వచ్చే ఎన్నికలే లక్ష్యంగా ఏపీలో అధికార వైసీపీ పక్కాగా రణతంత్రం రచిస్తోందా? సీట్ల సర్దుబాటుపై సీఎం జగన్ కసరత్తు మొదలు పెట్టారా? ప్రస్తుతం MPలుగా ఉన్నవాళ్లకు స్థాన చలనం తప్పదా? MPలలో కొందరు ఎమ్మెల్యే అభ్యర్థుగా బరిలో దిగుతారా? మరికొందరికి ఉద్వాసన తప్పదా? సీట్లు కదులుతున్నాయా? లెట్స్ వాచ్..!
ఎంపీల పనితీరుపై వడపోతలు
గత అసెంబ్లీ ఎన్నికల్లో 151 చోట్ల గెలిచి సంచలనం సృష్టించిన వైసీపీ.. 2024 ఎన్నికలపై రెండేళ్ల ముందు నుంచే ఫోకస్ పెట్టింది. ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ సీట్లు గెలవాలన్నది సీఎం జగన్ లక్ష్యం. ఇటీవల జరిగిన పలు సమావేశాల్లో వైసీపీ నేతలకు దిశానిర్దేశం కూడా చేస్తున్నారు. ఆ మేరకు క్షేత్రస్థాయిలో 360 డిగ్రీల సర్వేలు నిర్వహిస్తున్నారు అధినేత. ఇప్పటికే ఐప్యాక్ టీమ్‌లు నియోజకవర్గాలను జల్లెడ పడుతున్నాయి. ఎంపీలు.. ఎమ్మెల్యేలు.. సీనియర్ వైసీపీ నాయకుల పనితీరును క్షుణ్ణంగా వడపోస్తున్నాయి. నిఘా వర్గాల నుంచీ ఎప్పటికప్పుడు సమాచారం అధిష్ఠానానికి చేరుతోంది. ముఖ్యంగా గడప గడపకు మన ప్రభుత్వం విషయంలో సీఎం జగన్ చాలా నిక్కచ్చిగా ఉన్నారు. గడప దాటని వారు ఎంత సీనియర్లు అయినా.. సమావేశాల్లో వారికి నేరుగా.. సూటిగా సుత్తిలేకుండా వార్నింగ్ ఇస్తున్న పరిస్థితి. ఈ క్రమంలోనే వైసీపీ ఎంపీల విషయంలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఎంపీలు..?
ఏపీలోని 25 లోక్‌సభ సీట్లలో గత ఎన్నికల్లో వైసీపీ 22 గెలుచుకుంది. శ్రీకాకుళం, గుంటూరు, విజయవాడ వైసీపీ ఖాతాలో పడలేదు. ఇప్పుడు వైసీపీ లోక్‌సభ సభ్యుల్లో సగం మందికి వచ్చే ఎన్నికల్లో తిరిగి ఎంపీ టికెట్స్ రాబోవన్నది తాజా టాక్. వాస్తవానికి ఒకసారి ఎంపీ అయినవాళ్లు.. మళ్లీ మళ్లీ అదే సీటు నుంచి పోటీ చేసి సుదీర్ఘకాలం లోక్‌సభ సభ్యులుగా కాలం వెళ్లదీస్తారనే వాదన ఉండేది. కానీ.. వైసీపీ సర్దుబాటు దిశగా కీలక అడుగులు వేస్తున్నట్టు సమాచారం. ఒక్కో లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉంటాయి. ఎంపీ అభ్యర్ధి పనితీరు.. సమర్థత అసెంబ్లీ సీట్లపై ప్రభావం చూపుతుంది. ఆ లెక్కలు కూడా మార్పులు చేర్పులకు ఆస్కారం ఇస్తున్నట్టు తెలుస్తోంది. కొందరు ఎంపీలకు ఉద్వాసన పలికితే.. మరికొందరికి స్థాన చలనం ఉంటుందని చెవులు కొరుక్కుంటున్నారు. మరోచోటు నుంచి లోక్‌సభకు పోటీ చేయొచ్చని.. లేదా ఎమ్మెల్యే అభ్యర్థులుగా బరిలో ఉంటారని టాక్. అందుకే పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా లెక్కలు దగ్గర పెట్టుకుని ప్లస్సులు.. మైనస్సులు వేస్తున్నారట. అలాగే గత రెండు ఎన్నికల్లో వైసీపీ ఖాతాలో పడని నియోజకవర్గాలపై గట్టిగా ఫోకస్ పెట్టినట్టు చెబుతున్నారు.
