కరోనా సమయంలో ఓటీటీల్లో మొదలైన ఆంథాలజీ హవా ఇంకా కొనసాగుతూనే ఉంది. రెండున్నర గంటల సినిమా చూసి ఆనందించే తెలుగు ప్రేక్షకులు సైతం ఈ ఆంథాలజీలను చూసి ఎంజాయ్ చేస్తున్నారు. అయితే… నేటివిటీ లేని పరభాషా అనువాద ఆంథాలజీని చూడాలంటే కాస్తంత విసుగే. ఎంచుకునే అంశం భిన్నమైనదే అయినా… పరాయితనం అందులో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంటుంది. పైగా ఓటీటీ స్ట్రీమింగ్ కాబట్టి… విచ్చలవిడి శృంగార సన్నివేశాలను, బూతు సంభాషణలను పనిగట్టుకుని అందులో ఇరికించేస్తుంటారు. అలా కాకుండా అచ్చతెలుగుదనంతో, అసభ్యతకు తావు లేకుండా వచ్చిన ఆంథాలజీ ‘యాంగర్ టేల్స్’. శుక్రవారం నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్న దీన్ని శ్రీధర్ రెడ్డి, సుహాస్ నిర్మించారు. నితిన్ ప్రభల తిలక్ దర్శకత్వం వహించారు.
ఇందులోని నాలుగు కథల్లో ఉన్న ప్రధానాంశం కోపం. అయితే అది క్షణికావేశం కాదు… రోజుల తరబడి మనిషి తన కోపాన్ని అదిమి పెడితే అగ్నిపర్వతం నుండి పెల్లుబికే లావా లాంటిది. మధ్యతరగతి మనుషుల మనస్తత్వాలు, వారి ఆవేశకావేశాలు, వాటి ఫలితం మీద ఈ కథలు సాగుతాయి. ఇందులో మొదటిది ‘బెనిఫిట్ షో’. కొన్నేళ్ళుగా మనకు ఈ కల్చర్ ఉంది. స్టార్ హీరో సినిమా విడుదల అవుతోందంటే ముందు రోజు రాత్రో లేదంటే తెల్లవారు ఝామునో అభిమానులు బెనిఫిట్ షో వేస్తారు. ఆ సందర్భంలో జరిగే రచ్చకు అంతే ఉండదు. ఓ బెనిఫిట్ షో వెనుక ఎలాంటి తతంగం ఉంటుందనే దాన్ని ఇందులో చూపించారు. స్టార్ హీరో సినిమా ఫ్లాప్ అయితే… లాభపడిన ప్రొడ్యూసర్… కొంత మొత్తాన్ని డిస్ట్రిబ్యూటర్స్ కు వెనక్కి ఇవ్వడం అప్పుడప్పుడూ జరుగుతుంటుంది. అయితే బెనిఫిట్ షో వేసి నష్టపోయిన ఓ అభిమాని ధర్మాగ్రహాన్ని వ్యక్తం చేయడం ఇందులోని కొసమెరుపు. కథంతా బాగానే సాగినా… హీరో ఇంటి ముందు ప్లకార్డ్ పట్టుకుని నిరసన వ్యక్తం చేయడమనేది తేలిపోయింది. అభిమానులు వేసేదే ‘బెనిఫిట్ షో’ అయినప్పుడు ఇంకా నష్టం ఎలా వస్తుంది? పైగా ఇందులో ఆ అభిమానికి పరువు నష్టం జరిగింది తప్పితే… డబ్బుల నష్టం కాదు. హద్దుమీరిన ఆవేశంలో అతను పరువును తాకట్టు పెట్టి… ఆపైన హీరోని టార్గెట్ చేయడం అర్థం లేనిది. ఇందులో అభిమాని రంగాగా వెంకటేశ్ మహా తన నటనతో అదరగొట్టాడు. అలానే పచ్చబొట్టు శ్రీనుగా సుహాస్ మెప్పించాడు. ఇప్పటికే కొన్ని సినిమాల్లో నటించిన వెంకటేశ్ మహాకు మరిన్ని అవకాశాలు వచ్చే అవకాశం ఉంది.
