పాకిస్తాన్ తీవ్రవాదంపై భారత్ కఠిన చర్యలు తీసుకుంటున్న సమయంలో, చైనా తీవ్రవాదం నేపథ్యంలో ‘6 జర్నీ’ సినిమా రూపొందింది. రవి ప్రకాష్ రెడ్డి, సమీర్ దత్త, టేస్టీ తేజ, పల్లవి, రమ్యా రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన ‘6 జర్నీ’. అరుణ కుమారి ఫిలింస్ బ్యానర్‌పై పాల్యం శేషమ్మ, బసిరెడ్డి సమర్పణలో నిర్మితమైంది. బసీర్ ఆలూరి దర్శకత్వంలో, పాల్యం రవి ప్రకాష్ రెడ్డి నిర్మాణంలో ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజ్ అయింది. కొత్త నటీనటులతో తెరకెక్కిన ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం…
6 జర్నీ కథ: హైదరాబాద్‌లో వింతైన హత్యలు జరుగుతాయి. ఒక ఫోన్ కాల్ వచ్చిన వెంటనే కొందరు చెవుల నుంచి రక్తం కారి చనిపోతారు. అదే సమయంలో, సెల్ సిగ్నల్స్ నియంత్రించే ప్రభుత్వ అధికారులు కిడ్నాప్ అవుతారు. ఇలా అనేక ఇబ్బందులతో నగరంలో ఉద్రిక్తత నెలకొన్న వేళ, ఆరుగురు స్నేహితులు (రవి ప్రకాష్ రెడ్డి, సమీర్ దత్త, టేస్టీ తేజ, పల్లవి, రమ్యా రెడ్డి & ఒకరు) గోవాకు బయలుదేరతారు. ప్రయాణంలో ఒక వ్యక్తికి లిఫ్ట్ ఇస్తారు. ఆ వ్యక్తే హత్యలకు కారకుడని వారికి అనుమానం కలుగుతుంది. అతడి నుంచి తప్పించుకునే క్రమంలో, తీవ్రవాదులు వీరందరినీ, ఆ వ్యక్తితో సహా, కిడ్నాప్ చేస్తారు. అయితే తీవ్రవాదుల డిమాండ్ ఏమిటి? ఎందుకు వీరిని కిడ్నాప్ చేశారు? ఫోన్ కాల్‌తో ఈ మరణాలకు కారణం ఏమిటి? ఆ ఆరుగురు కుర్రాళ్లు తీవ్రవాదుల ముప్పును ఎలా ఎదుర్కొన్నారు? లాంటి విషయాలు సినిమా చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ
మన ఇండియన్ సినిమాలో తీవ్రవాదం అంటే సాధారణంగా పాకిస్తాన్‌తో ముడిపెడతారు. కానీ ‘6 జర్నీ’ చైనా తీవ్రవాదం నేపథ్యంలో టెక్నాలజీ ఆధారిత కొత్త కోణాన్ని చూపిస్తుంది. తుపాకీ కాకుండా, టెక్నాలజీతో తీవ్రవాదం చేస్తే ఎలా సంక్లిష్టమవుతుందన్నది ఈ సినిమాను ఆసక్తికరంగా మలిచింది. దర్శకుడు బసీర్ ఆలూరి ఎంచుకున్న కాన్సెప్ట్ సరికొత్తగా ఉంది. టాలీవుడ్‌లో ఇప్పటివరకు చూడని తీవ్రవాద కథను అందించే ప్రయత్నం చేశారు. అయితే, దాన్ని స్క్రీన్‌పై ఆకట్టుకునేలా చూపించడంలో తడబడ్డారు. సినిమా ప్రారంభం ఆసక్తి కలిగిస్తుంది. సెల్‌ఫోన్ సిగ్నల్స్ ద్వారా హత్యలు జరగడం కొత్తగా అనిపిస్తుంది. కానీ, ఆరుగురు స్నేహితుల పరిచయం, గోవా ప్రయాణ ఎపిసోడ్స్, లవ్ స్టోరీలు, కామెడీ సన్నివేశాలు రొటీన్ సినిమాలా అనిపిస్తాయి. లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తిపై అనుమాన పడిన తర్వాత కథలో ఉత్కంఠ మొదలై ముందుకు సాగుతుంది. దేశభక్తి, హిందూ-ముస్లిం-క్రైస్తవ ఐక్యతపై డైలాగులు బాగున్నాయి. అయితే, ప్రేమ, కామెడీలో కొత్తదనం లేకపోవడం మైనస్. దర్శకుడు కాన్సెప్ట్ కొత్తగా ఉన్నా, ఎగ్జిక్యూషన్‌లో కొంత వెనకబడ్డారు. చాలా మంది కొత్త నటులు కావడం సినిమాకు సవాలుగా. నిర్మాత కొత్తవారితో పెట్టుబడి పెట్టడం అభినందనీయం.
ఇక నటీనటుల విషయానికి వస్తే హీరోగా రవి ప్రకాష్ రెడ్డి తన పాత్రకు న్యాయం చేశారు, కానీ నటనలో మెరుగుపడాలి. ముగ్గురు హీరోయిన్లలో ఇద్దరు కొన్ని సన్నివేశాల్లో, పాటల్లో గ్లామర్‌తో ఆకట్టుకున్నారు. టేస్టీ తేజ కామెడీతో నవ్వించే ప్రయత్నం చేశారు. ప్రముఖ నటులు లేకపోవడం, అనుభవజ్ఞులైన కాస్ట్ లేకపోవడం సినిమాకు మైనస్. పేరున్న నటులతో తీసి ఉంటే మరింత బాగుండేది.
ఫైనల్లీ : దేశభక్తి నేపథ్యంలో సినిమాలు ఇష్టపడే ప్రేక్షకులకు ‘6 జర్నీ’ నచ్చొచ్చు.