NTV Telugu Site icon

18 Pages MovieReview: 18 పేజీస్ రివ్యూ

18 Pages Movie Review

18 Pages Movie Review

18 Pages MovieReview:’కార్తికేయ -2′ తో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న హీరో నిఖిల్ లేటెస్ట్ మూవీ ’18 పేజీస్’. అయితే ఆ సక్సెస్ ను పరిగణనలోకి తీసుకోకుండా తమ కథ డిమాండ్ మేరకే ’18 పేజీస్’ తెరకెక్కించానంటున్నారు దర్శకుడు సూర్యప్రతాప్. స్టార్ డైరెక్టర్ సుకుమార్ కథ, స్క్రీన్ ప్లే అందించిన ’18 పేజీస్’ను జీఏ2 బ్యానర్ లో బన్నీ వాసు నిర్మించారు. మరి ఈ లవ్ స్టోరీ టార్గెట్ ఆడియెన్స్ ను థ్రిల్ కు గురిచేసిందో లేదో చూద్దాం.

తండ్రి పద్ధతులు నచ్చక ఇంటి నుండి బయటకు వచ్చేస్తాడు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ సిద్ధార్థ్‌ (నిఖిల్). ఓ అమ్మాయిని పిచ్చపిచ్చగా ప్రేమించిన తర్వాత తనను మోసం చేసిందనే విషయం తెలిసి బాధపడతాడు. పూర్తిగా డిప్రషన్ కు వెళ్ళిపోయిన టైమ్ లో అతనికో డైరీ దొరుకుతుంది. నందిని (అనుపమా పరమేశ్వరన్) అనే అమ్మాయి రాసిన ఆ డైరీలోని ఒక్కోపేజీ చదువుకుంటూ వెళుతూ, ఆమెతో ప్రేమలో పడిపోతాడు. అంతేకాదు… ఆమె ప్రతి అలవాటునూ తనదిగా చేసుకుంటాడు. రెండేళ్ళ క్రితం ఆ డైరీలో జరిగిన ఇన్సిడెంట్స్ ను ప్రస్తుత కాలానికి అన్వయించుకుంటూ తడబడుతుంటాడు. 18 పేజీల తర్వాత ఆగిపోయిన ఆ డైరీని చూసి అవాక్కవుతాడు. నందినిని వెతుక్కుంటూ ఆమె గ్రామానికి వెళితే, కారు యాక్సిడెంట్ లో చనిపోయిందని తెలుస్తుంది. అయితే… సిద్ధార్థ్‌ కు ఎక్కడో ఆమె బతికే ఉందనే నమ్మకం! అలా కాకపోయినా… ఆమె చేసిన మంచి పనులను కొనసాగించాలనే ఆలోచనతో ముందుకు సాగుతాడు. ఆ క్రమంలో నందిని గురించి ఇతర వివరాలు అతనికి తెలుస్తాయ. సిద్ధార్థ్‌ బలంగా నమ్మినట్టు నందిని బ్రతికే ఉందా? ఆమెను అతను కలుసుకోగలిగాడు? ఎక్కడో విజయనగరం నుండి నందిని ఓ కవర్ పట్టుకుని హైదరాబాద్ కు ఎందుకొచ్చింది? ఆమె అడ్డు తొలగించాలనుకున్న వ్యక్తులు ఎవరు? అందువల్ల వాళ్ళకు ఒరిగేది ఏమిటి? వారికి సిద్ధార్థ్‌ ఎలా బుద్ధి చెప్పాడు? అనేది మిగతా కథ.

‘రీజన్ చూసి లవ్ చేస్తే, అది ప్రేమెందుకు అవుతుంది?’ అనేది ఆణిముత్యం లాంటి మాట. అదే ఈ సినిమాలోని కోర్ పాయింట్. దీన్ని దర్శకుడు కన్వెన్సింగ్ గా చెప్పే ప్రయత్నంలో చాలానే తిప్పలు పడ్డాడు. స్మార్ట్ ఫోనే జీవితంగా బతుకుతున్న ఈ కాలంలో అస్సలు ఫోనే వాడని ఓ అమ్మాయిని హీరోయిన్ గా పెట్టేశాడు. ఇవాళ ప్రతి పని ఫోన్ మీద సాగుతుండగా, దాన్ని అంటరాని వస్తువుగా చూపడం అంత బాలేదు. అయితే.. నిత్యం చేతిలోనే ఉండే ఫోన్ కారణంగా మనం ఎలాంటి అనుబంధాలకు, ఆత్మీయతలకు దూరం అవుతున్నామనేది దర్శకుడు హృదయానికి హత్తుకునేలా చెప్పాడు. బట్ ఈ క్రమంలో హీరో తండ్రి, తాత ఎపిసోడ్ అంత ఎమోషన్ ను క్యారీ చేయలేదు. అది మరీ ఆర్టిఫిషియల్ గా ఉంది. అలానే నందిని చేయాలనుకున్న పనులను పూర్తి చేయడం ద్వారా ఆమె సజీవంగా ఉన్నట్టే అని హీరో భావించడం సమంజసంగా అనిపించినా, ఆ తర్వాత నందినికి ఎదురుపడిన ప్రతి వారు సిద్ధూ కారణంగానే ఇలా జరిగిందని చెప్పడం కూడా సినిమాటిక్ గా ఉంది. నందిని సనాతన ధర్మ ట్రస్ట్ కు కవర్ అందించడానికి రావడం, దాని వెనుక ఉన్న భూ ఆక్రమణ… ఇలాంటి పాయింట్ తో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. ఇందులో కాస్తంత కొత్తదనం ఏదైనా ఉందంటే… అది డైరీలోని పేజీలను చదువుకుంటూ… హీరో వాటికి కనెక్ట్ కావడం, మిస్ అయిన హీరోయిన్ ను వెతుక్కుంటూ వెళ్ళడమే! ఈ భాగాన్ని దర్శకుడు సూర్య ప్రతాప్ బాగానే డీల్ చేశాడు.