ఇక రెండో కథ… ఫుడ్ ఫెస్టివల్. పూజా ఫుడ్డీ! పెళ్ళి అయిన తర్వాత ఆమె వెజిటేరియన్ గా మారిపోతుంది. అంతే కాదు… వాళ్ళు ఉండే కమ్యూనిటీ మొత్తం అదే. పూజ బలహీనంగా ఉండటంతో డాక్టర్ ప్రతి రోజు ఎగ్ తినమని సలహా ఇస్తుంది. కానీ ఇంట్లో అందుకు ససేమిరా అంటారు. మరి పూజా తన కోరిక ఎలా తీర్చుకుంది? దొంగచాటుగా తినడంతో వచ్చిన ఇబ్బందులు ఏమిటీ? భర్త తీరుపై విసిగి వేసారిన పూజా తన ఆగ్రహాన్ని ఎలా చూపించిందన్నది ఈ కథ. పూజగా మడోన్నా సబాస్టియన్ అందంగా ఉంది, ఆమె భర్తగా తరుణ్ భాస్కర్ చక్కగా నటించాడు. వీరిద్దరి జోడీ బాగానే ఉన్నా… ఈ కాలంలో కూడా ఈ తరం అమ్మాయిలకు ఎగ్ తినడానికి ఇంత ఇబ్బంది ఉందా!? అనే సందేహం కలుగుతుంది. దర్శకుడు చెప్పాలనుకున్న విషయం విలువైనదే అయినా… అందుకోసం ఎంచుకున్న నేపథ్యం అంత బలంగా లేదు. మనలో మనమాట ఇంతకూ ఎగ్ వెజిటేరియనా? నాన్ వెజిటేరియనా!?
మూడోది ‘యాన్ ఆఫ్టర్ నూన్ నాప్’. ఇంటిపనులతో అలసిసొలసి పోయే మహిళలు మధ్యాహ్నం చిన్నపాటి కనుకు తీయాలని కోరుకుంటారు. కానీ కొన్ని సందర్భాలలో అది సాధ్యం కాదు. అరగంట పాటు నిద్రకు దూరమై, అనారోగ్యం పాలైన ఓ మధ్య తరగతి ఇల్లాలు రాధ కథ ఇది. అరాకొరా ఆదాయం, అర్థం చేసుకోని భర్త, పెత్తనం చెలాయించే ఇంటి ఓనర్… వాళ్ల కారణంగా జరిగే నిద్రాభంగం… ప్రతి విషయంలోనూ మెహమాటపడే రాధ… తన అసంతృప్తిని ఎలా వెలుబుచ్చిందన్నదే ఈ కథ. మధ్యతరగతి మహిళకు ఆగ్రహం వస్తే ఏ స్థాయిలో ఉంటుందో ఇందులో చూడొచ్చు. రాధ పాత్రలో బిందు మాధవి ఒదిగిపోయింది. ఆమె భర్తగా రవీంద్ర విజయ్, ఇంటి ఓనర్ గా పద్మజ నటించారు.
