తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్‌గా మాణిక్యం ఠాగూర్ కొనసాగుతారా.. కొత్త వ్యక్తి వస్తారా? అయితే బాధ్యతలు చేపట్టే ఆ మూడో కృష్ణుడు ఎవరు? ప్రస్తుతం కాంగ్రెస్ వర్గాల్లో.. గాంధీభవన్ సర్కిళ్లలో ఇదే చర్చ జోరుగా ఉంది. ఇంతకీ ఠాగూర్ ఎందుకు వెళ్లిపోతారు? ఆయన ఫోకస్ దేనిపై ఉంది?
తమిళనాడు పీసీసీ పీఠంపై ఠాగూర్ కన్ను
తెలంగాణ పీసీసీ చీఫ్ ఎంపిక ప్రక్రియలో ఇన్నాళ్లూ బిజీగా ఉన్న కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్.. మరో పదవిపై మనసు పారేసుకున్నారట. తెలంగాణతో పాటు తమిళనాడుకు కూడా కొత్త పీసీసీ సారథిని ఎంపిక చేయాలని హైకమాండ్ ఆలోచిస్తోంది. ఆ పోస్ట్‌పై ఠాగూర్ ఫోకస్ పెట్టారట. తమిళనాడులో స్టాలిన్ ప్రభుత్వంతో కాంగ్రెస్‌కు దోస్తీ ఉంది. అందుకే తమిళనాడు పీసీసీ చీఫ్ పదవిపై ప్రయత్నాలు ముమ్మరం చేశారట. కాంగ్రెస్ సంస్థాగత నిర్మాణ వ్యవహారాలు చూస్తోన్న KC వేణుగోపాల్‌తో కలిసి ఠాగూర్ గట్టిగానే లాబీయింగ్ చేస్తున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఠాగూర్‌కు మోకాలడ్డుతోన్న కేంద్ర మాజీ మంత్రి చిదంబరం!
తెలంగాణ కాంగ్రెస్‌లో ఏ విధంగా అయితే వర్గ రాజకీయం ఉందో.. తమిళనాడు కాంగ్రెస్‌లోనూ సేమ్ సీన్. ఠాగూర్ అభ్యర్థిత్వాన్ని కేంద్ర మాజీ మంత్రి చిదంబరం వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోందట. దీనికితోడు రాహుల్, ప్రియాంకగాంధీ కోటరీలో ఠాగూర్‌కు ప్రాధాన్యం తగ్గిందనే ప్రచారం స్పీడందుకున్నట్టు చెబుతున్నారు. ఎవరి వాదన ఎలా ఉన్నా.. ఠాగూర్ మాత్రం తమిళనాడు పీసీసీ చీఫ్ పీఠం కోసం ఓ రేంజ్‌లో ట్రై చేస్తున్నట్టు ఢిల్లీ వర్గాలు కూడా వెల్లడిస్తున్నాయి. మరి.. ఆ విషయంలో ఆయన ఎంత వరకు సక్సెస్ అవుతారో కానీ.. తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త చర్చ అయితే మొదలైంది.
రెండేళ్ల వ్యవధిలోనే తెలంగాణకు మూడో ఇంఛార్జ్?
ఠాగూర్ తమిళనాడు పీసీసీ చీఫ్ అయితే.. తెలంగాణ AICC వ్యవహారాల ఇంఛార్జ్‌గా తప్పుకోవాల్సి వస్తుంది. ఆయన స్థానంలో కొత్త ఇంఛార్జ్ వస్తారని చెవులు కొరుక్కుంటున్నారు. వాస్తవానికి ఠాగూర్ ఇంఛార్జ్‌గా వచ్చి ఎంతో కాలం కాలేదు. రామచంద్ర కుంతియా స్థానంలో ఆయన వచ్చారు. ఇప్పుడు ఠాగూర్ వెళ్లి మూడో కృష్ణుడు వస్తే.. రెండేళ్ల వ్యవధిలోనే ముగ్గురు మారినట్టు అవుతుంది. ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టుగా.. ఠాగూర్ ప్లేస్‌లో వచ్చే కొత్త ఇంఛార్జ్ ఎవరనేదానిపై అప్పుడే చర్చోపచర్చలు కాంగ్రెస్‌లో మొదలయ్యాయి.
