మతుకుమిల్లి శ్రీభరత్. గీతమ్ చైర్మన్‌గా, హీరో బాలకృష్ణ చిన్న అల్లుడుగా సుపరిచితం. గత ఎన్నికల ముందు అనూహ్యంగా శ్రీభరత్ పేరును తెరపైకి తెచ్చింది టీడీపీ. వైజాగ్ ఎంపీగా పోటీ చేయించింది. హోరాహోరీగా సాగిన త్రిముఖ పోటీలో భరత్ 4 వేల ఓట్ల తేడాతో పోడిపోయారు. కాకపోతే విశాఖ లోక్‌సభ పరిధిలోని 4 అసెంబ్లీ స్ధానాలను టీడీపీ గెలుచుకుంది. విశాఖ పశ్చిమ, దక్షిణ, తూర్పు నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యేలకు బంపర్ మెజార్టీ వచ్చినప్పటికీ ఎంపీగా శ్రీభరత్ ఓటమి అప్పట్లో చర్చకు దారితీసింది. క్రాస్ ఓటింగ్‌ను ప్రోత్సహించడం వల్లే టీడీపీకి ఎంపీ స్థానం దక్కలేదని చర్చ నడిచింది. ఓటమి తర్వాత కారణాలను విశ్లేషించుకున్న శ్రీభరత్ పార్టీలో అంతర్గత వ్యవహారాలపై కినుక వహించారట. అందుకే మూడేళ్లుగా ఆయన వ్యాపారాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూనే యువకులు, విద్యావంతులతో ఇంట్రాక్ట్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. టాక్ విత్ భరత్ వంటి కార్యక్రమాలతో నిరంతరం టచ్‌లో ఉంటున్నారు కూడా.
రాష్ట్రంలో మళ్లీ రాజకీయ వేడి రాజుకుంది. ప్రధాన రాజకీయ పార్టీలు కీలకంగా భావించే విశాఖపట్నం ఎంపీ పదవి హాట్ కేక్ అనే ప్రచారం ఊపందుకుంది. దీంతో అభ్యర్ధులు ఎవరు? రాజకీయ పార్టీల వ్యూహాలు ఏ విధంగా వుంటాయనే చర్చ నడుస్తోంది. గతంలో వచ్చిన ఓట్లు ఆధారంగా లెక్కలతో కుస్తీ పడుతున్నాయి పార్టీలు. ఈ సందర్భంగా టీడీపీ అభ్యర్ధి ఎవరు అనేది ఆసక్తిగా మారింది. తిరిగి ఎంపీగా పోటీ చేయడానికి శ్రీభరత్ ఆసక్తిగానే ఉన్నారనేది పార్టీ వర్గాల సమాచారం. గత ఎన్నికల తర్వాత ఆయన్ను విశాఖ దక్షిణ నియోజకవర్గ ఇన్చార్జ్‌గా నియమించింది టీడీపీ. ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ పార్టీ ఫిరాయించడంతో సౌత్ బాధ్యతలను కొంత కాలం చూశారు. టీడీపీకి బలమైన నియోజకవర్గం కావడంతో శ్రీభరత్ పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది. కానీ, ఆయన మాత్రం ఢిల్లీ సభకు వెళ్లేందుకే మొగ్గు చూపుతున్నారనేది అంతర్గత సమాచారం. అయితే ఎన్నికల నాటికి ఈ అంచనాలు, లెక్కలు ఉంటాయా? మారిపోతాయా? అనేది హాట్ టాపిక్. దీనికి కారణం జనసేన, టీడీపీ పొత్తులపై జరుగుతున్న ప్రచారమే.
ఉత్తరాంధ్రపై టీడీపీ, జనసేన ఎక్కువ ఫోకస్ పెట్టాయి. గత ఎన్నికల్లో ఒకప్పటి టీడీపీ కంచుకోటను బద్ధలు కొట్టేసింది వైసీపీ. శ్రీకాకుళం, విశాఖలో కొన్ని ఎమ్మెల్యే సీట్లు సాధించినా.. విజయనగరం జిల్లాలో ఘోరమైన ఓటమి టీడీపీకి ఎదురైంది. ఆ అనుభవాలను దృష్టిలో పెట్టుకుని టీడీపీ జాగ్రత్త పడుతోంది. జనసేన సైతం ఉత్తరాంధ్రపై ఎక్కువ ఆశలు పెట్టుకుంది. సందర్భం వచ్చిన ప్రతీసారీ పవన్ కల్యాణ్ ఇక్కడి సమస్యలపై ప్రస్తావిస్తున్నారు. విశాఖ ఎంపీగా జనసేన అభ్యర్ధి ఉండాలని పట్టుబట్టే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. విశాఖపట్నం ఎంపీ పదవి అనేది వలస నాయకులను వరించినంతగా స్ధానికులు రాణించలేకపోవడమే దానికి కారణం. ఆ ఎన్నికల్లో జనసేన, టీడీపీ వేర్వేరుగా పోటీ చేస్తే లక్ష్మీనారాయణకు 2 లక్షల 88 వేల 874 ఓట్లు వచ్చాయి. ఇప్పుడు రెండు పార్టీలు కలిస్తే ఈజీగా గెలుస్తామని అంచనా వేస్తున్నారు. పొత్తులు సాకారమైతే విశాఖ ఎంపీ సీటును జనసేన పట్టుబట్టే వీలుంది.
అదే జరిగితే శ్రీభరత్ స్ధానం ఏంటి…? అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. ప్రస్తుతానికి ఇవన్నీ చర్చలే అయినప్పటికీ జనసేనతో పొత్తు సాధ్యమైతే జరిగేది ఇదేనంటున్నాయి టీడీపీ వర్గాలు. వైజాగ్ ఎంపీ సాధ్యం కాకపోతే ఎమ్మెల్యే అభ్యర్ధిగా అవకాశం ఇస్తారా? ఎక్కడి నుంచి పోటీ చేయిస్తారనేది ఒక చర్చ. ప్రస్తుతం విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఖాళీ ఏర్పడనుంది. ఇక్కడ నుంచి గెలిచిన మాజీ మంత్రి గంటాశ్రీనివాసరావు ఈసారి హైకమాండ్ టిక్కెట్ ఇస్తే భీమిలివైపు ఆసక్తిగా ఉన్నారు. అయితే జనసేన ఆశిస్తున్న ఎమ్మెల్యే స్ధానాల్లో ఇదీ ఒకటి. విశాఖ ఉత్తరం, పెందుర్తి, యలమంచిలి స్ధానాలు తమకు కేటాయిస్తారనే అంచనాల్లో ఉంది జనసేన. దీంతో శ్రీభరత్ దారెటు? ఆయనకు పోటీ చేసే అవకాశం లభిస్తుందా? అనేది ఉత్కంఠ రేపుతోంది. ఈ అంశం కొలిక్కి రావాలంటే కొన్ని రోజులు వేచి చూడక తప్పదు. అప్పటి వరకు చర్చ ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.