ఇక నాలుగో కథ. హెల్మెట్ హెడ్! నగరంలోని టూ వీలర్స్ అందరి సమస్య ఇది. ఆడవాళ్ళనే కాదు… మగవాళ్ళను సైతం విపరీతంగా డిప్రషన్ కు లోను చేసే విషయం హెయిర్ ఫాలింగ్! తల దువ్వుతున్నప్పుడు నాలుగు వెంట్రుకలు దువ్వెనతో వస్తే చాలు ఇక రాత్రిళ్ళు నిద్ర పట్టదు. ఇది ఓ బ్రహ్మచారి విషయంలో జరిగితే!! అదే ఈ కథ. మూడు పదులు దాటిపోయినా పెళ్ళి కాని గిరి రియల్ ఎస్టేట్ కంపెనీలో పనిచేస్తుంటాడు. గిరిది చెప్పుకోదగ్గ ఫిజిక్ కాదు. దానికి తోడు పెళ్ళీ కాలేదు. ఓ పైపు మంచి కంపెనీలో ఉద్యోగం కోసం, ఇంకో వైపు మంచి అమ్మాయితో పెళ్ళి కోసం తెగ ప్రయత్నాలు చేస్తుంటాడు. అతనికి తోడుగా ఉండే ఒక్కగానొక్క పెద్దమ్మ కూడా హఠాత్తుగా చనిపోతుంది. నడిరోడ్డు మీద నిలిచిన గిరి జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? తన బట్టతలకు కారణమైన ఈ వ్యవస్థపై అతను కోపాన్ని ఎలా ప్రకటించాడన్నదే ఈ కథ. గిరి పాత్రలో కొత్తవాడైనా ఫణి ఆచార్య చక్కగా నటించాడు. ఆ పాత్రే మనకు కనిపించేలా చేశాడు. గిరి పెద్దమ్మగా సుధ, బంధువుగా అనంత్ నటించారు. వారూ సహజ నటన కనబరిచారు.
ఈ నాలుగు కథలలో ఎంచుకున్న అంశాలు సున్నితమైనవి. చూడటానికి ఈ సమస్యలు సిల్లీగా కనిపిస్తాయి కానీ తరచి చూస్తే ఎంతో లోతైనవి. అయితే వాటిని పకడ్బందీగా దర్శకుడు తెరకెక్కించలేకపోయాడు. చాలా పేలవంగా కథనం ఉంది. సన్నివేశాలు బలంగా లేవు. కానీ నటీనటుల నటన, సాంకేతిక నిపుణుల ప్రతిభతో ఇది చూడదగ్గ ఆంథాలజీగా మారింది. వారి నుండి మేలైన పనితనాన్ని రాబట్టుకోవడంలో దర్శకుడు సఫలీకృతుడయ్యాడు. ఈ నాలుగు ఎపిసోడ్స్ కు నలుగురు… అమర్ దీప్, వినోద్ కె బంగారి, వెంకట్ ఆర్ శాఖమూరి, ఏజే ఆరోన్ సినిమాటోగ్రఫీ అందించారు. సన్నివేశాలలోని మూడ్ ను ఎలివేట్ చేసేలా సినిమాటోగ్రఫీ ఉంది. స్మరణ్ సాయి తన నేపథ్య సంగీతంతో సీన్స్ ను మరింత హైట్స్ కు తీసుకెళ్ళాడు. కొన్ని ఎపిసోడ్స్ నిడివి ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. వాటిని మరింత ట్రిమ్ చేసి ఉండాల్సింది. ఏదేమైనా అచ్చతెలుగుదనంతో వీటిని తీయడం అభినందించదగ్గది. ఎక్కడా దర్శకుడు శ్రుతి మించే సాహసం చేయలేదు. దాంతో కుటుంబ సమేతంగా హాయిగా చూడొచ్చు. తెలుగులో తీసిన దీన్ని ఏకంగా ఏడు భాషల్లో అనువాదం చేసి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. మిగిలిన భాషల వారు ఏ మేరకు వీటితో కనెక్ట్ అవుతారో చూడాలి!
ప్లస్ పాయింట్స్
ఎంచుకున్న అంశాలు
నటీనటుల నటన
సాంకేతిక నిపుణుల ప్రతిభ
నిర్మాణ విలువలు
మైనెస్ పాయింట్స్
పట్టులేని సన్నివేశాలు
స్లో నెరేషన్
ట్యాగ్ లైన్: జన్యూన్ యాంగర్!