్రాఫిక్స్
మిస్సయిన ఎమోషన్స్
ఫైనల్ గా ఒక్కమాటలో చెప్పాలంటే
బ్రో సినిమా ఫాన్స్ కి ఫీస్ట్.. కామన్ ఆడియన్స్ కి ఒక డీసెంట్ వాచ్