ముకల్ వాస్నిక్ ఇంఛార్జ్‌గా రావొచ్చని కొందరు ప్రచారం
తెలంగాణ కాంగ్రెస్‌కు ఇంఛార్జ్‌గా ఠాగూర్ వచ్చాక.. ఇక్కడ పార్టీ సీనియర్ నేతలతో ఆయనకు పొసగడం లేదు. లేఖలు, మాటల యుద్ధం సాగుతోంది. తెలంగాణ పీసీసీకి కొత్త చీఫ్ ఎంపిక కసరత్తు కూడా ఢిల్లీలో జరుగుతోంది. అన్ని అనుకున్నట్టు సాగితే తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త పీసీసీ ఛీప్‌తోపాటు.. AICC రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ కూడా కొత్త ముఖం రావొచ్చని అనుకుంటున్నారు. కొత్త ఇంఛార్జ్‌గా వచ్చేవారిలో సీనియర్ నాయకుడు ముకుల్ వాస్నిక్ పేరు గట్టిగా వినిపిస్తోంది. పార్టీ నిర్మాణం.. రాజకీయ ఎత్తుగడలు వేయడంతోపాటు నాయకులను కట్టడి చేయడంలో వాస్నిక్ నేర్పరిగా పార్టీ వర్గాల్లో ఉన్న టాక్. తెలంగాణకు పొరుగున ఉన్న మహారాష్ట్ర నేత కావడంతో.. పార్టీకి కూడా కలిసి వస్తుందన్న అభిప్రాయం ఉందట. పైగా రాష్ట్రంలోని చాలా మంది నాయకులకు వాస్నిక్‌తో సంబంధాలు ఉన్నాయి.
ప్రచారంలో రమేష్ చెన్నితాల పేరు
తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్‌గా మరో నాయకుడి పేరు కూడా వినిపిస్తోంది. కేరళకు చెందిన రమేష్ చెన్నితాల రావొచ్చని కొందరు అనుకుంటున్నారు. రాహుల్ కోటరీలో ఆయన కీలక నాయకుడు. కేరళ హోంమంత్రిగా పని చేశారు. పార్టీలో అన్నీ స్థాయిల్లో పని చేశారు. కేరళ కాంగ్రెస్‌లో పంచాయితీల కారణంగా.. చెన్నితాలకు ఏదో ఇక రాష్ట్ర కాంగ్రెస్ బాధ్యతలు అప్పగించే ఆలోచనలో ఉన్నారట రాహుల్. ఒకవేళ మాణిక్యం ఠాగూర్ తమిళనాడు పీసీసీ చీఫ్ అయితే.. ఆయన ప్లేస్‌లో ఇంఛార్జ్‌గా ముకుల్ వాస్నిక్, రమేష్ చెన్నితాల పేర్లు పరిశీలనలో ఉన్నట్టు చెబుతున్నారు.
ఠాగూర్ వచ్చిన కొత్తలో ఏవేవో ఊహలు!
రాష్ట్ర ఇంఛార్జ్‌గా ఠాగూర్ తెలంగాణ వచ్చిన కొత్తలో రాహుల్ కోటరీ నాయకుడు కావడంతో ఏవేవో ఊహించుకున్నాయి పార్టీ వర్గాలు. సీనియర్ నాయకుల ముందు ఆయన తేలిపోయారు. రావడం రావడంతోనే ఓ అజెండాతో వచ్చారని మొదలుపెట్టి… చేయాల్సిన రచ్చ చేసి పడేశారు. తాజా పరిణామాల తర్వాత ఠాగూర్ కంటిన్యూ అవుతారో లేదంటే కొత్త కృష్ణుడిని తెర మీదకు వస్తారో చూడాలి.!