సిద్ధార్థ్‌ గా నిఖిల్ హండ్రెడ్ పర్సంట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఓ రకంగా అతనికి ఈ క్యారెక్టర్ పోషణ కేక్ వాక్ లాంటిది. ఇక నందిని పాత్రలో అనుపమా పరమేశ్వరన్ అద్భుతంగా ఒదిగిపోయింది. ఇది ఆమెకు సంబంధించిన కథ, ఆమె నడిపే కథ. అలానే బిగ్ బాస్ ఫేమ్ బోల్డ్ ఉమన్ సరయు తన ఇమేజ్ కు తగ్గ పాత్రను పోషించి, మంచి మార్కులు కొట్టేసింది. దినేశ్ తేజ్ పోషించిన డాక్టర్ క్యారెక్టర్ ను డిపికల్ గా ప్రెజెంట్ చేసి, ఆడియెన్స్ లో క్యూరియాసిటీని కలిగించారు. ఇతర పాత్రల్లో మనకు అజయ్, శత్రు, గోపరాజు రమణ, పోసాని, రవివర్మ, సత్యసాయి శ్రీనివాస్ తదితరులు కనిపిస్తారు.

సాంకేతిక నిపుణులలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఎ. వసంత్ సినిమాటోగ్రఫీ గురించి. ప్రతి ఫ్రేమ్ ను అందంగా తెరపై చూపించారు. గోపీ సుందర్ నేపథ్య గీతాలకు సమకూర్చిన బాణీలు బాగున్నాయి. ముఖ్యంగా ‘నన్నయ్య రాసిన’ గీతం ఆకట్టుకుంటుంది. అయితే శింబుతో పాడించిన బ్రేకప్ సాంగ్ ఆడియెన్స్ కనెక్ట్ అయ్యేలా లేదు. సినిమా ప్రారంభంలోనే అది రావడం, విషాదగీతంలో వెక్కిరింతలకు స్కోప్ ఇవ్వడంతో సెట్ కాలేదు. ప్రథమార్థంలో స్క్రీన్ ప్లే ఆకట్టుకుంది. ద్వితీయార్థంకు వచ్చేసరికీ అది డ్రాప్ అయ్యింది. అయితే… ద్వితీయార్థంలోని కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులు క్లాప్ కొట్టేలా ఉన్నాయి. హీరోయిన్లను తెరపై అంగడిబొమ్మగా చూపెడుతున్న ఈ రోజుల్లో ఓ ఆదర్శ యువతిగా నందిని పాత్రను కథకుడు సుకుమార్, దర్శకుడు సూర్య ప్రతాప్ మలిచిన తీరుకు అభినందించాలి. ఆ పాత్రకు అనుపమా పరమేశ్వరన్ ను ఎంపిక చేయడం బాగుంది. సరయు నోటి వెంట వచ్చిన పంచ్ డైలాగ్స్ కూడా యూత్ ను ఆకట్టుకున్నాయి. అయితే మల్టీప్లెక్స్ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా తీశారనిపిస్తోంది. మాస్ ఆడియెన్స్ కూ ఇది చేరువైతే మంచిదే!

రేటింగ్ : 2.5 / 5

ప్లస్ పాయింట్
నిఖిల్, అనుపమా నటన
ఆకట్టుకునే స్క్రీన్ ప్లే
సరయు అందించిన వినోదం
ఆకట్టుకునే సినిమాటోగ్రఫీ

మైనెస్ పాయింట్స్
ఎక్స్ పెక్టెడ్ క్లయిమాక్స్
బలమైన ప్రత్యర్థి లేకపోవడం
సినిమాటిక్ సీన్స్

ట్యాగ్ లైన్: ఇంట్రస్టింగ్‌ పేజెస్!

Show comments