వైసీపీ అధిష్ఠానం నుంచి ఎంపీలకు సంకేతాలు?
ఈ మార్పులు చేర్పులు గురించి తెలిసిన తర్వాత ఏ ఎంపీ ఎక్కడికి వెళ్తారు? మళ్లీ ఎంపీగా పోటీ చేస్తారా లేదా? ఒకవేళ అసెంబ్లీకి పోటీ చేయాలంటే వారికి అనువైన సెగ్మెంట్ ఏంటి? అని ఆరాలు తీస్తున్నారు. ఇప్పటికే కొందరు ఎంపీలకు వైసీపీ అధిష్ఠానం నుంచి సంకేతాలు వెళ్లాయని.. ఆ మేరకు నిర్దేశించిన అసెంబ్లీ నియోజకవర్గాల్లో వారు పనులు చేసుకుంటున్నారని సమాచారం. ఈ క్రమంలో కొందరి పేర్లపై విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. వారిలో విశాఖ ఎంపీ MVV సత్యనారాయణ కూడా ఉన్నారట. విశాఖ తూర్పులో టీడీపీ నుంచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిచిన వెలగపూడి రామకృష్ణబాబుపై వచ్చే ఎన్నికల్లో MVV వైసీపీ నుంచి పోటీ చేస్తారని టాక్. MVV అయితే బలమైన ప్రత్యర్థిగా మారతారని భావిస్తోందట. అందుకే తూర్పుపై ఎక్కువ ఫోకస్ పెట్టాలని ఎంపీకి చెప్పేశారట.
పిఠాపురం అసెంబ్లీ బరిలో వంగా గీత..?
గత ఎన్నికల్లో కాకినాడ నుంచి ఎంపీగా గెలిచిన వంగా గీతను సైతం వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయిస్తారని చెబుతున్నారు. గతంలో పీఆర్పీ నుంచి ఆమె ఎమ్మెల్యేగా గెలిచిన పిఠాపురంలోనే వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి బరిలో ఉంటారని తెలుస్తోంది. ఆమె కూడా అసెంబ్లీకి వెళ్లడానికి ఆసక్తిగా ఉన్నట్టు సమాచారం. వచ్చే ఎన్నికల్లో జనసేనాని పవన్ కల్యాణ్ పోటీ.. ముద్రగడ పద్మనాభం జాయినింగ్‌ను బట్టి పిఠాపురం సీటుపై వైసీపీ మరింత క్లారిటీ ఇస్తుందని చెబుతున్నారు. ప్రస్తుతం పిఠాపురంలో వైసీపీ ఎమ్మెల్యేగా పెండెం దొరబాబు ఉన్నారు. సర్వేలో దొరబాబుకు మార్కులు పడలేదో ఏమో.. వంగా గీత మాత్రం పిఠాపురంలో వేగంగానే పావులు కదుపుతున్నారట. ఇక అమలాపురం ఎంపీ చింతా అనురాధ సైతం వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ బరిలో ఉంటారట. అమలాపురం లేదా పి.గన్నవరం నుంచి అనురాధను పోటీ చేయించొచ్చని తెలుస్తోంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఏర్పాటు తర్వాత అమలాపురంలో జరిగిన అల్లర్లు.. తర్వాత మారిన సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని మార్పులు ఉంటాయని భావిస్తున్నారు.
రాజమండ్రి అర్బన్ బరిలో ఎంపీ భరత్?
రాజమండ్రి ఎంపీగా ఉన్న మార్గాని భరత్ వచ్చే ఎన్నికల్లో రాజమండ్రి అర్బన్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని టాక్. ఇప్పటికే రాజమండ్రి అర్బన్‌లో అనేక ప్రయోగాలు చేసింది వైసీపీ అధిష్ఠానం. అవేమీ వర్కవుట్ కాకపోవడంతో భరత్‌ను బరిలో దించే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం అర్బన్‌లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని భరతే పర్యవేక్షిస్తున్నారు. ఇక నరసరావుపేట ఎంపీగా ఉన్న శ్రీకృష్ణదేవరాయులకు వైసీపీ అధిష్ఠానం కొత్త సూచన చేసిందట. వచ్చే ఎన్నికల్లో ఆయన్ను గుంటూరు ఎంపీగా పోటీ చేయించే వీలుందట. అందుకు సిద్ధంగా ఉండాలని పార్టీ పెద్దలు MPకి చెప్పినట్టు సమాచారం. వైసీపీ ఇంత వరకు గుంటూరు లోక్‌సభలో పాగా వేయలేదు. అక్కడ టీడీపీ నుంచి గెలిచిన గల్లా జయదేవ్ కమ్మ సామాజికవర్గానికి చెందిన నాయకుడు.. ఆర్థికంగా బలమైన వ్యక్తి. దాంతో అదే సామాజికవర్గానికి చెందిన శ్రీకృష్ణదేవరాయులను పోటీకి పెడితే ఆ సీటు వైసీపీ ఖాతాలో పడుతుందనే లెక్కలు వేస్తున్నారట.
నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి..?
ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా చర్చల్లో నలిగిన హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ సైతం వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేస్తారట. ఆయన ఉమ్మడి కర్నూలు జిల్లా పత్తికొండపై ఫోకస్ పెట్టినట్టు చెబుతున్నారు. అక్కడ కురుబ సామాజికవర్గం ఓట్లు ఎక్కువగా ఉంటడంతో.. అదే సామాజికవర్గానికి చెందిన మాధవ్‌కు కలిసి వస్తుందని అనుకుంటున్నారట. అలాగే అనంతపురం ఎంపీ తలారి రంగయ్య సైతం ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ఆసక్తిగా ఉన్నారట. ఆయన కల్యాణదుర్గంపై కన్నేశారట. తన సామాజికవర్గానికి చెందిన బోయ కులస్తులు ఎక్కువగా ఉండటంతో కలిసి వస్తుందనే లెక్కల్లో ఉన్నారు రంగయ్య. అయితే కల్యాణదుర్గం ఎమ్మెల్యేగా గెలిచిన ఉషాశ్రీచరణ్ ప్రస్తుతం మంత్రి. ఆమెను కాదని రంగయ్యకు సీటు ఇస్తారా అనేది ప్రశ్న. ఒకవేళ కల్యాణదుర్గం కాకపోతే గుంతకల్లు నుంచి రంగయ్య బరిలో ఉండొచ్చనే ప్రచారం ఉంది. ఇదే విధమైన మార్పులు చేర్పులు నెల్లూరులోనూ ఉంటాయట. రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి నెల్లూరు ఎంపీగా పోటీ చేయొచ్చని టాక్. ప్రస్తుతం ఎంపీగా ఉన్న ఆదాల ప్రభాకర్‌రెడ్డిని రాజ్యసభ లేదా.. నెల్లూరు నగరం, కావలిలో ఒకచోట అసెంబ్లీ టికెట్ ఇవ్వొచ్చని చెబుతున్నారు. ఇదే విధంగా మిగతా ఎంపీల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారని సమాచారం. అయితే ఎంపీలను MLA అభ్యర్థులుగా బరిలో దించే చోట అక్కడ వైసీపీ నుంచి ఎంపీగా పోటీ చేసేది ఎవరో స్పష్టత రావాల్సి ఉంది. అందుకే ఈ అంశం అధికార పార్టీలో కాక రేపుతోంది.